
Heart Attack:గుండెపోటు ఒక్కసారిగా వచ్చినట్లు కనిపించినా, దానికి దారితీసే సమస్యలు ఏళ్ల తరబడి అభివృద్ధి చెందుతుంటాయి.
సరైన జీవనశైలి, వ్యాయామం, ఆరోగ్య పరీక్షలతో గుండె జబ్బుల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణాల్లో గుండె సంబంధిత వ్యాధులు ఒకటి. అయితే చాలా గుండెపోటులను ముందుగానే నివారించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఇవాన్ లెవిన్ గుండెపోటు ప్రమాదాన్ని 60 ఏళ్లలోపు తగ్గించేందుకు పాటించాల్సిన 10 ముఖ్యమైన సూచనలను వెల్లడించారు.
సిగరెట్ తాగడం గుండె జబ్బులకు ప్రధాన కారణాల్లో ఒకటి. ధూమపానం రక్తనాళాలను దెబ్బతీసి రక్తపోటును పెంచుతుంది. అలాగే కొకైన్ వంటి మాదకద్రవ్యాలు కూడా గుండెపై తీవ్ర ప్రభావం చూపి ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తాయి.
అధిక చక్కెర కలిగిన శీతల పానీయాలు, ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్స్‌ను వీలైనంత వరకు తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటివల్ల ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. నడక, జాగింగ్, సైక్లింగ్‌తో పాటు శరీర బలాన్ని పెంచే వ్యాయామాలు కూడా చేయడం మంచిది. వ్యాయామం వల్ల గుండె కండరాలు బలపడటంతో పాటు రక్తప్రసరణ మెరుగుపడుతుంది.
40 ఏళ్లు దాటిన వారు లేదా కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర ఉన్నవారు కరోనరీ ఆర్టరీ కాల్షియం (CAC) స్కాన్ గురించి వైద్యులను సంప్రదించవచ్చు. ఈ పరీక్ష గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లో కాల్షియం నిల్వలను గుర్తిస్తుంది.అలాగే రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదు. ఇవి నియంత్రణలో లేకపోతే గుండె సంబంధిత సమస్యల ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం అవసరం.
దీర్ఘకాలిక ఒత్తిడి కూడా గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ధ్యానం, సంగీతం వినడం, హాబీలకు సమయం కేటాయించడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. పొట్ట భాగంలో అధిక కొవ్వు పేరుకుపోవడం కూడా ప్రమాదకరం. ఇది అధిక రక్తపోటు, కొవ్వు కాలేయం, ట్రైగ్లిజరైడ్స్ పెరగడం వంటి సమస్యలకు కారణమవుతుంది. కాబట్టి బరువును నియంత్రణలో ఉంచడం చాలా ముఖ్యం.అలాగే గుండె ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం కోసం సోషల్ మీడియా కంటే అర్హత కలిగిన వైద్యులను సంప్రదించడం మంచిది. మద్యం సేవించే వారు పరిమితంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే చిన్న వయసు నుంచే ఆరోగ్యకరమైన అలవాట్లు అలవరచుకోవడం అవసరం.