
Boss scam | ఇంటర్నెట్ డెస్క్: వ్యక్తులకు లింకులు పంపించడం, మాయ మాటలు చెప్పో.. భయపెట్టో వారి నుంచి అందినకాడికి దోచుకోవడం సైబర్ నేరగాళ్లు చేసే పని. ఇప్పుడు కేటుగాళ్లు కొత్త పంథా ఎంచుకున్నారు.
కంపెనీలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. బాస్ పేరిట సందేశాలు పంపిస్తూ పెద్ద మొత్తంలో దోచుకుంటున్నారు. ఈ తరహా మోసాల పట్ల వ్యక్తులు, కంపెనీలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వానికి చెందిన సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) హెచ్చరికలు జారీ చేసింది. ఇంతకీ ఏమిటీ బాస్ స్కామ్? (Boss scam) ఎలా మోసగిస్తున్నారు?
సైబర్ నేరగాళ్లు ఒక సంస్థలోని సీఈవో (CEO) లేదా ఇతర ఉన్నతోద్యోగుల పేర్లను ఉపయోగించుకుని ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగులను మోసం చేసే విధానాన్నే బాస్ స్కామ్ అంటారు. పై అధికారుల ఆదేశాలను సాధారణంగా ఉద్యోగులు తూ.చ. తప్పకుండా పాటిస్తుంటారు. దీన్నే ఆసరగా చేసుకుని కింది స్థాయి ఉద్యోగుల నుంచి డబ్బులు బదిలీ చేయించుకోవడం లేదా రహస్య సమాచారాన్ని తస్కరించడం ఈ స్కామ్ ముఖ్య ఉద్దేశం.
తొలుత సీఈవోలు, ఉన్నతాధికారులకు సైబర్ నేరగాళ్లు వల పన్నుతారు. ఆర్బీఐ వంటి ప్రభుత్వ నియంత్రణ సంస్థల పేరుతో కంపెనీ సీఈవోలకు వాట్సాప్ లేదా ఇ-మెయిల్ సందేశాలు పంపుతారు. నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ ఒక జిప్ ఫైల్‌ను సెండ్ చేస్తారు. ఆ ఫైల్‌ను సీఈవో ఓపెన్ చేయగానే మాల్వేర్ సిస్టమ్‌లోకి ప్రవేశిస్తుంది. చాలా కేసుల్లో సీఈవోలు ఆయా సందేశాలను తమ ఫైనాన్స్ ఆఫీసర్లకు పంపించినట్లు I4C పేర్కొంది. ఆ మాల్వేర్ ద్వారా సైబర్ నేరగాళ్లు వాట్సప్ వెబ్ సెషన్లను హ్యాక్ చేసి, వారి అఫీషియల్ కమ్యూనికేషన్లను తమ అధీనంలోకి తీసుకుంటారు. ఆ తర్వాత ఆ నంబర్ నుంచి ఫైనాన్స్ టీమ్‌కు మెసేజ్‌లు పంపి, అత్యవసరంగా డబ్బులు బదిలీ చేయాలని ఆదేశిస్తారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.