
రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Liquor Party on Ganga after video goes viral: హిందువులకు కాశీ అంటే ఎంతో మక్కువ. దేశంతో పాటు ప్రపంచ దేశాల నుండి కూడా భక్తులు కాశీ యాత్రకు వస్తుంటారు. ఇక్కడ గంగా స్నానం చేయడం, గంగనీటిని ఇంటికి తీసుకెళ్లడం వంటి ఆచారాలు ఉన్నాయి. జీవితంలో ఒకసారి అయినా కాశీ వెళ్లి గంగానదిలో స్నానం చేయాలని భక్తులు కోరుకుంటారు. అయితే, ఇటువంటి పవిత్రమైన గంగానదిపై కొందరు యువకులు అపవిత్రమైన పనులు చేశారు. వారణాసిలో గంగానదిపై పడవలో చికెన్ వండుతూ, బీరు తాగుతున్న వీడియో బయటకు రావడంతో పోలీసులు వెంటనే స్పందించి ఐదుగురిని అరెస్ట్ చేశారు. ముగ్గురు ఇంకా పరారీలో ఉన్నారు. బోటును కూడా సీజ్ చేసినట్లు ఏసీపీ అతుల్ అంజన్ త్రిపాఠి వివరించారు. వారణాసిలో మాంసం దుకాణాలను శివారు ప్రాంతాలకు తరలించాలని మున్సిపల్ కార్పొరేషన్ ఇటీవల నిర్ణయం తీసుకున్న సమయంలోనే ఈ ఘటన జరగడం గమనార్హం.
వారణాసిలో మాంసం దుకాణాలపై కీలక నిర్ణయం.. పవిత్ర పుణ్యక్షేత్రమైన వారణాసిలో మాంసం, చేపల విక్రయాలను శివారు ప్రాంతాలకు తరలించాలని మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయించింది. వీటిని ఐదు నిర్దేశిత ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని, ఆ ప్రక్రియను 6 నెలల్లో పూర్తి చేయాలని అశోక్ కుమార్ త్రిపాఠి తెలిపారు. యాత్రికులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదని నగరంలోని సుమారు 400 మాంసం దుకాణాలను తరలించాలని యోచిస్తున్నారు. సరిగ్గా ఈ క్రమంలోనే బోటులో మందు తాగుతున్న యువకుల వీడియో బయటపడింది.
ఈ బోటులో మందు పార్టీ చేసుకున్న వ్యక్తులు దీపక్ కుమార్, అజయ్ సాహ్ని, అరుణ్ కుమార్ సాహ్ని, అనురాగ్ నిషా, రాహుల్ సాహ్ని అని పోలీసులు గుర్తించారు. వీరి వయస్సు 25 నుండి 32 మధ్య ఉండగా, వీరు వారణాసి, రామ్ నగర్ నివాసితులు. ప్రస్తుతం పోలీసులు బోటును సీజ్ చేసి ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఎక్స్ (X) వేదికగా ఈ వీడియో వైరల్ కావడంతో అసిస్టెంట్ కమిషనర్ అతుల్ అంజన్ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఘాట్ వద్ద జరిగిన ఈ ఘటనపై పోలీసులు సెక్షన్ 196, 299 భారతీయ న్యాయ సంహిత ప్రకారం కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న ముగ్గురి కోసం కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
మార్చిలో కూడా ఇలాంటి ఘటనే.. 2026 మార్చిలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. గంగానది తీరంలో 14 మంది యువకులు నాన్-వెజ్ తిని, వాటి వ్యర్థాలను నదిలో పడేస్తున్న వీడియో వైరల్ కావడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. వారణాసి కోర్టు వారు చేసిన బెయిల్ దరఖాస్తును కూడా తిరస్కరించింది. సనాతన ధర్మంలో గంగానదికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు కాశీకి వచ్చి గంగాజలంతో పూజలు చేసి, ఆ నీటిని ఇంటికి తీసుకెళ్లి ఇంటికి శుద్ధి చేసుకునే ఆనవాయితీ ఉంది. అటువంటి పవిత్ర నదిలో ఇలాంటి పనులు చేయడం చర్చనీయాంశమైంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.