మీనాక్షిపై పగ పట్టిన పల్లవి.. ఆమెను ఏదో విధంగా చిత్ర హింసలకు గురి చేయాలని చూస్తూనే ఉంది. ఆమె స్నేహితుల్ని ఇంటికి పిలిపించి.. వాళ్ల ముందే మీనాక్షిని ఘోరంగా అవమానిస్తుంది పల్లవి.
ఈరోజు (జూన్ 24) రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే.. వెళ్లి మా నలుగురికి కాఫీ చేసి తీసుకుని రా అని మీనాక్షికి ఆర్డర్ వేస్తుంది పల్లవి. సరేనని వెళ్లి కాఫీ పెట్టి తీసుకుని రావడానికి వెళ్తుంది మీనాక్షి. ఇంతలో పల్లవి స్నేహితురాలు.. ‘ఫారిన్ నుంచి ఇప్పుడే వచ్చాను.. వచ్చిన వెంటనే మీ అమ్మగారు చనిపోయాని తెలిసింది.. వెంటనే వచ్చేశాను.. మీ అమ్మగారు ఎలా చనిపోయారు’ అని పల్లవిని అడుగుతుంది. ఏం చెప్తాం అమ్మా.. అంతా మా దురదృష్టం అని అంటుంది భానుమతి. ఇంతలో మీనాక్షి టీ పట్టుకుని వచ్చి తీసుకోమని ఇస్తుంది. వయసు రాగానే సరిపోదు.. ముందుగా వచ్చిన గెస్ట్‌లకు ఇవ్వాలని తెలియదా? అని చురకలు వేస్తూ.. ముందు వాళ్లకి ఇవ్వూ అని అరుస్తుంది పల్లవి. వాళ్లకి టీ ఇస్తుండగా.. కాలు జారి టీ వాళ్ల మీద పడుతుంది. వేడి వేడి టీ మీద పడేసరికి కెవ్వుమని అరుస్తారు. అది చూసి పల్లవి ఆగ్రహంతో ఊగిపోతుంది.అయ్యయ్యో.. వేడి వేడి కాఫీ తగులబెట్టేసింది.. ఈమె మీర్జాపూర్ మహారాణి మరి సరిగ్గా అప్పుడే అవని కూడా వస్తుంది. కళ్లు కనిపించడం లేదా? ఎవరు ఈవిడా అని అంటుంది పల్లవి స్నేహితురాలు. ఈవిడా.. మా ఇంట్లో పని మనిషి.. అని అంటుంది పల్లవి. ఛీ ఛీ పని మనిషికి ఇంత పొగరు ఏంటి? ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయాలని తెలియదా?? ఇలాంటి వాళ్లనీ అని నోటికొచ్చినట్టు పేలుతుంటుంది పల్లవి స్నేహితురాలు. ఇంతలో అవని.. ఆపండ్రా.. ఆపండ్రా అన్న రేంజ్లో వస్తుంది. ఎవరేంటో తెలుసుకోకుండా నోటికొచ్చినట్టు వాగితే మర్యాదగా ఉండదు జాగ్రత్త. ఎవర్ని పట్టుకుని పని మనిషి అంటున్నావ్ అని అంటుంది అవని. ‘లేకపోతే మీర్జాపూర్ మహారాణి అని పరిచయం చేయనా? అని అంటుంది పల్లవి.ఆమె నీ కన్నతల్లి.. నిజం చెప్పేసిన అవని నోర్ముయ్.. ఆవిడ ఎవరో తెలుసా నీకు.. నీ కన్నతల్లి అని అంటుంది అవని. దెబ్బకి అక్కడున్న వాళ్లంతా షేక్ అయ్యి షాక్ అయిపోతారు. ఏంటీ ఏమన్నావ్..? నా కన్నతల్లా? అని అడుగుతుంది పల్లవి. దాంతో నిజం చెప్పే అలవాటే లేని పల్లవి.. వెంటనే ప్లేట్ తిప్పేస్తుంది. అదే.. నా కన్నతల్లి నీ కన్నతల్లి లాంటిది అని అన్నాను అని అంటుంది. నాకు