Bank Holidays: బ్యాంకుకు వెళ్లి పూర్తి చేయాల్సిన ఏదైనా పని ఉన్నవారు వీలైనంత త్వరగా పూర్తి చేయడం మంచిది. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఈ వారంలో వరుసగా 3 రోజుల పాటు బ్యాంకులు మూసి ఉండనున్నాయి.
వారాంతపు సెలవులతో పాటు ఈసారి మొహర్రం పండగ సందర్భంగా సెలవు వస్తోంది. దీంతో ఈ వారంతంలో వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. హైదరాబాద్, విజయవాడ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొహర్రం సందర్భంగా ఎప్పుడు సెలవు ఇచ్చారు? ఏ ఏ తేదీల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది? అనే వివరాలు ఇప్పుడే మనం తెలుసుకుందాం.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన సెలవుల క్యాలెండర్ ప్రకారం.. మొహర్రం పండగ సందర్భంగా హైదరాబాద్, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లో జూన్ 26, 2026 శుక్రవారం రోజున బ్యాంకులకు సెలవు ఇచ్చారు. అలాగే అగర్తలా, ఐజ్వాల్, బేలాపూర్, బెంగళూరు, భోపాల్, చెన్నై, హైదరాబాద్, జమ్ము, కాన్పూర్, కోల్కతా, లఖ్నవూ, ముంబై, నాగ్పూర్, ఢిల్లీ, పట్నా, రాయ్పూర్, రాంచి, శ్రీనగర్, విజయవాడలో జూన్ 26న మొహర్రం సెలవు ఇచ్చారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం జూన్ 25న బ్యాంకులకు సెలవు ఉండనుంది.జూన్ 27,28 సెలవుఇక జూన్ 26న మొహర్రం సెలవు ఉండగా ఆ తర్వాత జూన్ 27వ తేదీన నాలుగో శనివారం వస్తోంది.అంటే ఆ రోజున బ్యాంకులకు సాధారణ సెలవు ఉంటుంది. అలాగే జూన్ 28వ తేదీన ఆదివారం సందర్భంగా బ్యాంకులకు వారాంతపు సెలవు ఉంటుంది. దీంతో వరుసగా మూడు రోజుల పాటు అన్ని షెడ్యూల్డ్, నాన్ షెడ్యూల్డ్ బ్యాంకులు మూతపడనున్నాయి. ప్రతి నెలలో రెండో, నాలుగో శనివారం బ్యాంకులకు సెలవు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ కారణంగానే ఈ వారాంతంలో వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులకు సెలవులు వస్తున్నాయి.బ్యాంకులు మూసి ఉంటే డిపాజిట్లు చేయడం, చెక్ డిపాజిట్, డీడీ, నెఫ్ట్ ట్రాన్స్ఫర్ వంటి బ్యాంకుకు వెళ్లి పూర్తి చేయాల్సిన పనులపై ప్రభావం పడనుంది. అయితే, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ ట్రాన్సాక్షన్లు యథాతథంగా కొనసాగుతాయి. డిజిటల్ విధానంలో దాదాపు అన్ని బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయి. కేవలం బ్యాంకుకు వెళ్లి పూర్తి చేయాల్సిన పనులు ఉన్నవారు సెలవులను తెలుసుకుని ప్లాన్ చేసుకోవడం మంచిది.