బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిగిన యుద్ధంలో భారత సైన్యం ముందు పాకిస్థాన్ తోకముడిచింది. ఇండియన్ నేవీ దెబ్బకు దాయాది మరోసారి బంగాళాఖాతంలోకి కన్నెత్తి చూసే సాహసం చేయలేదు. అయితే, మళ్లీ ఐదున్నర దశాబ్దాల తర్వాత పాక్ కన్ను బంగాళాఖాతంపై పడిందా?
ఈ జలాల్లో సబ్మెరైన్లు మోహరించే ప్రయత్నాల్లో ఉందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. పాకిస్థాన్ నౌకాదళానికి చెందిన సీనియర్ అధికారి వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూర్చుతున్నాయి. తన నౌకాదళంలోకి చైనా తయారుచేసిన హంగోర్ శ్రేణి జలాంతర్గాములను చేర్చుకునే ప్రణాళికలను పాకిస్థాన్ వేగవంతం చేసింది.
మొత్తం 8 హంగోర్ శ్రేణి సబ్మెరైన్ల కొనుగోలుకు చైనాతో ఒప్పందం చేసుకోగా.. ఇటీవలే ఒక జలాంతర్గామిని పాక్‌కు అందజేసింది. స్వదేశానికి దానిని తరలిస్తుండగా.. ఎస్కార్ట్‌గా వస్తున్న ఫ్లోటిల్లా నౌక కమాండర్ కమోడోర్ ఒమర్ ఫరూఖీ శ్రీలంకలో మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన ‘‘హంగోర్ శ్రేణి సబ్మెరైన్లతో మా నౌకాదళ సామర్థ్యం అరేబియాను దాటి విస్తరించనుంది. వీటి ద్వారా బంగాళాఖాతంలోనూ మా సైనికశక్తిని విస్తరించే అవకాశం దక్కుతుంది. ఇవి గేమ్‌ఛేంజర్ జలాంతర్గాములు’’ అని వ్యాఖ్యానించారు.
దీంతో ఈ జలాంతర్గాములను బంగాళాఖాతంలో పాకిస్థాన్ మోహరించే ప్రణాళికలో ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తూర్పు తీరంలోని బంగాళాఖాతం భారత్‌కు అత్యంత కీలకమైంది. ఈ తీరంలో భారత్‌తో సహా శ్రీలంక, బంగ్లాదేశ్, మయన్మార్, థాయ్‌లాండ్, ఇండోనేషియా, మలేసియాలు ఉన్నాయి.
తీరం నుంచి 12 నాటికల్ మైళ్ల వరకు ప్రాదేశిక జలాలుగా గుర్తిస్తారు. అలాగే, 200 నాటికల్ మైళ్ల వరకు ప్రత్యేక ఎకనమిక్ జోన్ ఉంటుంది. అది దాటితే అంతర్జాతీయ జలాలే. అంటే, అక్కడ ఏ దేశానికి చెందిన సైనిక నౌకలు, జలాంతర్గాములు స్వేచ్ఛగా సంచరించవచ్చు.