కన్నతల్లి ఉంది.. ఆమె ఉన్నా లేకపోయినా ఆమెనే నా కన్నతల్లి. గతిలేని వాళ్లందర్నీ నా కన్నతల్లి అని అనుకునేంత కర్మ పట్టలేదు. నీ కన్నతల్లిని నా కన్నతల్లి అని అంటే మర్యాదగా ఉండదు అని అంటుంది పల్లవి. నీ తల్లిని నా తల్లి అంటే నాకు కోపం రాదా? మీ అమ్మని పనిమనిషి అన్నందుకే నీకు అంత పౌరుషం తన్నుకొస్తుంటే.. నీ తల్లిని నా తల్లి అంటే ఎంత కోపం రావాలి? అని అంటుంది పల్లవి. ఆ మాటతో అవని.. ‘సృష్టిలో తల్లిని మించిన గొప్ప వ్యక్తి ఎవరూ ఉండరు’ అంటూ ఉపన్యాసం ఇస్తుంది. చెప్పాల్సిందంతా చెప్పేసి.. నాకు సంస్కారం ఉంది అందుకే నీలాంటి దానితో ఎక్కువగా వాదించాలని అనుకోవడం లేదు అని మీనాక్షిని తీసుకుని లోపలికి వెళ్లిపోతుంది అవని. ఇక రాత్రి అయ్యేసరికి తన తల్లికి జరిగిన అవమానాన్ని తలుచుకుని బాధపడుతుంది అవని. ఇంతలో అక్షయ్ వచ్చి ఏమైందని అడుగుతాడు. ఆ పల్లవే ఏదో డిస్ట్రబ్ చేసింది కదా అని అంటాడు.ఆ నిజం ఎప్పటికైనా తెలియాల్సిందే కదా.. ఆమె ఎప్పుడు మారుతుందో అర్థం కావడం లేదు.. అంటూ జరిగింది మొత్తం చెప్తుంది అవని. దాంతో అక్షయ్.. ఆ పల్లవి పని చెప్తా.. బుద్ధి చెప్తానంటూ ఉడత ఊపులు ఊపుతాడు. అవని ఎప్పటిలాగే వెళ్లొద్దని ఆపేస్తుంది. ఎప్పటికైనా నిజం తెలియాల్సిందే కదా.. మీ అమ్మే తన తల్లి అని పల్లవికి చెప్పాలి.. కానీ మీ అమ్మ గారి గురించి కూడా ఆలోచించాలి అని అంటాడు అక్షయ్. ఇంతలో ఆరాధ్య వచ్చి.. అమ్మమ్మ ఎప్పుడూ మనతోనే ఉంటుంది కదా అని అడుగుతుంది. అమ్మమ్మ మనతోనే ఉంటుంది.. అందరం హ్యాపీగా ఉంటాం అని అంటారు అక్షయ్, అవనిలు. సరిపోయారు ఇద్దరూ.. ‘ఏ ఉపయోగం’?? అటు శ్రీకర్, కమల్‌లు కూర్చుని మీనాక్షి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అత్తయ్యని విడిపించగలమో లేదో నని టెన్షన్ పడ్డాం.. మొత్తానికి బయటకు తీసుకుని వచ్చాం.. చాలా హ్యాపీగా ఉంది.. అవని వదిన మనకోసం ఎంతో చేసింది.. అత్తయ్యని విడిపించి ఉండకపోయి ఉంటే.. ఏమీ చేయలేకపోయాం అనే బాధ ఉండేది. అలా జరగనందుకు చాలా హ్యాపీగా ఉందిరా అని అంటాడు శ్రీకర్. దానికి కారణం నువ్వే అన్నయ్యా.. ఆ లాయర్ నోరు మూత పడేట్టు చేశావ్.. అని అంటాడు. మొత్తానికి వాడ్ని వీడూ.. వీడ్ని వాడూ పొగుడుకుంటారు. ఈ సోది ఇలా ఉంటే.. ఇంతలో శ్రియ వచ్చి చేశారులే పెద్ద గొప్పపని.. దాని వల్ల ఎవరికి ఉపయోగం అని అంటుంది. నేను మాట్లాడింది కరెక్టేగా.. ఇది మామూలు కేసు