Delhi Smart Streetlight Project : ప్రజా మౌలిక సదుపాయాల కల్పనలో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యానికి, అక్రమాలకు అడ్డుకట్ట వేసేలా ఢిల్లీ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది.
దేశ రాజధాని నగరంలోని వీధి దీపాలను అత్యాధునిక సాంకేతికతతో ఆధునీకరించేందుకు రూ. 473 కోట్ల భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. అయితే ఈ ప్రాజెక్టులో కేవలం నిధులు కేటాయించడమే కాకుండా.. "నో పెర్ఫార్మెన్స్, నో పేమెంట్" (పనితీరు బాగుంటేనే నిధుల విడుదల) అనే సరికొత్త జవాబుదారీ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం.. కాంట్రాక్టర్లు అమర్చిన వీధిదీపాలు నిరంతరం వెలుగుతూ, పక్కాగా పని చేస్తేనే వారికి ప్రభుత్వం నుంచి డబ్బులు అందుతాయి.ఏంటీ కొత్త పేమెంట్ మోడల్..?సాధారణంగా ప్రభుత్వ కాంట్రాక్టుల్లో పనులు ప్రారంభించేటప్పుడు లేదా పూర్తి చేసిన వెంటనే పెద్ద మొత్తంలో అడ్వాన్స్ నిధులు విడుదల అవుతుంటాయి. ఆ తర్వాత సదరు మౌలిక సదుపాయాల నిర్వహణను కాంట్రాక్టర్లు గాలికి వదిలేస్తుంటారు. ఈ లొసుగును అరికట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఈ ప్రాజెక్టు కింద టెండర్లు దక్కించుకున్న సంస్థలే వీధి దీపాలను అమర్చడంతో పాటు వాటి దీర్ఘకాలిక నిర్వహణ బాధ్యతలను కూడా చూసుకోవాలి. ప్రభుత్వం వీరికి ఒకేసారి కాకుండా నెలవారీ వాయిదాల పద్ధతిలో నిధులను విడుదల చేస్తుంది. నిర్ణీత ప్రమాణాల ప్రకారం వీధిదీపాలు వెలగకపోయినా, సాంకేతిక లోపాలు తలెత్తినా కాంట్రాక్టర్ల బిల్లుల నుంచి నిధులను కట్ చేస్తారు. దీనివల్ల కేవలం లైట్లు ఇన్స్టాల్ చేయడంపైనే కాకుండా అవి నిరంతరం పని చేసేలా చూడటంపై కాంట్రాక్టర్లు శ్రద్ధ పెట్టక తప్పదు.96,000 స్మార్ట్ ఎల్ఈడీ లైట్లు..!ఢిల్లీ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (పీడబ్ల్యూడీ) పరిధిలోని సుమారు 1,400 కిలో మీటర్ల మేర ఉన్న ప్రధాన రహదారులు, కారిడార్లు, ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లలో ఈ ప్రాజెక్టును విస్తరించనున్నారు. ప్రస్తుతం నగరంలోని 51,000 పైగా పోల్స్‌పై దాదాపు 96,000 వీధిదీపాలు ఉన్నాయి. ఇవన్నీ పాతకాలపు లైట్లు కావడం, కాలం చెల్లిన మౌలిక సదుపాయాలు ఉండటంతో పదే పదే మరమ్మతులకు గురవుతున్నాయి. ప్రస్తుతం ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే తప్ప లైట్లు వెలగడం లేదనే విషయం అధికారుల దృష్టికి రావడం లేదు. దీనివల్ల మరమ్మతుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ సమస్యకు చెక్ పెడుతూ పాత లైట్ల స్థానంలో సరికొత్త ఎనర్జీ-ఎఫిషియంట్ స్మార్ట్ ఎల్ఈడీ పిక్చర్లను ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా తక్కువ వెలుతురు ఉన్న చీకటి ప్రాంతాలను గుర్తించి అదనపు పోల్స్ కూడా నిర్మించనున్నారు.కమాండ్ సెంటర్ నుంచే నిఘా..!ఈ ప్రాజెక్టులోని అత్యంత కీలకమైన భాగం.. 'సెంట్రల్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్'. ఈ అత్యాధునిక సాంకేతికత ద్వారా నగరంలోని వీధి దీపాల నెట్‌వర్క్‌ను అధికారులు ఒకే చోట నుంచి రియల్ టైమ్‌లో పర్యవేక్షించవచ్చు. ఎక్కడైనా లైట్లు పాడైనా లేదా ఒక నిర్దిష్ట ప్రాంతంలో చీకటిగా ఉన్నా.. ప్రజలు ఫిర్యాదు చేసే పని లేకుండా ఈ సిస్టమ్ ఆటోమేటిక్‌గా అధికారులకు సమాచారం అందిస్తుంది. దీనివల్ల తక్షణమే స్పందించి మరమ్మతులు చేపట్టే అవకాశం కలుగుతుంది. ఈ ఆధునీకరణ వల్ల వాహనదారులు, పాదచారులకు రక్షణ పెరగడమే కాకుండా.. విద్యుత్ వినియోగం, ప్రభుత్వానికి అయ్యే నిర్వహణ ఖర్చులు భారీగా తగ్గనున్నాయి. అయితే ఈ వినూత్న ప్రాజెక్టు విజయవంతం కావడం అనేది క్షేత్రస్థాయిలో దీని అమలు, పర్యవేక్షణపైనే ఆధారపడి ఉంటుంది. సాంకేతిక లోపాల సవరణకు ఎంత సమయం ఇస్తారు? నిబంధనలు ఉల్లంఘిస్తే ఎలాంటి కఠిన జరిమానాలు విధిస్తారనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. అయినప్పటికీ జవాబుదారీతనం పెంచేందుకు ఢిల్లీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా ప్రశంసలుందుకుంటోంది.