
వంట గ్యాస్ సిలిండర్ ధరలు పెరుగుతున్న వేళ పేద కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఊరట ఇస్తోంది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PM Ujjwala Yojana 3.0) కింద ఉచితంగా గ్యాస్ అందిస్తోంది. ఈ పథకం ద్వారా అర్హులైన మహిళలకు ఉచిత ఎల్పీజీ కనెక్షన్ తో పాటు మొదటి సిలిండర్ కొనుగోలుకు ఆర్థిక సాయం, గ్యాస్ సబ్సిడీ వంటి అనేక ప్రయోజనాలు అందిస్తోంది.
కట్టెలు, బొగ్గు వంటి పాత పద్ధతుల్లో వంట చేసే కుటుంబాలను, స్వచ్ఛమైన ఎల్పీజీ వంట గ్యాస్‌కు మార్చడమే ప్రధాన మంత్రి ఉజ్వల యోజన ముఖ్య ఉద్దేశం. దీనివల్ల మహిళల ఆరోగ్యం బాగుపడటంతో పాటు, వంట పని కూడా సులభం అవుతుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఉజ్వల యోజన 3.0 ద్వారా కొత్త లబ్ధిదారులకు కూడా ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు ఇస్తోంది ప్రభుత్వం.
ఉజ్వల యోజన 3.0కు దరఖాస్తు చేయాలనుకునే వారు దగ్గర్లోని LPG డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో నేరుగా అప్లై చేసుకోవచ్చు. లేదా అధికారిక వెబ్సైట్ నుంచి అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకుని అవసరమైన డాక్యుమెంట్లతో పాటు సమర్పించవచ్చు. మీ దరఖాస్తును పరిశీలించి, అర్హత ఉందని నిర్ధారించుకున్న తర్వాత ఉచిత ఎల్పీజీ కనెక్షన్ మంజూరు చేస్తారు.
ఉజ్వల యోజన కేవలం ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇచ్చే పథకం మాత్రమే కాదు... కట్టెల పొయ్యి, బొగ్గు పొగ వల్ల వచ్చే శ్వాసకోశ వ్యాధులను తగ్గించడంలో, మహిళల వంట సమయాన్ని ఆదా చేయడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా మహిళల పేరు మీదే ఎల్పీజీ కనెక్షన్ ఇవ్వడం వల్ల వారి సామాజిక, ఆర్థిక సాధికారతకు కూడా ఈ పథకం దోహదపడుతుంది
.