
ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్‌లో కొలంబియా నాకౌట్ స్టేజ్‌కు చేరుకుంది. టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన ఇంగ్లాండ్‌ను ఘనా నిలువరించడం గమనార్హం.
పనామాపై గెలిచిన క్రొయేషియా తన నాకౌట్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. క్రొయేషియా మిడ్ ఫీల్డర్ లుకా మోడ్రిక్ తన 200వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు.
ప్రపంచ కప్ రేసులో ఇంగ్లాండ్ ఫేవరెట్ టీమ్. తొలి మ్యాచ్‌లో గెలిచి దూకుడు మీదుంది. కానీ, ఘనాతో జరిగిన పోరును డ్రా చేసుకోవడం గమనార్హం. ఇందులో గెలిచి నాకౌట్ బెర్తును ఖరారు చేసుకుందామనుకున్న ఇంగ్లాండ్ ఆశలకు బ్రేక్ పడింది. గోల్ కోసం ఇరు జట్లూ తీవ్రంగా శ్రమించాయి. నాలుగు సార్లు గోల్ పోస్ట్ వైపు టార్గెట్ చేసినా ఇంగ్లాండ్‌కు కలిసి రాలేదు. ఘనా కేవలం ఒక్కసారి మాత్రమే గోల్ పోస్టును టార్గెట్ చేసింది. దీంతో చివరికి 0-0తో మ్యాచ్ డ్రాగా ముగిసింది. అయితే, మ్యాచ్ రిఫరీ ఎజ్రి కోన్సా తీరుపై ఘనా జట్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పెనాల్టీ ఇవ్వకపోవడం వల్ల తాము నష్టపోయామని ఆ జట్టు మేనేజ్మెంట్ విమర్శించింది. 79వ నిమిషం వద్ద ఘనా ప్లేయర్ ఇంగ్లాండ్ గోల్ పోస్టు వైపు బంతిని కొట్టాడు. దానిని అడ్డుకొనే క్రమంలో ఇంగ్లాండ్ గోల్ కీపర్ కాలు ఘనా ఆటగాడికి తాకింది. ఈ సమయంలో పెనాల్టీ ఇవ్వాల్సి ఉండగా.. మ్యాచ్ రిఫరీ మాత్రం పట్టించుకోలేదు. దీనిపై ఇప్పుడు తీవ్ర దుమారం రేగుతోంది.
పనామాతో జరిగిన మ్యాచ్‌లో క్రొయేషియా విజయం సాధించింది. 54వ నిమిషంలో యాంటే బుదిమిర్ గోల్ కొట్టడంతో క్రొయేషియా 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత ఇరు జట్లూ గోల్స్ కోసం తీవ్రంగా శ్రమించాయి. పనామా నుంచి గోల్ పోస్టు వైపు బంతిని పంపించినా.. క్రొయేషియా గోల్ కీపర్ మాత్రం అద్భుతంగా అడ్డుకోగలిగాడు. చివరికి క్రొయేషియా 1-0 తేడాతో పనామాపై విజయం సాధించింది. దీంతో గ్రూప్ L నుంచి నాకౌట్ రేసు రసవత్తరంగా మారింది. ఓటమితో పనామా ఇంటిముఖం పట్టింది. ఇంగ్లాండ్, ఘనా, క్రొయేషియా తర్వాత రౌండ్ కోసం పోటీలో నిలిచాయి.
గ్రూప్ K నుంచి కొలంబియా నాకౌట్ స్టేజ్‌కు దూసుకెళ్లింది. పోర్చుగల్ కూడా దాదాపు తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. తాజాగా జరిగిన పోరులో కొలంబియా 1-0 తేడాతో డీఆర్ కాంగోపై విజయం సాధించింది. ఆట సగ భాగం వరకూ ఇరు జట్లూ గోల్‌ను కొట్టలేకపోయాయి. అయితే, కొలంబియా ఆటగాడు డానిల్ మునోజ్ 76వ నిమిషంలో గోల్ సాధించి తన జట్టును ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. కొలంబియా తొమ్మిది షాట్లను గురి పెట్టగా.. ఒక్క దాంట్లో సక్సెస్ అయింది. మరోవైపు డీఆర్ కాంగో మాత్రం రెండు సార్లు మాత్రమే గోల్ పోస్టు వైపు రావడం గమనార్హం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.