శ్రీలంక వేదికగా శ్రీలంక-ఏ, అఫ్ఘానిస్థాన్-ఏ జట్లతో జరిగిన ట్రై సిరీస్‌లో భారత్ విజేతగా నిలిచింది. ఆదివారం శ్రీలంక-ఏతో దంబుల్లాలో జరిగిన ఫైనల్లో భారత జట్టు.. 66 పరుగుల తేడాతో విక్టరీ సాధించింది.
ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా-ఏ నిర్ణీత 50 ఓవర్లలో 377/9 పరుగులు చేసింది. అనంతరం శ్రీలంకను 311 పరుగులకు కుప్ప కూల్చింది. బ్యాటింగ్‌లో పెను విధ్వంసం సృష్టించిన వైభవ్ సూర్యవంశీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.ఈ మ్యాచులో టాస్ గెలిచిన శ్రీలంక ఏ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. అయితే ఈ నిర్ణయం తప్పు అని తెలుసుకునేందుకు ఆ జట్టుకు ఎంతో సమయం పట్టలేదు. శ్రీలంక-ఏతో జరిగిన లీగ్ మ్యాచులో ఆ జట్టు ఆటగాళ్లతో వాగ్వాదానికి దిగిన వైభవ్ సూర్యవంశీ.. ఈ మ్యాచులో ఊచకోత కోశాడు. లంక బౌలర్లను చీల్చి చెండాడాడు. ఏకంగా 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టి.. లిస్ట్ ఏ క్రికెట్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ నమోదు చేశాడు. ఆ తర్వాత కూడా జోరు కొనసాగించిన అతడు.. 29 బంతుల్లో 94 పరుగులు చేశాడు. తిలక్ వర్మ (67) కూడా రాణించడంతో ఇండియా-ఏ నిర్ణీత 50 ఓవర్లలో 377/9 పరుగులు చేసింది.అనంతరం ఛేజింగ్‌కు దిగిన శ్రీలంక-ఏ ఆది నుంచి వికెట్లు కోల్పోయింది. వనుజ్ సహన్ (62), సదీర సమరవిక్రమ (62) పోరాడినా.. జట్టుకు విజయాన్ని మాత్రం అందించలేకపోయారు. దీంతో శ్రీలంక 47.1 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో యశ్ ఠాకూర్ 3, విప్రాజ్ నిగమ్ 3 వికెట్లు తీశారు. అశోక్ శర్మ 1, తిలక్ వర్మ 1 వికెట్ తీశారు. ఈ విజయంతో భారత్.. ట్రై సిరీస్ టైటిల్ అందుకుంది.ఈ సిరీస్‌లో భాగంగా తొలి మూడు మ్యాచులలో భారత్ కేవలం ఒకే మ్యాచులో గెలిచి.. ఫైనల్ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. కానీ చివరి లీగ్ మ్యాచులో అప్ఘాన్‌ను చిత్తు చేసి.. తుది పోరుకు అర్హత సాధించింది. ఫైనల్లో వైభవ్ విధ్వంసంతో ట్రై సిరీస్ టైటిల్ పట్టేసింది.