
Andhra Pradesh : ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది.
హామీల్లో భాగంగా ఇప్పటికే పలు కొత్త పథకాలను అమలు చేస్తున్న సర్కార్.. మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమైంది.
ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో పథకం అమలుకు సిద్ధమైంది. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోన్న సర్కార్.. త్వరలోనే నేతన్నకు భరోసా పథకాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.. ఈ విషయాన్ని ఏపీ చేనేత, జౌళిశాఖ మంత్రి సవిత అధికారికంగా ప్రకటించారు. ఈ పథకం ద్వారా చేనేత కార్మికులకు ఆర్థిక భరోసానిచ్చేలా ఏడాదికి రూ.25వేలు చొప్పున అర్హులైన చేనేతల బ్యాంక్ ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుంది. ఈ పథకం అమలుకు సంబంధించి మార్గదర్శకాలు రూపొందిస్తున్నామని మంత్రి తెలిపారు. వారి ఆరోగ్య భద్రతకు యూనివర్సల్ హెల్త్ పాలసీని అమలు చేయనున్నట్లు వివరించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చేనేత కార్మికుల ఉపాధి మెరుగయ్యేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి సవిత తెలిపారు. ఈ క్రమంలోనే.. రాజధాని అమరావతిలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) ఏర్పాటుకు ఇప్పటికే కేంద్రమంత్రి సూత్రప్రాయంగా అంగీకరించారని, త్వరలో తీపికబురు అందనుందని వెల్లడించారు. అమరావతిలోనే చేనేత, హస్తకళల మ్యూజియం ఏర్పాటుకు కేంద్రానికి నివేదించామన్నారు. చేనేత, హస్తకళాకారులకు సంవత్సరం పొడవునా ఉపాధి ఉండేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు.
చేనేత కార్మికులకు 10 చిన్న తరహా క్టస్లరు అందుబాటులోకి తీసుకొస్తున్నామని, 90శాతం రాయితీతో ఆధునిక మగ్గాలను అందించబోతున్నామని మంత్రి సవిత తెలిపారు. చేనేత వస్త్రాలు, హస్తకళా రూపాలు ఒకేచోట విక్రయించేలా షోరూంలను ఏర్పాటు చేయబోతున్నామని అన్నారు. ఇప్పటికే శాలువా, పంచె, తదితర ఎనిమిది రకాల చేనేత వస్త్రాలను టీటీడీకి సరఫరా చేసేలా ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు.
విశాఖలో రూ.172 కోట్లతో యూనిటీ మాల్‌ను ఏర్పాటుచేస్తున్నామని అన్నారు. త్రిఫ్ట్ ఫండ్ పథకాన్ని, నూలు రాయితీ పథకాన్ని పునరుద్దరించామని, ఈ రెండు పథకాల కింద గత రెండేళ్లలో రూ.260 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. చేనేతలకు ఉచిత విద్యుత్ పథకాన్ని ఇప్పటికే అమలు చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో చేనేతలకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేలా కూటమి ప్రభుత్వం అన్నివిధాల చర్యలు తీసుకుంటుందని మంత్రి సవిత తెలిపారు.