
తమిళనాడు సీఎం విజయ్ ఇవాళ తన 52వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. పార్టీ పెట్టిన తొలిసారే తమిళనాడులో అఖండ విజయం సాధించి ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు విజయ్.
సీఎం హోదాలో తొలి బర్త్ డే కావడంతో సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా విజయ్ కు శుభాకాంక్షలు తెలిపారు. వారిలో ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, డీఎంకే అధినేత స్టాలిన్, కమల్ హాసన్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తదితరులు ఉన్నారు. దీంతో విజయ్ పేరు దేశవ్యాప్తంగా ట్రెండింగ్ లోకి మారింది.
తమిళనాడు ముఖ్యమంత్రి సీ. జోసెఫ్ విజయ్ కు బర్త్ డే గ్రీటింగ్.. ఆయన దీర్ఘాయుష్షుతో ఆరోగ్యంగా జీవించాలని ప్రార్థిస్తున్నాను అని ప్రధాని మోదీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. అలాగే లోక్ సభ ప్రతిపక్షనేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విజయ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. మీరు మంచి ఆరోగ్యం.. మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు. తమిళ ప్రజల హక్కులు, రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తామని తెలిపారు.
మరోవైపు డీఎంకే అధినేత స్టాలిన్.. తమిళనాడు సీఎం విజయ్ కు విషెస్ తెలిపారు. ప్రజాసేవలో విజయ్ మరింత ఉత్సాహంగా పాల్గొనేలా అవసరమైన శక్తిని పొందాలని కోరుకుంటున్నాను అని ఎక్స్ లో పోస్టు పెట్టారు. ఇక ఏపీ డీప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా విజయ్ కు బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. మీరు ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలని.. ఇలాగే ప్రజాసేవను కొనసాగించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇక ప్రముఖ నటుడు కమల్ హాసన్ ట్వీట్ చేస్తూ.. కోట్లమంది ప్రేమను పొందిన నా తమ్ముడు విజయ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు అని పోస్టు చేశారు. అలాగే సీఎం విజయ్ కు బర్త్ డే విషెస్ తెలిపిన వారిలో సినీ నటి నయనతార, నటి ఖుష్బూ తదితరులు ఉన్నారు.
ఇక సీఎం విజయ్ బర్త్ డే ను అటు టీవీకే నేతలు, కార్యకర్తలు, ఇటు ఫ్యాన్స్ ఎప్పుడూ లేని విధంగా వినూత్నంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే జూన్ 21, 22 తేదీల్లో రాష్ట్రంలోని జూపార్క్ లను ప్రజలు ఉచితంగా సందర్శించే అవకాశం కల్పించారు. ఈ మేరకు తమిళనాడు ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే విజయ్ కెరీర్ లో మైలు రాళ్లుగా నిల్చిన సూపర్ హిట్ చిత్రాలను రీ రిలీజ్ చేస్తున్నారు.
విజయ్ బర్త్ డే సందర్భంగా.. రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు, కేక్ కట్టింగ్స్, సంబరాలు చేస్తున్నారు ఫ్యాన్స్. అలాగే అన్నదానాలు, రక్తదానాలు పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నారు. ఇక విజయ్ బర్త్ డే సందర్భంగా తూత్తుకూడి ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ అరుదైన సంఘటన జరిగింది. సీఎం విజయ్ బర్త్ డే రోజున ఆస్పత్రిలో ఆరుగురు నవజాత శిశువులు జన్మించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే, తమిళనాడు మత్స్య శాఖ మంత్రి శ్రీనాథ్ వెంటనే ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ మేరకు ఆ చిన్నారులకు బంగారు ఉంగరాలను బహూకరించారు. పుడుతూనే ఆ చిన్నారులు బంగారం అందుకోవడంతో ఆ పిల్లల తల్లిదండ్రులు సంతోషంలో ఉన్నారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.