
ఫోన్‌పే యూజర్లకు పంపుతున్న నోటిఫికేషన్ల ప్రకారం, ఒక సంవత్సరం పాటు ఎలాంటి లావాదేవీలు జరగని వాలెట్లను “ఇనాక్టివ్ వాలెట్లు”గా పరిగణిస్తామని తెలిపింది. అలాంటి ఖాతాలపై నిర్వహణ ఛార్జీగా ప్రతి మూడు నెలలకు రూ.100 వరకు వసూలు చేసే అవకాశం ఉందని పేర్కొంది.
కంపెనీ తన నిబంధనలు, షరతుల్లో కూడా ఈ విషయాన్ని చేర్చినట్లు సమాచారం. అయితే ఫీజు ఎంత ఉంటుందనే అంశంపై పూర్తి స్పష్టత ఇవ్వలేదని కొందరు యూజర్లు చెబుతున్నారు. ఫోన్‌పే ప్రకారం, ఛార్జీలు అమలు చేయడానికి ముందు వినియోగదారులకు 15 రోజుల ముందుగానే సమాచారం అందజేస్తారు.
ఈ గడువులోపు వాలెట్‌ను ఉపయోగించి లావాదేవీ చేస్తే అది మళ్లీ యాక్టివ్‌గా మారుతుంది. కేవలం ఫోన్‌పే యాప్‌ను తెరవడం లేదా యూపీఐ ద్వారా చెల్లింపులు చేయడం వల్ల వాలెట్ యాక్టివ్‌గా పరిగణించమని కంపెనీ స్పష్టం చేసింది. వాలెట్ ఫీచర్‌ను ప్రత్యక్షంగా ఉపయోగించాల్సి ఉంటుందని పేర్కొంది.
చాలా మంది ఫోన్‌పేను ప్రధానంగా యూపీఐ చెల్లింపుల కోసం ఉపయోగిస్తున్నారు. వాలెట్ సేవలను ఉపయోగించే వారి సంఖ్య గతంతో పోలిస్తే గణనీయంగా తగ్గిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కొందరు వినియోగదారులు చివరిసారిగా వాలెట్ ఎప్పుడు ఉపయోగించారో కూడా గుర్తు లేదని అంటున్నారు.
అలాంటి పరిస్థితిలో వాలెట్‌ను ఉపయోగించకపోయినందుకు ఛార్జీలు విధించడం అన్యాయమని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలి కాలంలో యూపీఐ లైట్ వంటి సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో చిన్న మొత్తాల చెల్లింపులకు చాలామంది వాటినే ఉపయోగిస్తున్నారు.
దీంతో సంప్రదాయ డిజిటల్ వాలెట్ల వినియోగం తగ్గింది. ఫోన్‌పే వాలెట్‌ను పక్కనపెట్టి యూపీఐ లైట్ లేదా నేరుగా బ్యాంక్ ఖాతా ద్వారా లావాదేవీలు చేసే వారి సంఖ్య పెరిగింది. ఈ నేపథ్యంలో వాడని వాలెట్లపై నిర్వహణ ఛార్జీలు విధించడం సరైన నిర్ణయమా అనే చర్చ కొనసాగుతోంది.
చెల్లింపులను ప్రోత్సహించాల్సిన సమయంలో ఇలాంటి ఛార్జీలు వినియోగదారులను నిరుత్సాహపరుస్తాయని వారు అంటున్నారు. మరోవైపు, వాలెట్ నిర్వహణకు కంపెనీలకు ఖర్చులు ఉంటాయని, అందుకే ఇనాక్టివ్ ఖాతాలపై రుసుములు విధించడం వ్యాపార పరంగా సమంజసమని కొందరు అభిప్రాయపడుతున్నారు.
కొంతమంది యూజర్లు సోషల్ మీడియాలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)ను ట్యాగ్ చేస్తూ ఫోన్‌పే నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. డిజిటల్