
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
పాత పింఛన్ పథకంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ శుభవార్త వినిపించింది. ఉద్యోగులకు పాత పింఛన్ పథకం వర్తిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కొత్త పింఛన్ విధానం (కాంట్రిబ్యూటరీ పింఛ్ స్కీమ్) వర్తింపు ఉన్న ఉద్యోగులకు పాత పింఛన్ అమలు చేస్తామని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పాత పింఛన్ పథకం అమలుకు నిర్ణయం తీసుకోవడంతో ప్రభుత్వ ఉద్యోగ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞలు చెబుతున్నారు.
అమరావతిలోని సచివాలయంలో జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో రిటైర్మెంట్ వయస్సు పెంచాలని మంత్రిమండలి నిర్ణయించింది. 60 నుంచి 62 ఏళ్ల వరకు పదవీ విరమణ వయస్సును కొన్ని శాఖల ఉద్యోగులకు ప్రభుత్వం పెంచింది. ఇక పాత పింఛన్ పథకం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2004 సెప్టెంబర్ కంటే ముందు జారీ అయిన వివిధ నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాలు పొందిన ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్‌ను వర్తింపచేస్తూ మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంతో 11 వేల మంది ఉద్యోగులు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ నుంచి పాత పెన్షన్ స్కీమ్ పరిధిలోకి తీసుకురానుంది. ఉద్యోగ విరమణ అనంతరం ఉద్యోగుల ఆర్థిక, సామాజిక భద్రతకు ప్రభుత్వ నిర్ణయం భరోసా కల్పించనుంది. ప్రస్తుతం మంత్రివర్గంలో ఆమోదం పొందిన అంశాలతోపాటు గతంలోనూ ఉద్యోగులకు ప్రయోజనం కలిగేలా నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
మంత్రిమండలి తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 01-09-2004కు ముందు నోటిఫికేషన్లు జారీ అయ్యి.. అనంతరం ప్రభుత్వ సేవలో చేరిన ఉద్యోగులను కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) నుంచి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్) పరిధిలోకి తీసుకురావాలని తీసుకున్న నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం స్వాగతించింది. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న సుమారు 11,000 మంది ఉద్యోగులు లబ్ధి పొందనుందని ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు. వారి పదవీ విరమణ అనంతర జీవితానికి, కుటుంబానికి ఆర్థిక భద్రత, సామాజిక రక్షణ కల్పించే దిశగా ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయంగా నిలుస్తుంది.
రాష్ట్రంలోని లక్షలాదిమంది సీపీఎస్ ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చేలా దేశంలోనే తొలిసారిగా గ్రాట్యుటీ, చనిపోయిన సీపీఎస్ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఫ్యామిలీ పెన్షన్ వంటి చారిత్రాత్మక ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని ఏపీ సచివాలయ సంఘం గుర్తు చేసింది. ఉద్యోగుల సంక్షేమంపై కూటమి ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందని తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు మిగిలిన సీపీఎస్ ఉద్యోగులందరికీ కూడా ఓపీఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.