ప్రముఖ పర్యాటక ప్రాంతం లోహగఢ్ కోట వద్ద జరిగిన మహారాష్ట్రకు చెందిన యువ వ్యాపారవేత్త కేతన్ విశాల్ అగర్వాల్ మృతి కేసులో కళ్లుబైర్లు కమ్మే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి.
కాబోయే భార్య సియా గోయల్ ఫొటోలు తీస్తూ కేతన్ ప్రమాదవశాత్తు లోయలో పడి చనిపోయాడని అంతా భావించారు. కానీ, పక్కా ప్రణాళికతోనే సియా హత్యచేసినట్టు బయటపడింది. అయితే, ఘటనకు నాలుగు రోజుల ముందే ఒకసారి విఫలయత్నం చేసిన విషయం తాజాగా వెల్లడయ్యింది. అదే ప్రాంతంలో చంపడానికి ప్రయత్నించినట్టు కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్ తెలిపారు. జూన్ 14న కేతన్‌ను కోట పైనుంచి సియా ఎలా తోసేసిందో ఆయన వివరించారు. కేతన్ ఒక పొదను పట్టుకుని ప్రాణాలతో బయటపడగా, సియా పాము వస్తోందని అరిచి, ఆ తర్వాత అతడిని గట్టిగా కౌగిలించుకుని డ్రామాలు ఆడిందని అన్నారు.‘‘జూన్ 14న వాళ్లిద్దరూ ఒంటరిగా కోటకు వెళ్లారు.. అక్కడ సియా కేతన్‌ను తోసింది.. అయితే, కేతన్ ఒక పొదను పట్టుకుని ప్రమాదం తప్పించుకున్నాడు.. కుట్ర బయటపడిపోతుందనే భయంతో ‘పాము, పాము’ అని అరిచింది’’ అని విశాల్ అగర్వాల్ చెప్పారు. ‘‘ప్రీ-వెడ్డింగ్ షూట్ కోసం బాలికి వెళ్లేందుకు విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు అందరి పాస్‌పోర్ట్‌లు ఉన్నాయి.. కానీ కేతన్ పాస్‌పోర్ట్ కనిపించలేదు. అది ఎక్కడో పడిపోయినట్లు అనిపించింది.. వెతికినా కానీ పాస్‌పోర్ట్ ఎక్కడా దొరకలేదు.. అందువల్ల వాళ్లు వెనుదిరిగారు.. తర్వాత మూడు లేదా నాలుగో రోజున లోహగడ్ కోటకు వెళ్లాల్సిందేనని మళ్లీ గొడవకు దిగింది’’ పేర్కొన్నారు.‘‘ఆ తర్వాత, జూన్ 14న లోహగడ్‌కు వెళ్లినప్పుడు ఆమె కేతన్‌ను తోసింది. దీంతో వెనక్కి జారిపోయిన కేతన్ చేతికి ఒక పొద తగలడంతో దానిని పట్టుకుని తప్పించుకున్నాడు.. ఆ తర్వాత తనను ఎవరో తోసేశారని, ప్రాణాలతో బయటపడ్డానని గ్రహించాడు. కానీ, సియా వెంటనే, 'పాము, పాము' అని అరుస్తూ వెళ్లి కౌగిలించుకుంది’’ అని తెలిపారు.పుణే జిల్లా గహుంజేకి చెందిన కేతన్ తన కుటుంబం రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థకు డైరెక్టర్‌గా ఉన్నారు. జూన్ 18న లోహగడ కోట వద్ద దాదాపు 400 అడుగుల లోతైన లోయలో పడి మరణించారు. మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్రతో ముడిపడి ఉన్న ఈ కోట.. మహారాష్ట్రలో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించిన 12 కోటలలో ఒకటి.మొదట్లో, ఈ మరణాన్ని ఒక ప్రమాదంగా పరిగణించారు. కోట వద్ద విహారయాత్రకు వెళ్లినప్పుడు కాబోయే భార్యను ఫోటో తీస్తుండగా బలమైన గాలులకు కేతన్ జారిపడినట్టు సియా పోలీసులకు చెప్పింది. దీంతో ప్రమాదవశాత్తు మరణంగా కేసు నమోదు చేశారు. పోలీసులు తర్వాత పరిస్థితులను పరిశీలించి, అవి అనుమానాస్పదంగా ఉన్నాయని కనుగొన్నారు. సియాను, ఆమె ప్రియుడు చేతన్ బాబులాల్ చౌదరిని హత్య, నేరపూరిత కుట్ర ఆరోపణలపై అరెస్టు చేశారు.పుణే రూరల్ ఎస్పీ సందీప్ సింగ్ గిల్ మాట్లాడుతూ.. ఆర్థిక వివాదాలు, వ్యక్తిగత సంబంధాలతో సహా పలు కోణాల్లో దర్యాప్తు సాగిందని చెప్పారు. సియాకు చేతన్‌తో సంబంధం ఉందని, కేతన్‌ను తమ బంధానికి అడ్డుగా భావించిందని పోలీసులు నిర్ధారించారు. విహార యాత్ర పేరుతో పథకం ప్రకారమే లోహగడ్ కోటకు కేతన్‌ను తీసుకొచ్చిన సియా.. తర్వాత ప్రియుడు చేతన్‌కు ఫోన్ చేసి రప్పించింది. ఇద్దరూ కలిసి కేతన్‌ను లోయలో తోసేసి ప్రమాదవశాత్తూ పడిపోయినట్టు కట్టుకథను అల్లారు. కానీ, చివరకు పోలీసుల విచారణలో హత్యేనని నిర్దారణ అయ్యింది.