
Gautam adani | దిల్లీ: దేశీయ ఇంధన అవసరాలు తీర్చడమే లక్ష్యంగా 2035 నాటికి 10 గిగావాట్ల అణుశక్తి (GW) సామర్థ్యాన్ని సాధించాలని అదానీ గ్రూప్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ...
Gautam adani | దిల్లీ: దేశీయ ఇంధన అవసరాలు తీర్చడమే లక్ష్యంగా 2035 నాటికి 10 గిగావాట్ల అణుశక్తి (GW) సామర్థ్యాన్ని సాధించాలని అదానీ గ్రూప్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ (Gautam adani) వెల్లడించారు. ‘అదానీ అటామిక్ ఎనర్జీ’ ద్వారా తమ గ్రూప్ అణుశక్తి రంగంలోకి అడుగుపెడుతున్నట్లు ఆయన తెలిపారు. బుధవారం జరిగిన కంపెనీ వార్షిక సాధారణ సమావేశంలో (Adani group AGM) ప్రసంగించిన ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు.
న్యూక్లియర్ పవర్ వెంచర్ కోసం ఇప్పటికే భూమిని గుర్తించామని గౌతమ్ అదానీ తెలిపారు. భారతదేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడమే లక్ష్యంగా, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను తట్టుకునేందుకు ఈ పెట్టుబడులు సహాయపడతాయని పేర్కొన్నారు. ఇతర దేశాలపై ఆధారపడే అవసరాన్ని తగ్గిస్తుందని తెలిపారు. థర్మల్, పునరుత్పాదక, హైడ్రో, గ్యాస్ వంటి కీలక ఇంధన రంగాల్లో ఈ సంస్థ పెట్టుబడులను వేగవంతం చేస్తున్న వేళ ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి.
2025-26 ఆర్థిక సంవత్సరంలో అదానీ గ్రూప్ రూ.1.5 లక్షల కోట్లు మౌలిక వసతుల కల్పనపై ఖర్చు చేసిందని గౌతమ్ అదానీ తెలిపారు. ప్రైవేటు రంగ పెట్టుబడుల్లో 30 శాతం వాటా అదానీ గ్రూప్‌దేనని పేర్కొన్నారు. తమ కంపెనీపై కొందరు సందేహాలను సృష్టించడానికి ప్రయత్నించినప్పటికీ.. వాటాదారులు వాటిని సమర్థంగా తిప్పికొట్టారంటూ పరోక్షంగా హిండెన్‌బర్గ్ వ్యవహారాన్ని ప్రస్తావించారు. ఈ ఏడాది ప్రారంభంలో రైట్స్ ఇష్యూ ద్వారా రూ.25 వేల కోట్లు సమీకరించామని, కంపెనీపై ఉన్న విశ్వసనీయతకు ఇది నిదర్శనమన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.