
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను.
2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
UK Prime Minister Resign News: బ్రిటన్ రాజకీయాలు మరోసారి తీవ్ర ఊగిసలాటలో పడ్డాయి. అధికార లేబర్ పార్టీలో అంతర్గత తిరుగుబాటు, సొంత పార్టీ నుంచే ఒత్తిడి తీవ్రం కావడంతో యూకే (UK) ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ సోమవారం తన రాజీనామాను ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడిపించే సత్తా తనకు ఉందా? లేదా? అనే ప్రశ్నలకు సమాధానం దొరికిందని పేర్కొంటూ ఆయన పదవి నుంచి తప్పుకున్నారు.
ఈ రాజీనామాతో, గత పదేళ్ల కాలంలో పూర్తి పదవీకాలం ముగియకుండానే మధ్యలోనే తప్పుకున్న ఆరో బ్రిటీష్ ప్రధానమంత్రిగా కీర్ స్టార్మర్ నిలిచారు. కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకు తాను ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతానని 10 డౌనింగ్ స్ట్రీట్ వెలుపల ఇచ్చిన ప్రకటనలో ఆయన స్పష్టం చేశారు. జూలై 2024 సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీని చారిత్రాత్మక విజయ తీరాలకు చేర్చిన రెండేళ్ల లోపే స్టార్మర్ ఇలా నిష్క్రమించడం గమనార్హం.
భావోద్వేగ ప్రసంగం.. జాతిని ఉద్దేశించి మాట్లాడిన స్టార్మర్.. ఆరేళ్ల క్రితం తాను లేబర్ పార్టీ పగ్గాలు చేపట్టినప్పుడు పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని గుర్తు చేసుకున్నారు. "కఠోర శ్రమతో మేము పార్టీని మార్చాము. ప్రత్యేక హక్కులున్న కొందరి కోసం కాకుండా.. అందరికీ సమాన అవకాశాలు, ఆర్థిక వృద్ధి, పెరిగిన వేతనాలు, కార్మికుల హక్కుల మెరుగుదల కోసం శ్రమించాం. మా ప్రభుత్వం అర మిలియన్ మందిని పేదరికం నుండి బయటకు తీసుకువచ్చింది" అని తన పాలనా రికార్డును ఆయన సమర్థించుకున్నారు. అయినప్పటికీ పార్టీ భవిష్యత్తు కోసం తాను తప్పుకోవడమే సరైన నిర్ణయమని భావించి "నేను రాజీనామా చేస్తున్నాను" అని ప్రకటించారు.
గత కొన్ని నెలలుగా స్టార్మర్ ప్రజాదరణ గణనీయంగా తగ్గుతూ వచ్చింది. ముఖ్యంగా గ్రేటర్ మాంచెస్టర్ మాజీ మేయర్ ఆండీ బర్న్‌హామ్ తిరిగి పార్లమెంట్‌కు ఎన్నికవడంతో స్టార్మర్‌పై ఒత్తిడి పతాక స్థాయికి చేరింది. స్టార్మర్ నాయకత్వాన్ని సవాలు చేయడమే లక్ష్యంగా బర్న్‌హామ్ ప్రచారం నిర్వహించారు. ఆయన సాధించిన విజయం లేబర్ పార్టీకి కొత్త ఊపిరి పోస్తుందని చాలా మంది ఎంపీలు నమ్మడమే స్టార్మర్ పతనానికి నాంది పలికింది.
మరోవైపు, వాగ్దానం చేసిన ఆర్థిక వృద్ధిని సాధించడంలో, ప్రభుత్వ సేవలను మెరుగుపరచడంలో, జీవన వ్యయ సంక్షోభాన్ని అదుపు చేయడంలో స్టార్మర్ ప్రభుత్వం విఫలమైందనే విమర్శలు ఉన్నాయి. వీటికి తోడు గ్రీన్ పార్టీ, రిఫార్మ్ యూకే పార్టీల నుంచి వస్తున్న రాజకీయ పోటీ స్టార్మర్ పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసింది.
తదుపరి ప్రధాని రేసులో ఎవరు? స్టార్మర్ రాజీనామాతో బ్రిటన్ తదుపరి ప్రధాని ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం అందరి దృష్టి ఆండీ బర్న్హామ్పైనే ఉంది. అయితే, రేసులో తానున్నానని మాజీ ఆరోగ్య శాఖ కార్యదర్శి వెస్ స్ట్రీటింగ్ కూడా సంకేతాలు ఇచ్చారు. బర్న్‌హామ్‌తో అంతర్గత ఒప్పందం కుదుర్చుకుని స్ట్రీటింగ్ భవిష్యత్ ప్రభుత్వంలో కీలక పదవి తీసుకునే అవకాశం కూడా ఉందని లేబర్ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.