మురాల వెంకటేష్.. ఈ పేరు ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ ఫుడ్ ఆన్ ఫార్మ్ బాబాయ్ అంటే చాలు ఠక్కున గుర్తు పడతారు. యూట్యూబ్ వీడియోల ద్వారా ప్రతి తెలుగు కుటుంబానికి ఆయన చేరువయ్యారు.
గ్రామీణ వాతావరణంలో ఆయన చేసే వంటలు, మాట్లాడే తీరు, హావభావాలు, అనుభవాలను పంచుకునే తీరు అందరికీ నచ్చుతాయి. అయితే ఆయన ఈ స్థాయికి చేరడానికి ముందు ఎంతో కష్టపడ్డారు. తన జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులు, యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించడానికి కారణాలను ‘రా టాక్స్ విత్ వీకే’ యూట్యూబ్ ఛానెల్‌తో ఆయన పంచుకున్నారు. ఈ విశేషాలు మీకోసం..‘‘మాది తెనాలి దగ్గర్లోని కొల్లూరు మా ఊరు. చిన్నతనం నుంచి ఎంతో కష్టపడి పెరిగాను. వంట చేసుకొని, క్యారేజీ కట్టుకొని స్కూల్‌కు వెళ్లేవాణ్ని. ఇంటి పనులు, పొలం పనుల్లో అమ్మకు సాయం చేసేవాణ్ని. స్కూల్ చదువు అయిపోయాక.. బయటకు వెళ్లాలనిపించింది. 18 ఏళ్ల వయసులో విశాఖపట్నంలోని మా మేనమామ దగ్గరకు వెళ్లి.. ఆయన సాయంతో హోటల్ దసపల్లాలో పనికి కుదిరాను. అక్కడి వంట మాస్టర్ (చెఫ్) నాకు వంటలో మెలకువలు నేర్పించారు.ఆ తర్వాత బయటకు వచ్చి తెనాలిలోని నవయుగ హోటల్లో వంట మాస్టర్‌గా చేరాను. కర్నూల్లో కొత్త హోటల్ పెడుతున్నాం. మాకు వంట మాస్టర్ కావాలని కొందరు తెనాలి వచ్చారు. మా హోటల్ వాళ్లు నన్ను కర్నూల్ పంపించారు. అక్కడ ఉండగానే నాకు స్నేహితుల ద్వారా పెళ్లి సంబంధం వచ్చింది. మహానందిలో నా పెళ్లి జరిగింది. మాకు సాయితేజ, శబరినాథ్ అని ఇద్దరు పిల్లలు ఉన్నారు. నేను భక్తి పాటలు బాగా పాడేవాణ్ని. దీంతో ఆలయాల వద్ద పాటలు పాడటానికి తీసుకెళ్లేవారు. కర్నూల్లో హోటల్లో కొన్నాళ్లు పని చేశాక కొంత కాలం రాయచూర్‌లో ఆ తర్వాత విజయనగరంలో హోటల్ నడిపాను. విజయనగరంలో చిన్న ఇల్లు కట్టుకున్నాను.మా అబ్బాయి సాయి తేజ ఫొటోగ్రఫీ చేశాడు. హైదరాబాద్‌లో పని చేసేవాడు. కరోనా సమయంలో అతడి ప్రోగ్రాంలు క్యాన్సిల్ అయ్యాయి. మా హోటల్ వ్యాపారం కూడా సాగేది కాదు. అప్పుడు మా అబ్బాయి హైదరాబాద్ నుంచి వచ్చేసి.. ‘నాన్నా నేను వీడియోలు తీస్తాను, నువ్వు వంట చేసి చూపించు.. ఓ యూట్యూబ్ ఛానెల్ పెడదాం’ అని పట్టుబట్టాడు. రెండు రోజుల్లోనే ఆలంపూర్ దగ్గర ఒక లొకేషన్‌ను కూడా సెట్ చేశాడు. అక్కడే వంద వీడియోలు చేశాం.