
ఫేజ్-1 స్వాధీనం.. ఫేజ్-2 విస్తరణపై సమగ్ర అధ్యయనం కన్సల్టెంట్‌గా ‘ఎస్బీఐ క్యాప్స్’ ఆ సంస్థ నివేదిక ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ సమన్వయ సభ్యులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారు
లు ఖట్టర్, అశ్వినీవైష్ణవ్లతో సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సమావేశంలో నిర్ణయం ఈనాడు - దిల్లీ, హైదరాబాద్
కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో సమావేశమైన సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, అశ్వినీవైష్ణవ్
హైదరాబాద్ మెట్రో రైలు స్వాధీనం, విస్తరణపై కేంద్ర మంత్రులతో దిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రెండు రోజులపాటు జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి. ఫేజ్-1 విలువ నిర్ధారణ, స్వాధీనానికి రుణ సేకరణ.. ఫేజ్-2 విస్తరణ, నిర్మాణ వ్యయం, ఇందుకు అవసరమైన రుణ సేకరణకు సంబంధించిన అంశాలపై కన్సల్టెంట్‌తో సమగ్ర అధ్యయనం చేయించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ఈ బాధ్యతను ‘ఎస్బీఐ క్యాప్స్’ సంస్థకు అప్పగించనున్నారు. హైదరాబాద్ మెట్రో రైలు స్వాధీనం.. విస్తరణపై సోమవారం రాత్రి దిల్లీలో రైల్వేశాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్‌తో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డి చర్చించారు. కొనసాగింపుగా మంగళవారం కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో ఆయన నివాసంలో ఇద్దరూ సమావేశమయ్యారు. వారి వెంట అశ్వినీవైష్ణవ్ కూడా ఉన్నారు. మెట్రో ఫేజ్-1 స్వాధీనం, ఫేజ్-2 విస్తరణకు ఉన్న ఆటంకాలను తొలగించేందుకు కేంద్ర మంత్రులతో వరుసగా రెండు రోజులపాటు ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించి ఏకాభిప్రాయానికి వచ్చారు.
మెట్రో ఫేజ్-1ను ఫేజ్-2కు విస్తరించాలనే ప్రభుత్వ ప్రయత్నాలకు మొదటి నుంచీ అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. అయినా, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆయా అడ్డంకులను అధిగమించడానికి పట్టువదలకుండా ప్రయత్నిస్తూనే ఉన్నారు. వివిధ కారణాలతో మెట్రో రైలు ఫేజ్-1 పూర్తి కావడానికి ఆలస్యమవడం, కొవిడ్ ప్రభావం తదితరాలతో ఎల్అండ్టీ నష్టాలను చవిచూసింది. దాదాపు రూ.30 వేల కోట్ల ఆస్తులను సృష్టించినా.. ఏటా రూ.400 కోట్లకుపైగా నష్టం వస్తోందని ఎల్అండ్టీ ప్రభుత్వానికి నివేదించినట్లు స్వయంగా ముఖ్యమంత్రే చెప్పారు. ఈ కారణంతోనే మెట్రో రెండో దశ నిర్మాణం, నిర్వహణకు ఎల్అండ్టీ ముందుకు రాలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వమే మెట్రో ఫేజ్-1ను ఎల్అండ్టీ నుంచి రూ.15 వేల కోట్లకు కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో మెట్రో మొదటి దశ నిర్వహణ, రెండో దశ నిర్మాణం, నిర్వహణ.. రెండూ రాష్ట్ర ప్రభుత్వం అధీనంలోకి వచ్చాయి. ఎల్అండ్టీ సంస్థ మెట్రో కోసం 8.25 శాతం వడ్డీకి బ్యాంకుల్లో రూ.13,600 కోట్ల రుణం తెచ్చుకుంది. ఆ లోన్‌ను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని కేంద్రానికి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. తక్కువ వడ్డీకి రుణాలు తీసుకోవడానికి ‘ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్(ఐఆర్ఎఫ్సీ)’ను మధ్యవర్తిగా ఒప్పించారు. రూ.13,600 కోట్లు నిధులను 4 శాతం వడ్డీకి జపాన్ సంస్థ ద్వారా అప్పుగా తెచ్చారు. ఆ సంస్థ నుంచి ఐఆర్ఎఫ్సీకి నిధులు బదిలీ అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కట్టాల్సిన రూ.1,400 కోట్లను కూడా చెల్లించారు. ఈ దశలో ఐఆర్ఎఫ్సీ నుంచి నిధులు విడుదల కాకపోవడంతో.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అడ్డుకుంటున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. దీనిపై కిషన్‌రెడ్డి కూడా సమాధానమిచ్చారు. రాష్ట్ర అభివృద్ధిని తాను అడ్డుకోవడం లేదంటూ స్పష్టంచేశారు. ఈ క్రమంలోనే కిషన్‌రెడ్డికి సీఎం లేఖ రాశారు. ‘ఈ సమస్య పరిష్కారానికి మీరే చొరవ తీసుకొని.. రైల్వే మంత్రితో త్వరగా సమావేశం ఏర్పాటు చేయించాలి. సంబంధిత ఒప్పందాలు, ఆధార పత్రాలతో ఆ సమావేశానికి హాజరై అన్ని వివరణలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రులతో ఈ అంశంపై చర్చించేందుకు కిషన్‌రెడ్డి చొరవ తీసుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి.. కిషన్‌రెడ్డితో కలిసి సోమ, మంగళవారాల్లో రైల్వే, పట్టణాభివృద్ధి శాఖల మంత్రులతో సమావేశమయ్యారు. ఫలితంగా మెట్రో ఫేజ్-1, ఫేజ్-2 అంశాలను సాధ్యమైనంత వేగంగా కొలిక్కి తీసుకొచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కూడిన సమన్వయ కమిటీ ఏర్పాటైంది.
హైదరాబాద్ మెట్రోపై దిల్లీలో రైల్వే, పట్టణాభివృద్ధి శాఖల మంత్రులు అశ్వినీ వైష్ణవ్, మనోహర్‌లాల్ ఖట్టర్‌తో సానుకూల వాతావరణంలో చర్చలు జరిగినట్లు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ‘‘రైల్వేశాఖ మంత్రితో సమావేశం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రెండుసార్లు లేఖలు రాశారు. గత రెండు రోజులుగా కేంద్ర మంత్రులతో సమావేశాలు ఏర్పాటు చేశా. సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి ఆయా సమావేశాల్లో పాల్గొన్నా. కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణ ప్రతినిధిగా... రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి ఎప్పుడూ కృషి చేస్తా’’ అని ‘ఎక్స్’లో వివరించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.