
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం ముగింపు ప్రకటనతో పశ్చిమాసియాలో ఇప్పుడిప్పుడే ఉద్రిక్తతలు చల్లారుతున్నాయి. ఈ నేపథ్యంలో టెహ్రాన్‌లోని భారత ఎంబసీ తమ అడ్వైజరీ (India Advisory)ని సవరించింది.
అయితే, ఇరాన్లో పరిస్థితులు కాస్త మెరుగుపడినప్పటికీ.. ప్రస్తుతానికి ఈ దేశానికి అనవసర ప్రయాణాలు మానుకోవాలని భారత పౌరులకు సూచించింది. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.
‘‘ఇరాన్ (Iran)లోని భద్రతా పరిస్థితులను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నాం. ప్రస్తుతం ఇక్కడ సానుకూల పరిణామాలు నెలకొంటున్నాయి. అయినప్పటికీ ఇరాన్లో ఉన్న భారత పౌరులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నాం. స్థానిక పరిస్థితులపై అవగాహన కలిగి ఉండటంతో పాటు అధికారులు జారీ చేసే సూచనలను కచ్చితంగా పాటించాలి. ఇక, తదుపరి నోటీసులు ఇచ్చేంతవరకు ఇరాన్‌కు అనవసర ప్రయాణాలు చేయొద్దు. అనివార్య కారణాల వల్ల ఈ దేశానికి రావాలనుకునేవారు ఎంబసీ అధికారులను సంప్రదించి మీ వివరాలను నమోదు చేసుకోండి. ఎంబసీ సోషల్ మీడియా ఖాతాలు, అధికారిక వెబ్‌సైట్‌ను ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి’’ అని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.
అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం ముగింపునకు సంతకాలు జరిగినప్పటికీ.. హర్మూజ్ నిర్వహణ, అణు కేంద్రాల పరిశీలన వంటి అంశాల్లో రెండు దేశాల మధ్య భేదాభిప్రాయాలు నెలకొన్నాయి. బాంబు దాడుల్లో దెబ్బతిన్న అణు కేంద్రాల్లో తనిఖీల కోసం అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (ఐఏఈఏ) ఇన్స్పెక్టర్లను అనుమతించేందుకు ఇరాన్ అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఆయన ప్రకటనను ఇరాన్ ఖండించింది. మరోవైపు, హర్మూజ్‌ను మూసేశామని టెహ్రాన్ చెబుతుండగా.. అది తెరిచే ఉందని అమెరికా అంటోంది. ఈ గందరగోళం నడుమ పశ్చిమాసియాలో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.