కొత్తలో ఒక వారం రోజులపాటు ‘హాయ్ అందరికీ నమస్తే’ అంటూ ప్రాక్టీస్ చేసేవాణ్ని. నా కొడుక్కి నచ్చేంత వచ్చే వరకు ప్రాక్టీస్ చేయించాడు. యూట్యూబ్‌లో చూసి అన్నీ నేర్చుకున్నాడు. అతడి పట్టుదల వల్లే ఈ రోజు ఇలా ఉన్నాం. నా కొడుకు ఐడియా మా జీవితాలను మార్చేసింది. స్టార్టింగ్‌లో వ్యూస్ వచ్చేవి కాదు. దీంతో నిరాశ చెందాను. టిఫిన్ సెంటర్ నడుపుతూనే వీడియోలు చేసేవాణ్ని. ఓ దశలో నేను వీడియోలు చేయలేనంటే.. సంవత్సరం వరకు వీడియోలు చేయాల్సిందేనని మా అబ్బాయి మొండికేశాడు. ఈ ఒక్క వీడియో, ఈ ఒక్క వీడియో అంటూ లాక్కెళ్లేవాడు.ఒక రోజు అర్ధరాత్రి నిద్ర లేపి.. రాగి ముద్ద నాటు కోడి వీడియో బాగా క్లిక్ అయ్యిందని చూపించాడు. తెల్లారేసరికి మా యూట్యూబ్ ఛానెల్‌కు సబ్స్క్రైబర్స్, వ్యూస్ పెరిగాయి. ఇప్పుడు సాధించిన సక్సెస్‌ను ఆ రోజే మా అబ్బాయి నాకు ఊహించి చెప్పాడు. అప్పటి నుంచి మా అబ్బాయి ఏదైనా ఐడియా ప్లాన్ చేస్తే.. అలాగే జరిగింది. మా అబ్బాయిలిద్దరూ చర్చించుకుంటే.. వాళ్లను మేం ఫాలో అయ్యేవాళ్లం. నా పిల్లలు మా కష్టాలను చూశారు. ఆ కష్టాల నుంచి మమ్మల్ని ఒడ్డు ఎక్కించడానికి ప్రయత్నించారు. తల్లిదండ్రుల కష్టాలను చూసి పెరిగిన పిల్లలు రాంగ్ స్టెప్ వేయరు.మా పెద్దబ్బాయి జాబ్ కోసం కొంచెం దూరం వెళ్లాడు. నాకు ఏదైనా సంతోషం వచ్చినా, బాధ కలిగినా నా చిన్న కొడుకుతోనే చెప్పేవాణ్ని. పిల్లలు మంచి ఆలోచనతో ఒక అడుగు వేసినప్పుడు వాళ్లను డిజప్పాయింట్ చేయకూడదు, వెనక్కి లాగకూడదు. వాళ్లకు పుషింగ్ ఇవ్వాలి. నా పిల్లలకు నేను ఏదీ వద్దని చెప్పను.నా కొడుకు ఐదేళ్ల వయసు ఉన్నప్పుడు కర్నూలు సాయిబాబా గుడిలోని పూజారితో వాడి జాతకం రాయించాను. నా కొడుకులు పెరిగి పెద్దయ్యే కొద్దీ నా జీవితం బాగుంటుందని పూజారి చెప్పారు. నా విషయంలో ఆయన చెప్పినట్టుగానే జరిగింది.ప్రస్తుతం నేను మా సొంతూరు కొల్లూరులోనే ఉంటున్నాను. ఊరి నుంచి 3 కి. మీ. దూరంలో మా ఫామ్ హౌస్ ఉంది. నా ఆలోచనలకు తగ్గట్టుగానే నా కొడుకు ఫామ్ హౌస్ ఏర్పాటు చేశాడు. మా ఫామ్ హౌస్ విస్తీర్ణం ఎకరంన్నరకు కొంచెం తక్కువ ఉంటుంది. వాస్తవానికి అది మా తమ్ముడి పొలం. దాన్ని లీజ్‌కు తీసుకున్నాం.సూపర్ స్టార్ కృష్ణ సొంతూరు బుర్రిపాలెం మా ఊరికి 3 కి. మీ. దూరంలో ఉంటుంది. చిన్నప్పటి నుంచి నేను సూపర్ స్టార్ కృష్ణకు వీరాభిమానిని. మహేశ్ బాబు, చిరంజీవి అంటే కూడా నాకు ఇష్టం. చిన్నప్పుడు తెనాలికి సైకిల్ మీద వచ్చి స్నేహితులతో కలిసి సినిమాలు చూసే వాణ్ని’’ అని ఫడ్ ఆన్ ఫామ్ బాబాయ్ తన అనుభవాలను పంచుకున్నారు.