తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ మొదలుకావడానికి ముందే ఓట్ల తొలగింపు ప్రారంభమైనట్లు సమాచారం. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3.38 కోట్లు కాగా..
ఇప్పటికే 5 లక్షల నకిలీ ఓటర్లను తొలగించినట్లు సమాచారం. దేశంలోని ఒకరికి ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓట్లు నమోదును అడ్డుకోడానికి ఎన్నికల కమిషన్ రూపొందించిన ‘డెమొగ్రఫీ సిమిలర్ ఎంట్రీస్’ సాఫ్ట్వేర్ గుర్తించి తొలగిస్తుంది. ప్రస్తుతం తెలంగాణలోని డూప్లికేట్ ఓట్లను ఈ సాఫ్ట్వేర్ ద్వారా గుర్తించి తొలగించినట్లు భోగట్టా. అదే విధంగా ఈ జాబితాలో రెండు చోట్ల ఓటు వేసిన వారు కూడా ఉన్నట్లు తెలిసింది.రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమైతే దాదాపు 30 లక్షల మంది ఓటర్లపై ప్రభావం చూపునుందని సమాచారం. ప్రస్తుత ఓటర్లను 2002 నాటి జాబితాతో ర్యాండమ్ మ్యాపింగ్ చేయగా సుమారు 30 లక్షల ఓట్లు వివిధ కారణాలతో తొలగింపునకు గురయయే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనాకు వచ్చారని తెలిసింది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఈ సంఖ్య 15 లక్షల వరకు ఉంటుందని సమాచారం. అధికారులు చేపట్టిన మ్యాపింగ్లో గ్రేటర్ పరిధిలో చాలా మంది స్థానికంగా లేకపోవడం, ఇతర ప్రాంతాల్లోనూ ఓట్లు ఉండడం వంటి అంశాలను గుర్తించారు. ఇప్పటి వరకూ 70 శాతం మ్యాపింగ్ పూర్తయిందని అధికారులు తెలిపారు. మొత్తం 3.38 కోట్ల మంది ఓట్లలో 2.38 కోట్ల మందిని మ్యాపింగ్ చేపట్టారు. వీటిలో 89 లక్షల ఓటర్లలో 11 రకాల లోపాలను అధికారులు గుర్తించారు. ఎన్యూమరేషన్ పేపర్లు పూర్తిచేసిన తర్వాత వాటిని పరిశీలించి నోటీసులు ఇస్తారు. అవసరమైన ధ్రువపత్రాలను సమర్పిస్తే జాబితాలో పేర్లు కొనసాగుతాయి. లేకుంటే వారి ఓట్లను తొలగిస్తారు.ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) సి. సుదర్శన్ రెడ్డి శనివారం నాడు మాట్లాడుతూ.. ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ ( ఎస్ఐఆర్ ) జూన్ 25న ప్రారంభమవుతుందని, ఆ రోజున ఇంటింటికీ వెళ్లి ఓటరు నమోదు చేసే దశలో బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు) ఫారాలను పంపిణీ చేస్తారని ప్రకటించారు. ఓటరు నమోదు ఫారాలన్నీ జూలై 25లోగా తప్పనిసరిగా సమర్పించాలని, ఈ గడువును పొడిగించబోమని ఆయన స్పష్టం చేశారు. ‘‘అర్హులైన ఏ పౌరుడూ తిరస్కరణకు గురికాకూడదు.. అనర్హులైన ఏ ఓటరు కూడా ఉండకూడదు. ఈ నెల రోజుల నమోదు ప్రక్రియ చాలా కీలకమైంది.. ఎందుకంటే తమ ఫారాలను సరిగ్గా తిరిగి పంపిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా ఓటర్ల జాబితాలో ఉంటాయి’’ అని ఆయన అన్నారు.