Aspirants Miss NEET UG Re Exam in Bengaluru : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ పేపర్ లీక్ వివాదాల అనంతరం, నిన్న అత్యంత కఠిన నిబంధనల మధ్య దేశవ్యాప్తంగా దాదాపు 22 లక్షల మంది
విద్యార్థులకు పునఃపరీక్ష నిర్వహించారు. అయితే కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ పరీక్ష కాస్తా తీవ్ర రాజకీయ వివాదానికి దారితీసింది. నగరంలో అధికార కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన భారీ రాజకీయ ర్యాలీ కారణంగా కిలో మీటర్ల మేర రోడ్లు స్తంభించిపోయాయి. దీంతో పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకోలేక విద్యార్థులు, తల్లిదండ్రులు రోడ్లపై తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. చివరకు కేవలం ఒక్క నిమిషం ఆలస్యం కావడంతో ముగ్గురు అభ్యర్థులు పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోయి.. పరీక్షా కేంద్రాల గేట్ల ముందే కన్నీరుమున్నీరయ్యారు.గేట్లు ఎక్కినా దక్కని అనుమతి.. రోడ్లపై నరకం!మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కావాల్సిన ఈ పరీక్ష కోసం అభ్యర్థులు 1.30 గంటలకల్లా రిపోర్ట్ చేయాలని అధికారులు ముందే ఆదేశించారు. కానీ కాంగ్రెస్ సభ వల్ల నగరంలో తీవ్రమైన ట్రాఫిక్ ఏర్పడింది. సమయం ముంచుకొస్తుండటంతో తల్లిదండ్రులు తమ పిల్లలను టూ వీలర్లపై ఫుట్‌పాత్‌ల మీదుగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఆర్టీ నగర్ తదితర ప్రాంతాల నుంచి ఆలస్యంగా కేంద్రానికి చేరుకున్న ముగ్గురు విద్యార్థులను కఠినమైన ఎలక్ట్రానిక్ ప్రోటోకాల్, బయోమెట్రిక్ ఎస్ఓపీల కారణంగా లోపలికి అనుమతించలేదు. నిరాశకు గురైన విద్యార్థినులు కొందరు పరీక్షా కేంద్రం ప్రధాన గేట్లు ఎక్కి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ.. అప్పటికే లోపలి తలుపులు మూసివేయడంతో వారికి నిరాశే ఎదురైంది. కాబోయే వైద్యుల భవిష్యత్తు ఇలా రోడ్డు పాలు కావడంపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.రాహుల్ గాంధీ, సీఎం డీకే శివకుమార్లపై తల్లిదండ్రుల ఫైర్!పరీక్షా కేంద్రాల వెలుపల తల్లిదండ్రులు కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యంగా రాహుల్ గాంధీ, సీఎం డీకే శివకుమార్లపై మండిపడ్డారు. కృష్ణమూర్తి అనే ఒక తండ్రి మాట్లాడుతూ.. "సాధారణంగా 20 నిమిషాలు పట్టే 7 కిలో మీటర్ల ప్రయాణానికి నిన్న 35 నిమిషాలకు పైగా పట్టింది. భయంతో బైక్‌ను ఫుట్‌పాత్‌పై నడిపితే పోలీసులు తిట్టారు. రాజకీయ ర్యాలీలు బెంగళూరు శివార్లలో పెట్టుకోవాలి కానీ ఇలా నగరంలో పెట్టి పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటారా?" అని ప్రశ్నించారు. విద్యార్థుల కోసం కోటా వెళ్లిన రాహుల్ గాంధీకి, ఇప్పుడు తమ స్వంత పార్టీ ర్యాలీ వల్ల విద్యార్థులు నష్టపోతే సమాధానం చెప్పే బాధ్యత లేదా అని మరికొందరు నిలదీశారు. ఈ హృదయవిదారక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పాలిటిక్స్!ఈ ఉదంతాన్ని అస్త్రంగా చేసుకున్న బీజేపీ.. కాంగ్రెస్ పార్టీపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తోంది. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య బాధితుల వీడియోను షేర్ చేస్తూ.. కాంగ్రెస్ అధికార దాహం కోసం ఎంతకైనా దిగజారుతుందని కామెంట్లు చేశారు. మరో బీజేపీ నేత సుధాంశు త్రివేది మాట్లాడుతూ.. నీట్ పరీక్ష తేదీ నెల రోజుల ముందే ఖరారైనా, కాంగ్రెస్ కనీసం ర్యాలీ సమయాన్ని కూడా మార్చకపోవడం సిగ్గుచేటన్నారు. దీనిని మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి కూడా తీవ్రంగా ఖండించారు.ఈ విమర్శలపై కాంగ్రెస్ మంత్రి ప్రియాంక్ ఖర్గే తీవ్రంగా స్పందించారు. "తేజస్వి సూర్య కేంద్ర మంత్రి పదవి కోసం డ్రామాలు ఆడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్ల గత దశాబ్దంలో 89 పేపర్ లీక్‌లు అయ్యాయి. పరీక్ష రాయలేకపోయిన ముగ్గురిలో ఒకరికి పాత హాల్ టికెట్ ఉంది. మేము ముందే ట్రాఫిక్ అడ్వైజరీ, హెల్ప్‌లైన్ ఇచ్చాం" అని సమర్థించుకున్నారు. కాంగ్రెస్ నేత హరిప్రసాద్ విద్యార్థులకు జరిగిన ఇబ్బందికి విచారం వ్యక్తం చేస్తూనే.. గతంలో నీట్ ఒత్తిడి వల్ల చనిపోయిన విద్యార్థులకు బీజేపీ ఎప్పుడైనా క్షమాపణలు చెప్పిందా అని ఎదురుదాడికి దిగారు.