హై-స్పీడ్ ట్రైన్ కలలను నిజం చేస్తూ.. దేశవ్యాప్త రైల్వే నెట్‌వర్క్‌ను ఆధునీకరించే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది.
దేశంలోని ప్రధాన నగరాలను అనుసంధానిస్తూ కొత్తగా ఏడు బుల్లెట్ రైలు కారిడార్ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ మెగా ప్రాజెక్టుల వివరాలను వెల్లడించారు. ఈ ప్రతిపాదిత హై-స్పీడ్ రైలు మార్గాలు అందుబాటులోకి వస్తే.. దేశంలోని ప్రముఖ ఆర్థిక, పారిశ్రామిక, టెక్నాలజీ, టూరిజం హబ్‌ల మధ్య ప్రయాణ సమయం ఊహించని విధంగా గణనీయంగా తగ్గిపోనుంది.ఈ భారీ ప్రాజెక్టు ద్వారా తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం పెద్ద పీట వేసింది. ఐటీ హబ్‌లుగా వెలుగొందుతున్న బెంగళూరు-హైదరాబాద్ మధ్య ప్రయాణ సమయాన్ని కేవలం 2 గంటల 10 నిమిషాలకు, అలాగే పుణె-హైదరాబాద్ మధ్య సమయాన్ని 2 గంటల 8 నిమిషాలకు తగ్గించేలా కారిడార్లను ఖరారు చేశారు. వీటితో పాటు ముంబై-అహ్మదాబాద్ 1 గంట 57 నిమిషాలు, ముంబై-పుణె 48 నిమిషాలు, బెంగళూరు-చెన్నై 73 నిమిషాలు, ఢిల్లీ-లక్నో 2 గంటలు, ఢిల్లీ-వారణాసి 3 గంటల 15 నిమిషాలు, ఢిల్లీ-సిలిగురి 6 గంటలు మార్గాలను కేంద్రం సిద్ధం చేస్తోంది. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టులు ప్రతిపాదన దశలో ఉన్నాయని.. సమగ్ర అధ్యయనం, భూసేకరణ, అనుమతులు, నిధుల కేటాయింపులు పూర్తయిన తర్వాత కన్స్ట్రక్షన్ టైమ్‌లైన్ ప్రకటిస్తామని మంత్రి స్పష్టం చేశారు.మరోవైపు.. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా జపాన్ సాంకేతిక, ఆర్థిక సహాయంతో షింకన్సెన్ వ్యవస్థ ఆధారంగా నిర్మిస్తున్న తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ ముంబై-అహ్మదాబాద్ కారిడార్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఫస్ట్ సెక్షన్ సేవలను వచ్చే ఏడాది నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రైల్వే శాఖ శ్రమిస్తోందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. దీనితో పాటు ఢిల్లీ-వారణాసి-పాట్నా బుల్లెట్ రైలు కారిడార్‌కు కూడా ఆమోదం లభించిందని ఇది పూర్తయితే పాట్నా నుండి ఢిల్లీకి కేవలం 4 గంటల 41 నిమిషాల్లోనే చేరుకోవచ్చునని భవిష్యత్తులో ఈ లైన్‌ను సిలిగురి వరకు పొడిగిస్తామని వివరించారు. బుల్లెట్ రైళ్లతో పాటు సాధారణ రైల్వే నెట్వర్క్ ఆధునీకరణపై కూడా కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా బిహార్ రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనపై మంత్రి ప్రత్యేకంగా మాట్లాడారు. బిహార్ సీఎం సామ్రాట్ చౌదరితో కలిసి ఛాప్రా జంక్షన్ - ఆనంద్ విహార్ టెర్మినల్ మధ్య కొత్త వారపు రైలును అలాగే మౌ జంక్షన్-ఢిల్లీ, జహీర్ఘాట్-వారణాసి మధ్య మరో రెండు రైళ్లను ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. రాబోయే ఏడు నుండి ఎనిమిది సంవత్సరాలలో బిహార్‌కు 200 కంటే ఎక్కువ కొత్త రైళ్లను కేటాయించనున్నట్లు మంత్రి ప్రకటించారు. త్వరలోనే హైదరాబాద్ నుంచి పుణె, చెన్నై, బెంగళూరుకు ట్రైన్ కారిడార్ల పనులు ప్రారంభిస్తామని చెప్పారు.