
ఇంటర్నెట్ డెస్క్: బ్రిటన్లో మరోసారి రాజకీయ అస్థిరత నెలకొంది. ఆ దేశ ప్రధాని కీర్ స్టార్మర్ (UK PM Keir Starmer) తన పదవికి రాజీనామా చేశారు.
లేబర్ పార్టీ ఒత్తిడి వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. పదవిలో ఉన్నంత కాలం విలువలకు కట్టుబడి పని చేసినట్లు తెలిపారు. తాజా పరిణామంతో బ్రిటన్లో దశాబ్ద కాలంలో తమ పదవులకు రాజీనామా చేసిన ప్రధానుల సంఖ్య ఆరుకి చేరింది.
కీర్ స్టార్మర్ 2024లో బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. స్థానిక ఎన్నికల్లో లేబర్ పార్టీ పేలవమైన ప్రదర్శన మాత్రమే ఇవ్వడం, మేకర్ఫీల్డ్ పార్లమెంటరీ ఉపఎన్నికలో బర్న్హామ్ ఘన విజయం సాధించడంతో స్టార్మర్ నాయకత్వంపై ప్రశ్నలు వస్తున్నాయి. ఎప్స్టీన్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తన స్నేహితుడు పీటర్ మాండెల్సన్ను అమెరికాలో యూకే రాయబారిగా నియమించాలనే స్టార్మర్ నిర్ణయంపైనా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో తాను ప్రధాని పదవి నుంచి వైదొలగాలని సహచర మంత్రులతోపాటు సొంత పార్టీ ఎంపీల నుంచి ఆయనపై ఒత్తిడి పెరిగింది. అయినప్పటికీ తాను పదవి నుంచి వైదొలిగే ప్రసక్తే లేదని వాదిస్తూ వచ్చిన స్టార్మర్.. తాజాగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం.
మరోవైపు, బ్రిటన్ ప్రధానిగా కీర్ స్టార్మర్ రాజీనామా చేస్తారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఆదివారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. వలసలు, ఇంధన విధానాల్లో వైఫల్యాలే అందుకు కారణమని తన పోస్టులో ఆయన పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.