పశ్చిమాసియాలో గత కొన్ని నెలలుగా సాగుతున్న భీకర యుద్ధానికి, ఉద్రిక్తతలకు శాశ్వత ముగింపు పలకడమే ధ్యేయంగా అమెరికా-ఇరాన్ దేశాల మధ్య అత్యంత కీలకమైన చర్చలు ప్రారంభమయ్యాయి.
నేడు స్విట్జర్లాండ్ వేదికగా ఇరుదేశాల ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాల మధ్య తుది దశ శాంతి చర్చలు అధికారికంగా మొదలయ్యాయి. అయితే.. ఈ శాంతి కసరత్తులు ఒకవైపు సాగుతుండగానే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్రూత్ సోషల్ వేదికగా.. ట్రంప్ ఇరాన్ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లెబనాన్‌లో అశాంతిని రేకెత్తిస్తున్న ఇరాన్ అనుకూల ప్రాక్సీ గ్రూపులను ఉద్దేశించి ట్రంప్ పోస్ట్ పెట్టారు. 'ఇరాన్ తక్షణమే లెబనాన్‌లో తాము భారీగా నిధులు సమకూరుస్తున్న ప్రాక్సీ గ్రూపుల అలజడులను ఆపాలి. ఒకవేళ వారు వినకపోతే.. గత వారం మేము ఇరాన్‌పై చేసిన దాడి కంటే అత్యంత తీవ్రంగా ఊహించని రీతిలో మరోసారి దాడి చేస్తాం' అని ట్రంప్ హెచ్చరించారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో స్విట్జర్లాండ్ చర్చలకు సర్వత్రా ప్రాధాన్యత ఏర్పడింది.అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇరాన్ ప్రెసిడెంట్ మసౌద్ పెజెష్కియాన్ల మధ్య ఈ వారంలోనే ఒక ప్రాథమిక అవగాహన ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఆ ఒప్పందంలోని అంశాలను క్షేత్రస్థాయిలో ఎలా అమలు చేయాలనే రోడ్‌మ్యాప్‌ను ఖరారు చేయడానికే స్విట్జర్లాండ్‌లో ఈ భేటీ ఏర్పాటు చేశారు. అమెరికా తరఫున స్వయంగా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ప్రత్యేక రాయబారి స్టీట్ విట్ కాఫ్, ప్రెసిడెంట్ ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్లతో కూడిన హై-ప్రొఫైల్ బృందం హాజరైంది. ఇరాన్ తరఫున ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ మహ్మమద్ గాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీలు ఈ చర్చల్లో పాల్గొంటున్నారు.ఈ అంతర్జాతీయ శాంతి చర్చల్లో పాకిస్తాన్, ఖతార్ దేశాల ప్రతినిధులు కీలక మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారు. స్విట్జర్లాండ్‌లో ప్రధాన చర్చలు ప్రారంభం కావడానికి ముందే అమెరికా, ఇరాన్ బృందాలు పాకిస్తాన్ డెలిగేషన్స్తో ప్రత్యేకంగా సమావేశమయ్యాయి. పాక్ ప్రధానమంత్రి, ఆ దేశ ఆర్మీ చీఫ్‌లతో ఇరుదేశాల ప్రతినిధులు భేటీ అయి ప్రాంతీయ భద్రతా అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. లెబనాన్‌లో రోజురోజుకూ క్షీణిస్తున్న రక్షణ వ్యవస్థ, మిడిల్ ఈస్ట్‌లో మిస్సైళ్ల మోతను ఆపడం వంటి అంశాలపై ఈ కూటమి ఒత్తిడి తెస్తోంది.ఒకవేళ ఈ చర్చలు సఫలమై, ప్రాథమిక ఒప్పందంలోని షరతులకు ఇరుదేశాలు పూర్తిస్థాయిలో కట్టుబడి ఉంటే పశ్చిమాసియాలో శాంతి నెలకొనే అవకాశం ఉంది. అలా కాకుండా చర్చలు విఫలమైతే మాత్రం మిడిల్ ఈస్ట్ మళ్లీ బాంబుల వర్షంతో దద్దరిల్లడం ఖాయంగా కనిపిస్తోంది.