
Pune fort murder| ఇంటర్నెట్‌డెస్క్: మహారాష్ట్రలోని పుణె వద్ద పెళ్లాడబోయే యువతి ఫొటోలు తీస్తూ యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ (26) లోయలో పడి మృతిచెంది
నట్లుగా నమోదైన కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కేసు విచారణలో సీసీటీవీ దృశ్యాలు కీలకంగా మారాయి. కేతన్, సియా గోయల్ వెళ్లిన దారిలో వారిని హూడీ (ముసుగు ఉన్న టీషర్ట్) ధరించిన వ్యక్తి ఒకరు అనుసరించడాన్ని పోలీసులు గుర్తించారు (Pune Murder Case). అతడు సియా ప్రియుడు చేతన్ అని ప్రాథమికంగా పోలీసులు అంచనాకు వచ్చారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..
ఒకవైపు 33 డిగ్రీల ఉష్ణోగ్రతతో వాతావరణం వేడిగా ఉన్నప్పటికీ.. ఆ వ్యక్తి హుడీ ధరించి ఉండటం పలు అనుమానాలకు దారితీసింది. కేతన్-సియా లోహ్‌గఢ్ కోటకు వెళ్లిన దారిలో కనిపించిన అతడు.. ప్రమాదం జరిగిన ప్రాంతంలోనూ ఉన్నట్లు గుర్తించామని పోలీసు వర్గాలు తెలిపాయి. సియాకు, ఆ ముసుగు వ్యక్తికి ఏదైనా పరిచయం ఉండొచ్చన్న అనుమానంతో దర్యాప్తు ముమ్మరం చేశారు. దారిలో సియా ఒకసారి వెనక్కి తిరిగి చూడగానే.. ఆ హుడీ వ్యక్తి వెంటనే కూర్చుండిపోయాడని ఓ అధికారి తెలిపారు. దాంతో అసలు ట్రెక్కింగ్ రావడానికి వెనక కారణాలను ఆరాతీశారు.
ఆ కోటవద్దకు తీసుకెళ్లాలని సియా పలుమార్లు అడిగిందని కేతన్ సోదరి పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం. తొలుత మే 31న ఇద్దరూ లోహ్‌గఢ్ ఫోర్ట్‌కు వెళ్లారు. మళ్లీ జూన్ నాలుగున కూడా అక్కడికి తీసుకెళ్లమని సియా అడగ్గా.. కేతన్ తల్లి అందుకు అంగీకరించలేదు. అలాగే ప్రివెడ్డింగ్ షూట్లో భాగంగా బాలికి వెళ్లడానికి ముందే కేతన్ అడ్డు తొలగించుకోవాలని ఆమె భావించిందని, పాస్‌పోర్ట్ కనిపించకుండా పోవడంతో ఆ ట్రిప్ క్యాన్సిల్ అయిందని పోలీసులు వెల్లడించారు.
‘‘మా అందరి పాస్‌పోర్టులు ఉన్నాయి. కానీ కేతన్‌ది మాత్రం కనిపించలేదు. ఎక్కడన్నా పడిపోయిఉండొచ్చని అనుకున్నాం. దాంతో అంతా వెనక్కి వచ్చేశాం. తర్వాత మళ్లీ లోహ్‌గఢ్ కోటకు వెళ్లడం గురించి సియా గొడవపెట్టుకుంది. జూన్ 14న ఇద్దరూ కలిసి వెళ్లారు. ఆ రోజు పైనుంచి తోయడంతో అతడు ఒక పొదను పట్టుకొని బతికిపోయాడు. పాము కనిపించిందని, అది కాటువేయకుండా కాపాడేందుకే తోశానని ఆమె చెప్పిన మాటలను కేతన్ నమ్మాడు’’ అని మృతుడి తండ్రి విశాల్ అగర్వాల్ వెల్లడించారు. అప్పుడు ప్రాణాలతో బయటపడినా జూన్ 18న అదే ప్రాంతంలో ప్రాణాలు కోల్పోయాడు (Pune fort murder). కేతన్కు ఎత్తైన ప్రదేశాలంటే భయమని దర్యాప్తులో గుర్తించారు. దీనిని ఆసరాగా తీసుకుని.. ఆమె ఫోర్ట్‌కు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. తన పుట్టినరోజు సందర్భంగా ట్రెక్కింగుకు వచ్చామని, కేతన్ ఫొటోలు తీస్తూ హోరుగాలికి పట్టుతప్పి లోయలో పడిపోయాడని ఆమె చెప్పిన మాటల్లో పొంతన లేకపోవడంతో దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆమె కాల్ రికార్డింగ్‌ను పరిశీలించారు.
చేతన్-సియా మధ్య 2004 కాల్స్ నడిచాయని, ఇద్దరూ 238 గంటలు ఫోన్లో మాట్లాడుకున్నట్లు గుర్తించారు. ఈ రికార్డుల ఆధారంగా వారి బంధాన్ని నిర్ధారించుకున్న పోలీసులు.. ప్లాన్ ప్రకారమే ఆ ఘటనకు పాల్పడినట్లు ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చారు. చేతన్ సోషల్ మీడియా యాక్టివిటీని పోలీసులు పరిశీలించారు. ఆ హుడీ ధరించిన వ్యక్తిని, చేతన్ చిత్రాలను పోల్చి చూశారు. ఆ వ్యక్తి చేతనేనని గుర్తించారు. అలాగే నిందితుడు ఫోర్ట్ ప్రాంతానికి తన ఫోన్ తీసుకురాకపోవడం, ఇంటర్నెట్ ఆపివేయడంతో పోలీసుల అనుమానానికి మరింత బలం చేకూరింది. ఇక జూన్ 18న సియా-కేతన్ లోయ వద్దకు చేరుకోగానే.. వారితో చేతన్ కూడా చేరినట్లు గుర్తించారు. సియా, ఆమె ప్రియుడు చేతన్ కలిసి కేతన్‌ను లోయలోకి తోసి, ప్రమాదంగా చిత్రీకరించారని తేలింది. వారిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.