దగ్గుబాటి వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. VenkyAnil5 - NKRAR2 వర్కింగ్ టైటిల్స్ తో ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. వచ్చే సంక్రాంతి పండక్కు సినిమాని విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు.
సెట్స్ మీదకు వెళ్లకముందే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన అనిల్.. తాజాగా ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. వెంకీ - అనిల్ రావిపూడి - కళ్యాణ్ రామ్ సినిమాకి ఈరోజు (జూన్ 18) పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సినిమాలో కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారనే వార్తలను నిజం చేస్తూ..
కథానాయికలు ఇద్దరూ ఓపెనింగ్ సెర్మనీలో పాల్గొన్నారు. కె.రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు తదితరులు ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను చిత్ర బృందం సోషల్ మీడియాలో పంచుకుంది.వెంకటేష్, కృతి శెట్టి, కీర్తి సురేష్, కళ్యాణ్ రామ్ లపై ఫస్ట్ షాట్ కి క్లాప్ కొట్టిన నిర్మాత అల్లు అరవింద్..
ఈ చిత్రం రూ.200 కోట్లు కలెక్షన్స్ సాధించాలని శుభాకాంక్షలు తెలియజేశారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించగా.. సురేష్ బాబు కెమెరా స్విచాన్ చేశారు. దిల్ రాజు స్క్రిప్ట్ అందించి టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
వెంకీ - కళ్యాణ్ రామ్ లు ఒకరికొకరు జోడీలను మార్చుకున్నట్లు తొలి షాట్ ను చిత్రీకరించారు.ఇందులో వెంకటేష్ కు జోడీగా కీర్తి సురేష్, కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి నటిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు.
లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ పాటలు రాస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ కూడా నిర్మాణంలో భాగం
పంచుకుంటోంది. 2027 సంక్రాంతి లక్ష్యంగా శరవేగంగా షూటింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని విషయాలు వెల్లడించనున్నాయి.సీనియర్ హీరో వెంకటేష్ - డైరెక్టర్ అనిల్ రావిపూడిలది హిట్ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’, ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాలు మంచి విజయం సాధించాయి. మరోవైపు కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘పటాస్’తోనే అనిల్ దర్శకుడిగా లాంచ్ అయ్యారు. ఇప్పుడు ఈ ముగ్గురి కాంబోలో రాబోతున్న చిత్రంపై అందరిలో అంచనాలు నెలకొన్నాయి.