
తెలంగాణలో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా హైదరాబాద్‌తో సహా పలు జిల్లాలకు వాతావరణ శాఖ 'ఎల్లో అలర్ట్' ప్రకటించింది.
జూన్ 22 నుంచి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
భారత వాతావరణ శాఖ (IMD) అంచనాల ప్రకారం, నైరుతి రుతుపవనాలు జూన్ 8న రాష్ట్రంలోకి ప్రవేశించినప్పటికీ, వాటి కదలిక కొంత మందగించింది. ఇప్పుడు జూన్ 23వ తేదీ నుంచి రుతుపవనాలు తెలంగాణ వ్యాప్తంగా మళ్లీ ఊపందుకోనున్నాయి. ఈ వాతావరణ మార్పుల కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఇప్పటికే కురుస్తుండగా, రాబోయే రోజుల్లో వర్షాల తీవ్రత పెరగనుంది.
హైదరాబాద్‌తో పాటు, ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. జూన్ 22వ తేదీన ఈ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. జూన్ 23 నుంచి 24 వరకు ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురుసే సూచనలున్నాయి.
జూన్ 24 నుంచి జూన్ 25వ తేదీ మధ్య వర్షాల ప్రభావం మరింత విస్తరించి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.
భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడం, ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉంది. ట్రాఫిక్ పోలీసులు ఇచ్చే లైవ్ అప్డేట్లను గమనించాలని, ప్రయాణాల్లో జాప్యం జరగకుండా ముందే ప్రణాళిక చేసుకోవాలని సూచించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. జీహెచ్ఎంసీ బృందాలు అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాయని, ఆకస్మిక వరదలు వచ్చే ప్రాంతాలకు దూరంగా ఉండటం క్షేమకరం అని అధికారులు తెలిపారు.
ప్రజలు చెట్ల కింద, హోర్డింగ్స్ వద్ద నిలబడవద్దని, వర్షాల సమయంలో అధికారిక ప్రకటనలను ఎప్పటికప్పుడు గమనించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. రాబోయే నాలుగు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గుతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.