నేరం చేసిన ఏ దొంగైనా, రౌడీ అయినా పోలీసులకు దొరకకుండా తప్పించుకోవాలని చూస్తాడు. జైలు గోడల మధ్య ఉండాలంటే క్రిమినల్స్ సైతం వణికిపోతారు. కానీ.. హైదరాబాద్ నగరానికి చెంది
న ఒక రౌడీషీటర్ మాత్రం జైల్లోనే ప్రశాంతంగా ఉందని.. అక్కడికే పంపించాలని పోలీసులను వేడుకున్నాడు. 'నన్ను ఎలాగైనా జైలుకు పంపించండి సార్.. అక్కడే నేను ప్రశాంతంగా ఉంటాను' అంటూ వారం రోజులుగా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగాడు. పోలీసులు అతడి మాటలను లైట్ తీసుకోవడంతో ఎలాగైనా జైలుకు వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. అనుకున్నదే తడవుగా ఒక హోటల్‌కు వెళ్లి రౌడీయిజం చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ ఆగాపురా ప్రాంతానికి చెందిన షేక్ అస్లాం అనే యువకుడిపై స్థానిక పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ నమోదైంది. గత కొన్ని రోజులుగా అస్లాం ప్రాణభయంతో వణికిపోతున్నాడు. బయట తిరిగితే తన శత్రువులు ఎప్పుడు ఎటు నుంచి వచ్చి తనను చంపేస్తారోననే ఆందోళన అతడిలో మొదలైంది. దీంతో సమాజంలో తిరగడం కంటే జైలులో ఖైదీగా ఉండటమే సురక్షితం అని భావించాడు. తనను జైలుకు పంపించాల్సిందిగా గత వారం రోజులుగా స్థానిక పోలీస్ స్టేషన్ చుట్టూ కాళ్లరిగేలా తిరిగాడు. అయితే.. ఎలాంటి నేరం చేయకుండా ఎవరిని పడితే వారిని జైల్లో పెట్టడం కుదరదు కదా అని పోలీసులు అతడిని వెనక్కి పంపించేస్తూ వచ్చారు.పోలీసులు తనను అరెస్ట్ చేయడం లేదనే కోపంతో అస్లాం ఒక ప్లాన్ వేశాడు. తనే స్వయంగా ఒక పెద్ద గొడవ సృష్టించి శాంతిభద్రతల సమస్య తెస్తే పోలీసులు కచ్చితంగా రిమాండ్‌కు తరలిస్తారని భావించాడు. ఇందులో భాగంగానే మంగళవారం సాయంత్రం ఆగాపురా చార్కందీల్ ప్రాంతంలో ఉన్న సెంట్రల్ హోటల్ అండ్ బేకరీకి వెళ్లాడు. అక్కడ ఉన్న సిబ్బందితో కావాలనే గొడవ పెట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా హోటల్ లోపల ఉన్న వంట పాత్రలు, గ్యాస్ సిలిండర్లను రోడ్డుపైకి విసిరేస్తూ బీభత్సం సృష్టించాడు. బేకరీ కౌంటర్‌కు ఉన్న ఖరీదైన అద్దాలను చేతులతో పగలగొట్టాడు. అక్కడ ఉన్న కస్టమర్లు, సిబ్బంది భయంతో పరుగులు తీశారు. 'నన్ను చంపడానికి కొందరు తిరుగుతున్నారు.. నేను జైల్లోనే ప్రశాంతంగా ఉంటా.. గొడవ చేస్తేనే పోలీసులు నన్ను జైల్లో పెడతారు.. అందుకే ఇదంతా చేస్తున్నా' అని అరుస్తూ హోటల్‌ను ధ్వంసం చేశాడు. హోటల్ యాజమాన్యం సమాచారం ఇవ్వడంతో హబీబ్‌నగర్ పోలీసులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన షేక్ అస్లాంను పోలీసులు అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు. ఈ రౌడీషీటర్‌పై నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో భారీగా కేసులు ఉన్నట్లు తేలింది. నిందితుడు అస్లాంపై హబీబ్‌నగర్, సైఫాబాద్, సనత్‌నగర్, బేగంపేట, హుమాయున్‌నగర్ వంటి పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 13 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. హోటల్ యజమాని ఫిర్యాదు మేరకు అస్లాంపై కేసు నమోదు చేసి.. రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించారు.