దేశవ్యాప్తంగా నీట్ రీ ఎగ్జామ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. పేపర్ లీకేజీ కారణంగా నీట్ పరీక్షను రద్దు చేసిన ఎన్టీఏ.. ఆదివారం రీటెస్టు నిర్వహిస్తోంది.
మొన్నటి అనుభవాల నేపథ్యంలో నీట్ రీ ఎగ్జామ్ కోసం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. మరోవైపు నీట్ రీ ఎగ్జామ్ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన పని ఇప్పుడు నెటిజన్ల నుంచి ప్రశంసలు కురిపిస్తోంది. నీట్ పరీక్ష రాసే విద్యార్థులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ప్రయాణాన్ని కాసేపు వాయిదా వేసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పర్యటించిన సంగతి తెలిసిందే. అక్కడి పర్యటన పూర్తి చేసుకున్న ప్రధాని.. ఆదివారం మధ్యాహ్నానికి ఢిల్లీ ఎయిర్ పోర్టు చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి అధికారిక నివాసానికి బయల్దేరేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆదివారం మధ్యాహ్నం నుంచి నీట్ పరీక్ష జరుగుతోంది. తన ప్రయాణం కారణంగా పోలీసులు రహదారిపై ఆంక్షలు విధిస్తే.. నీట్ పరీక్ష రాసే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడతారనే విషయాన్ని గుర్తించిన ప్రధాని మోదీ.. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా తన ప్రయాణాన్ని కాసేపు వాయిదా వేసుకున్నారు. ఈ విషయాన్ని అధికార వర్గాలు వెల్లడించాయి.మరోవైపు నీట్ పరీక్ష ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒంటి గంటా 15 నిమిషాలకు మోదీ బెంగాల్ పర్యటన పూర్తి చేసుకుని ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ప్రధానమంత్రి వెంటనే ఎయిర్ పోర్టు నుంచి అధికారిక నివాసానికి బయల్దేరాలి. అయితే నీట్ పరీక్ష నేపథ్యంలో తన ప్రయాణాన్ని కొద్ది సేపు వాయిదా వేసుకున్నారు మోదీ. ఢిల్లీలో ట్రాఫిక్ జామ్ కలగకుండా.. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా.. నీట్ పరీక్ష రాసే విద్యార్థులకు అంతరాయం కలగకుండా మోదీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. నీట్ పరీక్ష ప్రారంభమైన తర్వాత ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి మోదీ తన అధికారిక నివాసానికి బయల్దేరి వెళ్లారు. నీట్ రీటెస్టుకు దేశవ్యాప్తంగా 22 లక్షల మందికిపైగా విద్యార్థులు హాజరవుతున్నారు. పరీక్ష కోసం దేశవ్యాప్తంగా 5,440 పరీక్షా కేంద్రాలు, విదేశాల్లో 14 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1.38 లక్షల సీసీటీవీ కెమెరాలను ఉపయోగించి.. 95 వేలపరీక్షా గదులను పర్యవేక్షిస్తున్నారు. ఎలక్ట్రానిక్ పద్ధతిలో మోసాలు జరగకుండా.. పరీక్షా కేంద్రాల వద్ద 51 వేల సిగ్నల్ జామర్లు ఏర్పాటు చేశారు.