
Rating: 2.5 --సూర్య ప్రకాష్ జోశ్యుల "లోకంలో ప్రేమించిన ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకుంటాడు. కొందరు తాము ప్రేమించిన వాళ్లని చేసుకుంటే... మిగిలిన వాళ్లు మాత్రం, ఎవరో ప్రేమించిన వాళ్లని చేసుకుంటారు.!
"ఇది రెగ్యులర్ గా జరిగే వ్యవహారం. అయితే పెళ్లిని దూరం పెట్టి పదహారు సంవత్సరాలుగా లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న జంట కథ. వాళ్లే కునాల్ (షాహిద్ కపూర్), దియా (రష్మిక మందన్న). వీళ్లు ప్రేమను నమ్మారు కానీ పెళ్లిని మాత్రం నమ్మకుండా తమకు నచ్చినట్లు కాలక్షేపం చేస్తున్నారు. అయితే ఇలాంటి కాలక్షేపం చుట్టాలకు, స్నేహితులకు చాలా మందికి నచ్చదు. వాళ్లు పెళ్లి చేసుకోండి.ఎంతకాలం ఇలా ప్రెజర్ పెడుతూంటారు. ఈ క్రమంలో వీటికి దూరంగా ఇటలీలోని సిసిలీకి వెకేషన్‌కు వెళ్తారు. అక్కడే కథ మలుపు తిరిగింది. సీన్ లోకి మందు బాటిల్ ఎంటరైంది. ఒకరోజు కునాల్ ఫుల్‌గా లోడ్ అయ్యి, మగాళ్లకు ఉండే అతివిశ్వాసంతో—"నేనే గనుక నిన్ను మోసం చేస్తే.. ఆ విషయం కనిపెట్టడం నీ తరం కాదు బేబీ" అంటూ ఓ రేంజ్లో డైలాగ్ కొట్టాడు. అది డైలాగుతో ఆగలేదు., అంతటితో ఆ టాపిక్ క్లోజ్ అవ్వలేదు. దియా లోపల డౌట్ మీటర్ ఆన్ అయిపోయేలా చేసింది. దాంతో కునాల్ తనను నిజంగా ప్రేమిస్తున్నాడా? లేక ఇన్నేళ్లుగా అలవాటైపోయాడా? అనే ప్రశ్న ఒక్కసారిగా ఆమెను పట్టుకుని లూప్ లా మైండ్ లో తిరగటం మొదలైంది. ఇలాంటప్పుడు సాధారణంగా మనలాంటి వాళ్లు అయితే తాడో,పేడో తేల్చుకోవాలన్నట్లు విషయం నేరుగా అడిగేవాడు. కానీ సినిమా హీరోయిన్లు అలా చేయరు. అందుకే దియా ఒక అద్భుతమైన ప్రణాళిక వేస్తుంది కట్ చేస్తే... సిసిలీలో వీరికి దియా పాత కాలేజ్ ఫ్రెండ్ అలీ (కృతి సనన్) తారసపడుతుంది.జీవితాన్ని చాలా సీరియస్‌గా తీసుకోకూడదని నిర్ణయించుకుని, ఆ నిర్ణయాన్ని కూడా సీరియస్‌గా తీసుకోని అమ్మాయి అలీ. సర్లే ఖాళీగా ఉన్న ఫ్రెండ్ దొరికింది కదా అని, దియా తన మొగుడి క్యారెక్టర్ని చెక్ చేయడానికి ఒక 'స్మార్ట్' ఐడియా వేసింది. "నువ్వు నా బాయ్‌ఫ్రెండ్‌కు లైన్ వేయి... ఎంత దూరం వెళ్తాడో చూద్దాం" అని అలీకి ఓ సీక్రెట్ టాస్క్ ఇచ్చింది. ఇక్కడ ఎన్నో సినిమాలు చూసిన మీరు ఎక్సపెక్ట్ చేసిందే జరుగుతుంది. అసలే కుర్రాడు... ఆపై పక్కన గ్లామరస్ ఫ్రెండ్ ఫ్రీగా ఫ్లర్ట్ చేస్తుంటే ఊరుకుంటాడా? టైమ్‌పాస్ కోసం మొదలైన ఈ 'టెస్టింగ్' కాస్తా ట్రాక్ తప్పి, అలీ నిజంగానే కునాల్‌తో సీరియస్ లవ్‌లో పడిపోయింది. ఇటు కునాల్ కూడా లాయల్టీని గాల్లో కలిపేసి లైన్ దాటేశాడు. సరే కథ కాక ఎక్కాలిగా... ఇప్పుడు దియా యాక్టివ్ అయ్యింది. ఇన్నేళ్లు పెళ్లి వద్దన్న ఆమె అకస్మాత్తుగా ఉంగరం తీసి పెళ్లి ప్రపోజల్ తెస్తుంది. కథ డిల్లీకు ప్రయాణించి పెళ్లి పీటలు ఎక్కే పనిలో పడింది. ప్రేమకథల్లో లాజిక్ కోసం వెతకడం, ట్రాఫిక్‌లో పార్కింగ్ కోసం వెతకడం రెండూ ఒకటే. కాబట్టి ఇలా..