
స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ నెల 19న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, తొలి వారాంతంలోనే ప్రపంచవ్యాప్తంగా రూ.
43 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రత్యేక పోస్టర్ను విడుదల చేసింది. ‘బ్లాక్బస్టర్ బంగారం’ అని పేర్కొంటూ విడుదల చేసిన ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. విడుదలైన తొలి రోజైన శుక్రవారం ఈ సినిమా రూ. 13.15 కోట్ల గ్రాస్ రాబట్టింది. రెండు రోజులు ముగిసేసరికి వసూళ్లు రూ. 28 కోట్లను దాటాయి. ఇక, వీకెండ్లో చివరి రోజైన ఆదివారం నాడు కలెక్షన్లు మరింత పెరిగాయి. ఒక్క ఆదివారమే ఏకంగా రూ. 15 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న వసూళ్ల సరళిని బట్టి చూస్తే, ఈ చిత్రం త్వరలోనే రూ. 50 కోట్ల క్లబ్లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.ఫ్యామిలీ క్రైమ్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రముఖ దర్శకురాలు నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణతో చిత్రయూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది.