
దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం కావడం, సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతోండటం ఆందోళనకు దారి తీస్తోంది.
దీంతో రాబోయే ఖరీఫ్ సాగు కాలంలో రైతులకు ఎలాంటి నష్టాలు వాటిల్లకుండా ఉండేందుకు కేంద్రం తక్షణ చర్యలను ప్రారంభించింది. దేశంలో వ్యవసాయ రంగంపై వర్షాల తీవ్రతను అంచనా వేసింది. వర్షాభావ పరిస్థితుల ముప్పు ఎక్కువగా ఉన్న 12 రాష్ట్రాల్లో 315 జిల్లాలను కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ గుర్తించింది. వీటికోసం ప్రత్యేక ప్రణాళికలను రూపొందించింది.వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. జూలై 2వ తేదీ నాటికీ దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు మరింత బలపడే అవకాశం ఉంది. ఇప్పటివరకు దేశంలో సాధారణం కంటే దాదాపు 43 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రత్యేకించి.. వర్షాధార ప్రాంతాల్లో ఖరీఫ్ పంటల సాగుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఎల్ నినో వల్లే ఈ దుర్భిక్ష పరిస్థితులు తలెత్తినట్టు కేంద్రం చెప్పకనే చెప్పింది.సాగునీటి లభ్యత ఆధారంగా జిల్లాల వర్గీకరణకేంద్ర ప్రభుత్వం గుర్తించిన ఈ 12 తీవ్ర వర్షాభావ జిల్లాలలో ఏపీ, తెలంగాణ కూడా ఉన్నాయి. వీటితో పాటు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, బిహార్, జార్ఖండ్, ఒడిశాలు దాదాపుగా కరవు ఛాయలు ఏర్పడినట్టయింది. ఈ 312 జిల్లాలను అక్కడ అందుబాటులో ఉన్న సాగునీటి సౌకర్యాల ఆధారంగా ప్రభుత్వం మూడు నిర్దుష్ట కేటగిరీలుగా వర్గీకరించింది.25 శాతం కంటే తక్కువ సాగునీటి వసతి ఉన్న 111 జిల్లాలను అత్యంత ప్రాధాన్యత విభాగంలో చేర్చింది. మిగిలిన జిల్లాలలో 25 నుండి 50 శాతం మధ్య సాగునీటి వసతి కలిగిన 76 జిల్లాలను మధ్యస్థ ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలుగా వర్గీకరించారు. తలసరి సాగునీటి మౌలిక వసతులు మెరుగ్గా ఉండి, 50 శాతం కంటే ఎక్కువ నీటి వసతి ఉన్న మిగిలిన 128 జిల్లాలను తక్కువ ముప్పు ఉన్న విభాగంలో చేర్చారు. ఈ జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పంటల పరిరక్షణ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయడానికి జిల్లా స్థాయి యంత్రాంగాలకు ప్రత్యేక ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రత్యామ్నాయ పంటలు, నీటి నిల్వలకు ప్రాధాన్యతవర్షాభావ పరిస్థితులను తట్టుకుని పంటలను కాపాడుకునేందుకు కేంద్ర వ్యవసాయ పరిశోధనా సంస్థ, సెంట్రల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్ సంయుక్తంగా ప్రతి జిల్లాకు ప్రత్యేక వ్యవసాయ అత్యవసర ప్రణాళికలను రూపొందించాయి. వర్షాలు నిలిచిపోయే అవకాశం ఉన్న ప్రాంతాలలో సాగు ఖర్చులు భారం కాకుండా, తక్కువ నీటి అవసరం ఉండే, తక్కువ కాలంలో పండే ప్రత్యామ్నాయ పంటలను వేసేలా రైతులను ప్రోత్సహించాలని కేంద్రం కోరింది. పంటల వైవిధ్యీకరణ ద్వారా సాగు నష్టాలను చాలా వరకు తగ్గించాలని రాష్ట్రాలకు సూచించింది.రైతాంగానికి సాగునీటి కొరత రాకుండా ఉండేందుకు రాష్ట్రాలు తమ పరిధిలోని చెరువులు, కాల్వలు, జలాశయాలు, పొలాల్లోని చిన్న కుంటలు, చెక్ డ్యామ్‌ల మరమ్మతులను తక్షణమే పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. వాన నీటిని గరిష్టంగా నిల్వ చేసుకునేందుకు వీలుగా తాత్కాలిక కట్టలను నిర్మించాలని సూచించింది. తీవ్ర నీటి కొరత ఉన్న సున్నితమైన జిల్లాల్లో తాగునీటి అవసరాలకు మొదటి ప్రాధాన్యతనిచ్చింది.