
ఇంటర్నెట్ డెస్క్: తన కుమార్తె ప్రాణాలు కాపాడేందుకు ఓ తండ్రి ఏకంగా చిరుతతోనే పోరాడాడు. అసాధారణ ధైర్యంతో క్రూరమృగం నుంచి చిన్నారిని కాపాడాడు.
కూతురి కోసం తండ్రి చేసిన ఈ పోరాటాన్ని స్థానికులు ప్రశంసిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి మహారాష్ట్రలోని గుంజలే బస్తీలోకి ఓ చిరుత చొరబడింది. అదే సమయంలో దీపాలి అనే మహిళ తన నాలుగేళ్ల కుమార్తెతో కలిసి పొలం నుంచి ఇంటికి వెళ్తున్నారు. పక్కనే ఉన్న పొదల్లో మాటువేసిన చిరుత ఒక్కసారిగా వారిపై దాడి చేసి, చిన్నారిని పొలాల్లోకి లాక్కెళ్లింది.
దీంతో సాయం కోసం ఆ మహిళ కేకలు వేయడంతో అక్కడే ఉన్న చిన్నారి తండ్రి మనోజ్ గుంజలే (32) చిరుత వెళ్లిన వైపు పరుగు తీశాడు. ప్రాణాలకు తెగించి రాళ్లు, కర్రలతో చిరుతపై దాడి చేసి.. తన కూతురిని కాపాడాడు. అక్కడి నుంచి పరుగున వస్తుండగా పొలంలో ఉన్న బావిలో పడిపోయాడు. అప్పుడు కూడా తన కుమార్తెకు ఎలాంటి గాయాలు కాకుండా కాపాడాడు. బావిలో నుంచి వారిని సురక్షితంగా బయటకు తీసిన స్థానికులు మనోజ్‌ను, అతడి కుమార్తెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు.
అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న తమ గ్రామంలోకి తరచూ క్రూర మృగాలు చొరబడుతుండడంపై అటవీ శాఖ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్థులు ఆరోపించారు. ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.