
కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి వెళ్లే భక్తులకు ఈ ఏడాది సరికొత్త, హైటెక్ అనుభూతి కలగబోతోంది. ప్రతి ఏటా ఇక్కడికి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు.
అయితే ఈసారి రద్దీని తట్టుకునేందుకు కేరళ పోలీస్, ట్రావెన్కూర్ దేవస్వం బోర్డు (TDB) నేరుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయం తీసుకోనున్నాయి.
దట్టమైన అడవుల మధ్య ఉన్న ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇకపై డ్రోన్లు, ఏఐ కెమెరాలు, ప్రెడిక్టివ్ సిస్టమ్స్ ద్వారా భద్రతను, భక్తుల రద్దీని పర్యవేక్షించనున్నారు. ఈ ఏడాది నవంబర్ నెల నుంచి ఈ సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి రానుంది.
శబరిమల కొండ కేరళలోని పతనంతిట్ట జిల్లాలో దట్టమైన అడవుల మధ్య ఉంది. గత ఏడాది ఇక్కడ రికార్డు స్థాయిలో 51 లక్షల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఇంత భారీ మొత్తంలో వచ్చే జనాన్ని కంట్రోల్ చేయడం పోలీసులకు, అధికారులకు ఎప్పుడూ పెద్ద టాస్కే. అందుకే ఈ సమస్యకు చెక్ పెట్టడానికి ఢిల్లీ, చెన్నై, ముంబై నగరాలకు చెందిన మూడు పెద్ద ఏఐ కంపెనీలు ఒక స్పెషల్ ప్రపోజల్ సిద్ధం చేశాయి. శనివారం జరిగిన ఒక హై-లెవల్ మీటింగ్‌లో దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నవంబర్ నుంచి ఫేజ్ ల వారీగా ఈ ఏఐ సాంకేతికతను అమలు చేయనున్నారు.
పతనంతిట్ట జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఆర్. ఆనంద్ చెప్పిన వివరాల ప్రకారం.. ఏఐ ఆధారిత క్రౌడ్ మేనేజ్మెంట్ సిస్టమ్‌ను ఇదివరకే మహాకుంభమేళా, ఇతర పెద్ద పెద్ద ఉత్సవాల్లో సక్సెస్‌ఫుల్‌గా వాడారు. కానీ శబరిమల భౌగోళిక పరిస్థితి వేరు. ఇది దట్టమైన అడవిలో ఉంది కాబట్టి ఇక్కడి కోసం ఒక ప్రత్యేకమైన ఏఐ సొల్యూషన్‌ను డిజైన్ చేస్తున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల మధ్య కో-ఆర్డినేషన్ పెంచడానికి, భక్తుల భద్రతను కరెక్ట్‌గా ప్లాన్ చేయడానికి ఈ సిస్టమ్ ఒక గేమ్ ఛేంజర్ కానుంది.
ఈ కొత్త టెక్నాలజీ వల్ల భక్తులకు చాలా లాభాలు ఉన్నాయి. సాధారణంగా శబరిమల భారీ రద్దీలో భక్తులు తమ కుటుంబ సభ్యులను మిస్ అవుతుంటారు. అయితే ఇకపై ఏఐ కెమెరాల సాయంతో తప్పిపోయిన వారిని చాలా ఈజీగా ట్రాక్ చేయవచ్చు.
అంతేకాదు, ఆలయం చుట్టుపక్కల ఉన్న 26 పార్కింగ్ గ్రౌండ్స్‌లో వాహనాల రాకపోకలను ఎలాంటి హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా ఆటోమేటిక్‌గా మేనేజ్ చేస్తారు. దీనివల్ల అక్కడ డ్యూటీలో ఉండే పోలీసుల పని భారం తగ్గి, వారు భద్రతపై మరింత ఎక్కువ ఫోకస్ పెట్టే అవకాశం దొరుకుతుంది.
ఈ మొత్తం హైటెక్ సిస్టమ్ కోసం ఏఐ కెమెరాలు, డ్రోన్లు, జీఐఎస్ మ్యాపింగ్‌తో ఒక పెద్ద నెట్వర్క్ తయారు చేస్తారు. ఈ సిస్టమ్ కేవలం వీడియో ఫీడ్‌ను అనలైజ్ చేయడమే కాకుండా, ఏ రూట్లో భక్తుల రద్దీ పెరగబోతోందో ముందే ఊహించి చెప్తుంది.
ఏదైనా ఒక పాయింట్ దగ్గర జనం ఎక్కువైతే వెంటనే కంట్రోల్ రూమ్‌కు అలర్ట్ వెళ్తుంది. అక్కడ డ్యూటీలో ఉన్న పోలీసుల డిజిటల్ డివైజ్‌లకు మెసేజ్ వెళ్లడం వల్ల వారు వెంటనే అలర్ట్ అయి జనాన్ని వేరే రూట్ లోకి డైవర్ట్ చేస్తారు. దీనివల్ల తొక్కిసలాటలు లాంటి ప్రమాదాలు జరగకుండా ముందే ఆపవచ్చు.
ఈ కొత్త టెక్నాలజీ వస్తోంది సరే.. మరి పాత నియమాలు మారిపోతాయా అని భక్తులకు డౌట్ రావచ్చు. అయితే ప్రస్తుతానికి అమల్లో ఉన్న వర్చువల్ క్యూ సిస్టమ్ మునుపటి లాగే కొనసాగుతుందని అధికారులు చెప్పారు. భక్తులు ఆలయానికి వెళ్లే ముందు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుని తమ టైమ్ స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
కాకపోతే, ఇప్పటివరకు భక్తులు క్యూ లైన్లలో గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చేది. ఇకపై ఏఐ ద్వారా రియల్ టైమ్ డేటా లభించడం వల్ల వెయిటింగ్ టైమ్ చాలా వరకు తగ్గుతుంది. ఈసారి శబరిమల యాత్ర మరింత డిజిటల్ అండ్ సేఫ్‌గా మారబోతోంది.