వ్యూహాత్మకంగా భారత్‌కు కీలకమైన ఈ ప్రాంతంలో తూర్పు నావెల్ కమాండ్ ఉంటుంది. విశాఖ కేంద్రంగానే భారత అణు జలాంతర్గాములు రూపొందుతాయి. అంతేకాదు వాటిని నిలిపి ఉంచే ‘ఐఎన్ఎస్ వర్ష’ కూడా ఇక్కడే ఉంది. గతంలో పాకిస్థాన్ ఏజెంట్లను విశాఖలో
అరెస్ట్ చేసిన సందర్భాలూ ఉన్నాయి. అంతేకాదు, కీలకమైన కమ్యూనికేషన్ వ్యవస్థలు కలిగి ఉన్న బంగాళాఖాతం.. బంగ్లా సహా పలు దేశాలతో వాణిజ్యానికి కీలక మార్గం. వాస్తవానికి మన నౌకాదళం శక్తి సామర్థ్యాలతో పోల్చితే పాకిస్థాన్ నేవీ దిగదుడుపే. శక్తిమంతమైన విమాన వాహక నౌకలు, అణు జలాంతర్గాములు భారత్ వద్ద ఉండగా.. ఇలాంటి వాటికోసం చైనా మీదే పాక్ ఆధారపడుతోంది. నేవీ తన సామర్థ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపర్చుకుంటూ అధునాతన ఆయుధాలను సమకూర్చుకుంటోంది. కానీ, దాయాదికి చైనా టైప్054ఏ/ పీ ఫ్రిగేట్లు, తుర్కియే నిర్మిత మిల్జెమ్ కార్వెట్లే దిక్కు. ఈ నేపథ్యంలో కొత్త హంగోర్ శ్రేణి సబ్మెరైన్లను మోహరించి బంగాళాఖాతంలో పరిస్థితులను పాకిస్థాన్ మార్చేసే అవకాశం లేదు. కానీ, బంగాళాఖాతంలో పాక్ సబ్-మెరైన్లు మోహరింపులు ఎప్పటికైనా భారత్‌కు ఇబ్బంది కలిగించేవేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.బంగ్లాకు దగ్గరవడంతోనే..ఇటీవలి కాలంలో పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ల మధ్య స్నేహం బలపడుతోంది. ఇలాంటి తరుణంలో బంగాళాఖాతంపై పాక్ ప్రణాళికలు బయటపడటం ప్రాధాన్యత సంతరించుకుంది. 1971 యుద్ధం తర్వాత పాక్, బంగ్లా మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయిన విషయం తెలిసిందే. కానీ, 2024 జులైలో షేక్ హసీనా నాయకత్వంలోని బంగ్లాదేశ్ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత.. ఆ దేశానికి దగ్గరయ్యేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. ఇరు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం, ద్వైపాక్షిక వాణిజ్యం, సైనిక సహకారం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. కరాచీ, ఛట్టోగ్రామ్ మధ్య నేరుగా సముద్రమార్గంలో తొలిసారి వాణిజ్యం కూడా మొదలైంది. అంతేకాదు, గతేడాది నవంబరులో పాకిస్థాన్ యుద్ధ నౌక పీఎన్ఎస్ సైఫ్ 4 రోజుల పాటు ఛట్టోగ్రామ్ తీరంలో మోహరించడం గమనార్హం.హంగోర్ సబ్‌మెరైన్ ప్రత్యేకత ఏంటి?చైనా అభివృద్ధి చేసిన హంగోర్ జలాంతర్గామిని ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ టెక్నాలజీతో రూపొందించారు. సాధారణ డీజిల్-ఎలక్ట్రికల్ శక్తితో నడిచే వాటితో పోలిస్తే ఇది ఎక్కువకాలం పాటు నీటి లోపల ఉండగలదు. కాబట్టి ఈ సబ్‌మెరైన్‌ను గుర్తించి, ట్రాక్ చేయడం కష్టం. 1971 యుద్ధం తర్వాత పశ్చిమ తీరానికే పరిమితమైన దాయాది. తమ నౌకాదళ సామర్థ్యాన్ని విస్తరించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే అధునాతన వ్యవస్థలను సమీకరించుకుంటోంది. మొత్తంగా 8 హంగోర్ శ్రేణి జలాంతర్గాములను కొనుగోలు చేస్తోంది.1971 యుద్ధంలో ఏం జరిగింది..?బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం సమయంలో పాకిస్థాన్ పీఎన్ఎస్ హంగోర్తో దాడి చేసి ఇండియన్ నేవీకి చెందిన ఐఎన్ఎస్ ఖుక్రీని ముంచేసింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఓ యుద్ధ నౌకను భారత్ కోల్పోవడం అదే మొదటిసారి. అయితే, ఈ సంఘటన యుద్ధం ఫలితాన్ని మాత్రం మార్చలేకపోయింది. అనంతరం విశాఖపట్నం సమీపంలో పాక్‌కు ఎరవేసిన దాని యుద్ధనౌక పీఎన్ఎస్ ఘాజీని భారత్ పేల్చేసింది. భారత సైన్యం శక్తి ముందు నిలవలేక 13 రోజులకే పాకిస్థాన్ కాళ్లబేరానికి వచ్చింది. ఆ యుద్ధం తర్వాత మళ్లీ బంగాళాఖాతంలో పాక్ నేవీ ఉనికే లేదు.