సోషల్ మీడియాలో తెలియని వాళ్ల నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు వస్తే వాటిని యాక్సెప్ట్ చేయవద్దని ఎన్నిసార్లు చెప్పినా కొంతమంది మాత్రం వినడం లేదు. దీంతో అనవసర విషయాల్లో వేలు పెట్టి.. మోసపోతున్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో తెలియని వ్యక్తి నుంచి వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు ఇద్దరు యువతులను ఆర్థికంగా మోసపోయేలా చేశాయి. ఓ వ్యక్తి.. ఫేక్ అకౌంట్‌తో వారికి ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపించి.. వారి వద్ద నుంచి భారీగా డబ్బులు, నగలు కాజేయగా.. మోసపోయామని గ్రహించి.. వారు ఫిర్యాదు చేయడంతో.. ఈ ఘటన బయటికి వచ్చింది. వారిద్దరి నుంచి మొత్తం రూ.12 లక్షలు మోసం చేసినట్లు తెలిపారు. మెదక్ జిల్లా టేక్మాల్ మండలం ఎల్లంపల్లి గ్రామానికి చెందిన కొండి స్వాతికి ఒక సంవత్సరం క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో Ritwik Reddy అనే ఐడీ నుంచి ఫాలో రిక్వెస్ట్ వచ్చింది. దాన్ని ఆమె యాక్సెప్ట్ చేయగా.. క్రమంగా వారి మధ్య పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఆమెను ప్రేమిస్తున్నానని, పెళ్లి కూడా చేసుకుంటానని అతడు నమ్మించాడు. ఈ నేపథ్యంలోనే తాను ఐపీఎస్ ట్రైనింగ్ కోసం ఛత్తీస్గడ్ వెళ్తున్నానని స్వాతికి చెప్పాడు. ఐపీఎస్ ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. కొన్ని రోజుల తర్వాత.. స్వాతికి ఫోన్ చేసిన ఆ కేటుగాడు.. తనకు అత్యవసరంగా డబ్బులు కావాలని అడిగాడు. తన ఫ్రెండ్ ఉప్పరి దుర్గేశ్ వస్తాడని.. అతడికి డబ్బులు ఇవ్వాలని ఆమెకు చెప్పాడు. అయితే అతడి మాటలు విన్న బాధితురాలు.. దశల వారీగా నగదు రూపంలో.. ఫోన్ పే ద్వారా మొత్తం రూ.5 లక్షలు ఇచ్చేసింది. వాటితోపాటు తన వద్ద ఉన్న బంగారు చెవి కమ్మలు కూడా ఉప్పరి దుర్గేశ్‌కి ఇచ్చేసింది. వాటి బరువు తులం ఉంటుందని బాధితురాలు తెలిపింది. అయితే డబ్బులు, బంగారం తీసుకుని వెళ్లిన తర్వాత అతడి నుంచి ఎలాంటి ఫోన్లు, మెసేజ్ రాలేదు. అలాగే వేచి చూసిన స్వాతి.. ఈ ఘటన జరిగి సంవత్సరం దాటడంతో ఆమెకు మోసపోయినట్లు అనుమానం వచ్చింది. ఈ క్రమంలోనే అతడు డబ్బుల కోసమే ఇలా చేశాడా అని అనుమానించిన స్వాతి.. తనలాగే ఇంకా ఎవరినైనా మోసం చేశాడా అని ఆరా తీయడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. టేక్మాల్ మండలం ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన 17 ఏళ్ల మరో యువతి కూడా ఇలాగే మోసపోయినట్లు తెలిసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 'Sathwik Reddy' అనే పేరుతో నకిలీ ఐడీ నుంచి ఆమెకు రిక్వెస్ట్ వచ్చింది. తాను ఎంబీబీఎస్ స్టూడెంట్ అని పరిచయం చేసుకున్న ఆ కేటుగాడు.. ఆమెకు డైమండ్ రింగ్ పంపిస్తున్నానని నమ్మించాడు. అయితే.. దాని కోసం టాక్స్ కట్టాలని పేర్కొన్నాడు. తన ఫ్రెండ్ దుర్గేశ్ వస్తాడని చెప్పి.. ఆమె వద్ద కూడా రూ.7 లక్షల నగదుతోపాటు.. ఒక తులం గోల్డ్ రింగ్ దుర్గేశ్ వసూలు చేశాడు. ఈ రెండు ఘటనల్లో ఉప్పరి దుర్గేశ్ కీలక పాత్ర పోషించినట్లు తేలింది. ఉప్పరి దుర్గేశే.. ఇన్‌స్టాగ్రామ్‌లో 'Ritwik Reddy', 'Sathwik Reddy' వంటి పేర్లతో ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి.. మోసాలు చేసినట్లు వెల్లడైంది. తాను పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నట్లుగా యువతులను నమ్మించి.. వారిని పెళ్లి చేసుకుంటానని చెప్పి.. ఇద్దరు యువతులను మోసం చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. బాధితుల ఫిర్యాదులతో కేసు నమోదు చేసుకున్న టేక్మాల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.