
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
International Yoga Day 2026: యుగయుగాల నుంచి భారతదేశానికి వస్తున్న గొప్ప వారసత్వ సంపద యోగా. ఆనాదిగా వస్తున్న ఈ అద్భుతమైన యోగను పెద్దవారే కాకుండా యువత కూడా చేస్తుండడం విశేషం. కేవలం వృద్ధులు, పెద్ద మనుషులు యోగా చేస్తారనే అవవాదును నేటి యువత చెరిపేస్తోంది. నేటి తరం జెన్‌జీ సోషల్ మీడియా నుంచి యోగా మ్యాట్ వరకు అడుగులు వేస్తుండడం విశేషం. నేటి యోగా దినోత్సవం సందర్భంగా జెన్‌జీ తరంలో వచ్చిన మార్పును పరిశీలిద్దాం.
ప్రపంచ యోగా దినోత్సవం ప్రతియేటా జూన్ 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తుంటారు. యోగా అనేది వృద్ధులకు లేదా ఆధ్యాత్మికతపై ఆసక్తి ఉన్నవారికి మాత్రమే పరిమితం అనే అభిప్రాయం ఉండేది. కానీ ఆ అభిప్రాయాన్ని నేటి కొత్త యువత చెరిపేస్తోంది. స్మార్ట్ఫోన్లతో పెరిగిన జెన్‌జీ తరం కూడా యోగాను పాటిస్తుండడం విశేషం. యోగా చేయడాన్ని జెన్‌జీ యువత వేగంగా నేర్చుకుంటోంది. యోగా కోసం ప్రత్యేకంగా సోషల్ మీడియాను వినియోగిస్తోంది. యోగా యాప్‌లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, డిజిటల్ కంటెంట్ క్రియేటర్లు, ఏఐ-ఆధారిత వెల్నెస్ ప్లాట్‌ఫారమ్‌లు జెన్‌జీ తరం వినియోగిస్తోంది.
ఆరోగ్యకరమైన జీవనశైలిని జెన్‌జీ యువత కోరుతూ మానసిక ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలో కొత్త తరం యోగాను నిరంతరం చేస్తోంది. ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ కంటెంట్‌లో రోజూ యోగా వీడియోలు, ఫిట్నెస్ ఛాలెంజ్‌లు ఉంటున్నాయి. దీని ద్వారా నేటి యువత యోగా వైపు దృష్టి సారిస్తోంది. యోగా సాధన స్టూడియోలకే పరిమితం కాలేదు. మొబైల్ యాప్‌లు వ్యక్తిగత లక్ష్యాల ఆధారంగా యోగా ప్రణాళికలు, రోజువారీ రిమైండర్లు, పురోగతి మదింపులను అందిస్తాయి. కొన్ని యాప్‌లు వినియోగదారుడి ఆరోగ్య డేటాను విశ్లేషించి, వ్యక్తిగతీకరించిన సిఫార్సులను కూడా అందిస్తాయి.
ఏఐ ఆధారిత వెల్నెస్ ప్లాట్‌ఫారమ్‌లు యోగా సాధనకు కొత్త రూపాన్ని ఇస్తున్నాయి. నిద్ర నాణ్యత, ఒత్తిడి స్థాయి, హృదయ స్పందన రేటు, శారీరక శ్రమ ఆధారంగా వ్యవస్థలు యోగా, ధ్యాన కార్యక్రమాలను చేస్తున్నాయి. సోషల్ మీడియా యోగా ఇన్ఫ్లుయెన్సర్లు, డిజిటల్ క్రియేటర్లు యోగాపై యువతను ప్రభావితం చేస్తున్నారు. సాంప్రదాయ యోగాను ఆధునిక జీవనశైలికి అనుగుణంగా ఉండేలా ప్రదర్శించడం వారి ప్రత్యేకత. కేవలం కొన్ని నిమిషాల నిడివి గల వీడియోలతో వారు యోగాను మరింత సరళంగా, ఆకర్షణీయంగా చేయగలుగుతున్నారు.
విద్యా సంస్థలు, కార్పొరేట్ రంగంలో వెల్నెస్ కార్యక్రమాలలో యోగా ప్రాధాన్యం పెరిగింది. దీంతో ఈ యజ్ఞంలో యువత భాగస్వామ్యం రోజురోజుకు పెరుగుతోంది. కంప్యూటర్ ముందు కూర్చోవడంతోపాటు మొబైల్ ఫోన్ వినియోగంతో స్క్రీన్ సమయం పెరగడం, నిద్రలేమి, మానసిక ఒత్తిడి వంటి సవాళ్లను నేటి యువత ఎదుర్కొంటోంది. ఈ సమస్యలన్నింటికీ యోగా ఒక ఆచరణాత్మక పరిష్కారంగా యువత భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే యోగాను యువత చేస్తూ ఉపశమనం పొందుతోంది.
సాంకేతికత సహాయంతో యోగాకు రోజురోజుకు ప్రాధాన్యం పెరుగుతుండడం హర్షించే విషయం. మనసుకు, శరీరానికి ప్రశాంతతను అందించడమే యోగా మంత్రంగా పనిచేస్తోంది. ఈ డిజిటల్ యుగంలో జెన్ జీ తరం వారు యోగాను ఒక కొత్త ఆరోగ్య ధోరణిగా స్వీకరించడం ఆహ్వానించదగ్గ పరిణామం.