
నాన్ వెజ్ ప్రియులు ఆదివారం వచ్చిందంటే చాలు మాంసాహారం కోసం ఉవ్విళ్లూరుతారు. అయితే ఎప్పుడూ వండే రెగ్యులర్ చికెన్ కర్రీ లేదా బిర్యానీ కాకుండా, ఇంట్లోనే తక్కువ సమయంలో ఎంతో టేస్టీగా తయారు
చేసుకోగలిగే వంటకం పెప్పర్ చికెన్. ఇంట్లో చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు. రెస్టారెంట్ రుచిని తలపించే ఈ స్పైసీ వంటకానికి కావలసిన పదార్థాలు , అది తయారు చేసే విధానం తెలుసుకుందాం.
అల్లం ముక్క – 1, వెల్లుల్లి రెబ్బలు – 2 (సన్నగా తరిగినవి)
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 లేదా 2 టేబుల్ స్పూన్లు
మిరియాల పొడి – 2 టేబుల్ స్పూన్లు, సోంపు గింజలు – 2 టేబుల్ స్పూన్లు
కరివేపాకు – 2 రెమ్మలు, నువ్వుల నూనె , ఉప్పు – రుచికి తగినంత
స్పైసీ పెప్పర్ చికెన్ తయారీ విధానం మొదటగా అర కిలో శుభ్రం చేసిన చికెన్ ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ల కారం పొడి, ధనియాల పొడి, అర టేబుల్ స్పూన్ పసుపు పొడి , 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేయాలి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, అర కప్పు చిక్కటి పెరుగు వేసి ముక్కలకు మసాలాలన్నీ బాగా పట్టేలా కలపాలి. ఈ మిశ్రమాన్ని కనీసం 10 నిమిషాల పాటు అలాగే నాననివ్వాలి.
ఇప్పుడు పొయ్యి మీద ఒక బాణలి పెట్టి తగినంత నువ్వుల నూనె వేసి వేడి చేయాలి. నూనె కాగాక మొదటగా ఒక అల్లం ముక్క, సన్నగా తరిగిన రెండు వెల్లుల్లి రెబ్బలు , కరివేపాకు వేసి బాగా వేయించాలి. ఇవి వేగి మంచి సువాసన రాగానే, అందులో ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలా వేయించుకోవాలి. ఆ తర్వాత నిలువుగా కోసిన 2 పెద్ద ఉల్లిపాయల ముక్కలను వేసి దోరగా వేపాలి.
ఉల్లిపాయ ముక్కలు చక్కగా బంగారు గోధుమ రంగులోకి మారిన తర్వాత, ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను ఆ బాణలిలో వేయాలి. మంటను తక్కువగా ఉంచి (సిమ్‌లో) దాదాపు 15 నిమిషాల పాటు చికెన్‌ను బాగా ఉడికించుకోవాలి. ఈ లోపు మిరియాల పొడి , సోంపు గింజల పొడిని సమాన పరిమాణంలో తీసుకుని బాగా నూరుకోవాలి.
చికెన్ ఉడుకుతున్న సమయంలో ఈ మిరియాలు, సోంపు పొడి మిశ్రమాన్ని కూడా అందులో వేసి ముక్కలకు పట్టేలా బాగా కలపాలి. చివరి 10 నుండి 15 నిమిషాల పాటు బాణలిపై మూత పెట్టకుండా అలా వదిలేయాలి. దీనివల్ల కూరలోని నూనె అంతా పైకి తేలుతుంది. నూనె పైకి తేలగానే ఎంతో రుచికరమైన, ఘాటైన రెస్టారెంట్ స్టైల్ పెప్పర్ చికెన్ సిద్ధమైనట్లే. ఈ ఆదివారం మీ కుటుంబ సభ్యులతో కలిసి వేడి వేడి రసం అన్నంతో ఈ పెప్పర్ చికెన్‌ను తిని ఆనందించండి.