
ఏపీఎల్ చివరి దశ నేటి నుంచే ముఖ్య అతిథిగా రామ్‌చరణ్ తాడేపల్లి, మంగళగిరి-న్యూస్‌టుడే: ఆంధ్ర ప్రిమియర్ లీగ్ (ఏపీఎల్)లో చివరి దశకు రంగం సిద్ధమైంది.
తొలి దశలో విశాఖపట్నంలో, రెండో దశలో కడపలో అభిమానులను అలరించిన లీగ్‌లో ఆఖరి అంకానికి అమరావతి ఆతిథ్యమివ్వనుంది. ఆంధ్రప్రదేశ్ రాజధానిలో ఏపీఎల్ జరగనుండడం ఇదే తొలిసారి. ఇందుకోసం ఇక్కడి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) స్టేడియాన్ని సిద్ధం చేశారు. బుధవారం మధ్యాహ్నం 1.30 నుంచి జరిగే రాయల్స్ ఆఫ్ రాయలసీమ, సింహాద్రి వైజాగ్ లయన్స్ జట్ల పోరుతో ఏపీఎల్ చివరి దశ మొదలవుతుంది. సాయంత్రం 6.30కి మొదలయ్యే మరో మ్యాచ్‌లో భీమవరం బుల్స్, క్యాపిటల్ అమరావతి రాయల్స్ తలపడతాయి. చివరి దశ ఆరంభ వేడుకలకు సినీ నటుడు రామ్‌చరణ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఏపీఎల్‌లో మిగిలిన 12 మ్యాచ్‌లకూ అమరావతే ఆతిథ్యమిస్తుంది. నాలుగు రోజుల పాటు మధ్యాహ్నం, సాయంత్రం మ్యాచ్‌లు ఉంటాయి. లీగ్ దశ ఈ నెల 27న ముగుస్తుంది. తర్వాతి రోజు ప్లేఆఫ్స్ మొదలవుతాయి. ఈ నెల 30న ఫైనల్ జరుగుతుంది. టోర్నీలో పోటీ పడుతున్న ఏడు జట్లలో ప్రస్తుతం భీమవరం బుల్స్ 6 మ్యాచ్‌ల్లో 8 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. లీగ్ దశలో టాప్-4 జట్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.