
China : అగ్రరాజ్యం అమెరికాకు చైనా బిగ్ షాకిచ్చింది. అమెరికాకు చెందిన 10 కంపెనీలపై ఎగుమతి నియంత్రణలు (ఎక్స్పోర్ట్ కంట్రోల్స్) విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
ముఖ్యంగా రక్షణ రంగం, అరుదైన ఖనిజాల (రేర్ ఎర్త్) వ్యాపారంతో సంబంధం కలిగిన సంస్థలను లక్ష్యంగా చేసుకొని ఈ చర్యలు చేపట్టినట్లు చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అమెరికా ఇటీవల తమ రక్షణ రంగ కాంట్రాక్టుల్లో చైనా టెక్ కంపెనీలను నిషేధించిన నేపథ్యంలో బీజింగ్ ఈ చర్యలు చేపట్టింది. చైనా సైన్యానికి సహకరిస్తున్నాయనే ఆరోపణలతో 80 చైనీస్ కంపెనీలను అమెరికా ఇటీవల బ్లాక్ లిస్టులో చేర్చిన విషయం తెలిసిందే.
అంతేకాకుండా.. అమెరికాకు చెందిన మరో 46 కంపెనీల ఉత్పత్తులను చైనా ప్రభుత్వం కొనుగోలు సంస్థలు కొనుగోలు చేయకుండా నిషేధించింది. ఇందులో లాక్‌హీడ్ మార్టిన్, రేథియాన్, జనరల్ డైనమిక్స్ సంస్థలకు చెందిన పలు యూనిట్లు ఉన్నాయి. సోమవారం నుంచే ఈ నిషేధం అమల్లోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే, చైనాలో పెట్టుబడులతో నడుస్తున్న కంపెనీలకు ఈ కొనుగోలు ఆంక్షల నుండి మినహాయింపు ఇచ్చారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో బీజింగ్‌లో భేటీ అయి, ఇరు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపర్చేందుకు చర్చలు జరిపిన నెలరోజుల వ్యవధిలోనే ఈ పరిణామం చోటు చేసుకోవటం గమనార్హం.
అయితే, ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైనా అమెరికా, చైనా దేశాల మధ్య ఈ ఆంక్షల ప్రభావం వాణిజ్యపరంగా పెద్దగా ఉండకపోవచ్చని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఎందుకంటే చైనా లక్ష్యంగా పెట్టుకున్న అనేక అమెరికా కంపెనీలకు ఆ దేశంలో పెద్దఎత్తున వ్యాపార కార్యకలాపాలు లేవని వారు చెబుతున్నారు. అయినప్పటికీ, ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా-చైనా మధ్య వాణిజ్య, సాంకేతిక పోటీ మరింత తీవ్రతరమవుతోందని ఈ పరిణామం స్పష్టం చేస్తోంది.