కాదు.. మర్డర్ కేసు.. మీ అన్నయ్య కాకుండా వేరే వాళ్లు వాదించి ఉంటే లక్షల్లో తీసుకునేవాడు. బయట వాళ్ల తరుపున ఇదే కేసు వాదిస్తే.. కనీసం రెండు మూడు లక్షలు వచ్చేవి అని అంటుంది శ్రియ. ఇది మన ఇంటి సమస్య వదినా అని అంటాడు కమల్. నా భర్త వాదించడం వల్ల మీరు బయటపడ్డారు కానీ.. లేదంటే లోపలే ఉండేవారు’ అని అంటుంది శ్రియ. అదేంటి శ్రియా అలా అంటావ్.. ఇది నా ఫ్యామిలీ అని అంటాడు శ్రీకర్. మంచిది.. మెడలో ప్రజా సేవకుడు అని బోర్డు పెట్టుకో అంటూ విసుగ్గా వెళ్లిపోతుంది శ్రియ. తన గురించి నీకు తెలుసు కదరా కమల్.. ఏం పట్టించుకోకు.. ఇదంతా అన్నయ్య, వదినలకు చెప్పకు అని అంటాడు శ్రీకర్. అలా అయితే అది ఇంటింటి రామాయణం ఎందుకు అవుతుంది.. ఇక రాత్రి అయ్యేసరికి ఫ్యామిలీ అంతా కూర్చుని సహఫంక్తి భోజనం చేస్తుంటారు. అవని, మీనాక్షిలు వడ్డిస్తూ ఉంటారు. అంతా హ్యాపీగా ఉంటే అది సీరియల్ ఎందుకు అవుతుంది.. అందులోనూ ఇంటింటి రామాయణం ఎందుకు అవుతుంది. పల్లవి భోజనం చేస్తుంటే.. కోపంగా చూస్తుంటాడు అక్షయ్. కూల్ అండీ కూల్ అని కూల్ చేసేస్తుంటుంది అవని. ఇంతలో పార్వతి.. ‘నీకు డెలివరీ డేట్ దగ్గర పడుతుంది కాస్త జాగ్రత్తగా ఉండాలి.. కొన్నిరోజుల్లో ఈ ఇంట్లో చంటి పిల్లల పిలుపు వినిపిస్తుంది.. అది తలుచుకుంటే ఎంత హ్యాపీగా ఉందో అని సంబరపడిపోతుంది. గొప్ప తల్లీ కూతుళ్లే బాబూ.. ఆ పులుసు పోయకపోతే నష్టం వచ్చిందా? శ్రియకి పాపనో.. బాబునో పుట్టాక చాలా కేర్ తీసుకోవాలి.. బేబీకి ఎలాంటి ప్రాబ్లమ్ రావడానికి వీళ్లేదు అని అంటాడు శ్రీకర్. ఇది నీకు మొదటి కాన్పు కాబట్టి.. చంటి పిల్లల్ని ఎలా చూసుకోవాలో నీకు తెలియదు కదా.. అవని, నేనూ చూసుకుంటాం అని అంటుంది పార్వతి. పిల్లలు ఏడ్వడానికి చాలా కారణాలు ఉంటాయి శ్రియా అంటూ అవని హితోపదేశం స్టార్ట్ చేస్తుంది. దాంతో శ్రియ.. చెప్పావ్‌లే సోది అన్నట్టుగా ఎక్స్ ప్రెషన్స్ ఇస్తుంది. ఇక అవనిలాగే మీనాక్షి కుదురుగా ఉండదుగా.. ఏదొక పెంట ఉండాలిగా.. బుద్దిగా పల్లవి భోజనం చేస్తుంటే.. పులుసు తీసుకెళ్లి చేతిపై పోసేస్తుంది. దాంతో పల్లవికి ఒళ్లు మండిలేచి వెళ్లిపోతుంది. పోనీ అక్కడితో వదిలేస్తుందా అంటే తోకలా పల్లవి వెనుకే పాల గ్లాస్ పట్టుకుని వెళ్తుంది మీనాక్షి. ఇంకేముందీ పల్లవి పెట్టాల్సిన గడ్డి పెట్టి పంపించేసరికి హర్ట్ అయ్యి ఇల్లు వదిలి వెళ్లిపోతుంది.. ఆ తరువాత అవని వెతుక్కుంటూ వెళ్తుందన్నమాట.