ఎలా అని అడగొద్దు. ఇక అక్కడి నుంచి కథ ప్రేమ, అసూయ, స్వార్థం, స్వేచ్ఛ, కమిట్మెంట్ అనే పెద్ద పెద్ద పదాల చుట్టూ తిరుగుతుంది. ఎవరు ఎవరిని ప్రేమిస్తున్నారు? ఎవరు ఎవరిని పరీక్షిస్తున్నారు? ఎవరు ఎవరిని మోసం చేస్తున్నారు? అనే ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ సినిమా ముందుకు సాగుతుంది. మీకూ ఆ సమాధానాలు కావాలంటే సినిమా చూసేయటమే. విశ్లేషణ మామూలుగా మనం సినిమాల్లో చాలా అబద్ధాలను నమ్ముతాం. ఒక వ్యక్తి వందమందిని కొట్టినా నమ్ముతాం. హీరో పాట మొదలుపెడితే స్విట్జర్లాండ్‌లో దిగినా నమ్ముతాం. టైమ్ ట్రావెల్, జాంబీలు, సూపర్ హీరోలు వచ్చినా అంగీకరిస్తాం. కానీ ఒక విషయం మాత్రం మాత్రం డైజస్ట్ కాదు. అదే పాత్రలు తెలివిగా ఉండాల్సిన చోట మూర్ఖంగా ప్రవర్తించడం. 'కాక్టెయిల్ 2' సమస్య కూడా అదే. నాకు అర్దమైన మేరకు...రచయిత ఒక ప్రేమకథ రాయాలనుకున్నాడు. ప్రేమలోని కన్ఫ్యూజన్ను చూపించాలనుకున్నాడు.. కానీ ఇందుకోసం ఒక కృత్రిమ కాంప్లిక్ట్ (ప్రేమ పరీక్ష)ను సృష్టించాడు. ఆ పరీక్షే చివరికి మొత్తం కథను మింగేసింది. దాంతో సెకండాఫ్ మొత్తం మూడు పాత్రలు మధ్య జరిగే ఓ మెలోడ్రామాలా మారిపోయింది. గమనిస్తే ఈ కథలో Conflict పాత్రల నుంచి, సంఘటనల నుంచి పుట్టలేదు... రచయితే చొరవ తీసుకుని తీసుకొచ్చాడు. కథలో ... దియా కునాల్ (హీరో)ను అనుమానిస్తుంది. అది కామన్ గా జరిగే విషయమే కాబట్టి నో కంప్లైంట్స్. కానీ ఆ అనుమానాన్ని పరిష్కరించడానికి ఆమె ఎంచుకున్న మార్గం అసలు పాత్రకు సరిపోలేదు. పదహారు సంవత్సరాలుగా కలిసి ఉన్న అమ్మాయి... సమస్య వచ్చినప్పుడు తన ప్రేమికుడితో మాట్లాడి సెటిల్ చేసుకునే ప్రయత్నం చేసుకోకుండా... పదేళ్లుగా కలవని ఫ్రెండ్‌ను పిలిచి... "వాడిని ట్రాప్ చేయి" అనటం కన్వీన్సింగ్ గా అనిపించదు. ఇది పాత్ర తీసుకునే నిర్ణయం కాదు. కేవలం కథ ముందుకు వెళ్లడానికి రచయిత తీసుకున్న నిర్ణయం. అక్కడినుంచే సినిమా కృత్రిమంగా అనిపించడం మొదలైంది. కథ పండాలంటే... ప్రేక్షకుడు "ఇలా జరగొచ్చు" అని నమ్మాలి. అంతేకానీ "ఇద్దరూ కూర్చొని మాట్లాడుకుంటే సరిపోయే సమస్య కాదా ఇది?" అని...సినిమా చూస్తూ అనిపించిందంటే స్క్రీన్‌ప్లే ఓడిపోయినట్టే. పోనీ దర్శకుడు Triangle Love చూపెడదామనుకున్నాడు అనుకున్నా...అది అలా అనిపించదు.. అలాంటి లవ్ స్టోరీలలో ముగ్గురికీ సమానమైన ఎమోషన్ స్ట్రాంగ్ గా ఉంటుంది. ప్రతి పాత్రకు తనదైన న్యాయం ఉంటుంది. దియా ఆట మొదలుపెడుతుంది. అలీ ఆ ఆటలో పాల్గొంటుంది. కునాల్‌కు ఆట జరుగుతోందనే విషయం కూడా తెలియదు. ఇలాంటప్పుడు మనం ఎవరి పక్షాన నిలబడాలో అర్థం కాదు. సినిమా అంతా అయ్యాక చివరి పది నిమిషాల్లో ప్రేమ అంటే నమ్మకం అని తేల్చేస్తారు. అబ్బా..మాకు తెలియదు మరి అనుకుంటూ మనం బయిటకు వస్తాం. ఫైనల్ థాట్ జెన్-జీ ప్రేమ కథ అనుకుని తీసిన ఈ సినిమా, చివరికి ప్రేమకథ కంటే "ట్రస్ట్ ఇష్యూస్ వర్క్‌షాప్"లా మారిపోయింది.ఈ సినిమా చెసాక మనకు అర్దమయ్యే నీతి ఒక్కటే...ప్రేమను కాపాడుకోవడం కష్టం కాదు. ప్రేమను "టెస్ట్" చేయాలనే ఐడియా రాకుండా చూసుకోవడమే కష్టం! లేదంటే ప్రేమ కథ ముదిరి... సైకాలజీ ప్రాజెక్ట్‌గా ముగిసే ప్రమాదం ఉంది.