
ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌లో బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం ఉదయం వరకు మూడు మ్యాచులు జరిగాయి. తొలుత ఘనా - పనామా తలపడగా.. క్రొయేషియాను ఇంగ్లాండ్ ఢీకొట్టింది.
ఉజ్బెకిస్థాన్‌ను కొలంబియా ఎదుర్కొంది. ఈ మూడు మ్యాచుల్లోనూ ఫలితం వచ్చేసింది. అదే సమయంలో ఇంగ్లాండ్ ఆటగాడు హ్యారీ కేన్ ఓ ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఎవరు విజయం సాధించారో ఓ లుక్కేద్దాం.
ఘనా జట్టులో స్టార్ ఆటగాడు థామస్ పార్టీ. అతడు మిడ్‌ఫీల్డర్. కానీ, పనామాతో మ్యాచ్‌కు అతడు దూరంగా ఉండాల్సివచ్చింది. కెనడాలోకి అతడికి ఎంట్రీ ఇవ్వకపోవడమే అందుక్కారణం. ఇంగ్లాండ్‌లో అతడిపై అత్యాచార కేసు విచారణ సాగుతోంది. దీంతో కెనడాలోకి అడుగుపెట్టలేకపోయాడు. అయితే పనామాతో చివరివరకూ పోరాడి మరీ ఘనా విజయం సాధించింది. ఆట అదనపు సమయంలో ఘనా ప్లేయర్ కలేబ్ (90+5వ నిమిషం) గోల్ కొట్టాడు. దీంతో డ్రా చేద్దామనుకున్న పనామా ఆశలకు తెర పడింది. చివరికి 1-0 తేడాతో ఘనా విజయం సాధించింది.
టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన ఇంగ్లాండ్ తన తొలి మ్యాచ్‌లో క్రొయేషియాను చిత్తు చేసింది. స్టార్ ఆటగాడు హ్యారీ కేన్ 12వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌తో గోల్ కొట్టి ఇంగ్లాండ్‌కు ఆధిక్యం అందించాడు. అయితే, క్రొయేషియా ప్లేయర్ మార్టిన్ బతురినా (36) గోల్‌తో స్కోర్లు సమమయ్యాయి. మళ్లీ 42వ నిమిషంలో కేన్ చేసిన గోల్‌తో 2-1 ఆధిక్యంలోకి ఇంగ్లాండ్ వెళ్లింది. అయితే, అది కాసేపు మాత్రమే. తొలి అర్ధభాగం అదనపు సమయంలో (45+5వ నిమిషం) పీటర్ ముసా అద్భుతమైన గోల్‌తో క్రొయేషియా 2-2తో సమంగా మారింది. జుడె బెల్లిగ్హామ్ (47వ నిమిషం), మార్కస్ రాష్‌ఫోర్డ్ (85వ నిమిషం) గోల్స్‌తో ఇంగ్లాండ్ 4-2 తేడాతో క్రొయేషియాపై విజయం సాధించింది. రెండో అర్ధ భాగంలో క్రొయేషియా వెనకబడిపోయింది. ఈ క్రమంలో ఇంగ్లాండ్ ఆటగాడు హ్యారీ కేన్ డేవిడ్ బెక్‌హామ్‌ను సమం చేశాడు. మూడు వేర్వేరు ప్రపంచ కప్‌ల్లో గోల్స్ చేసిన రెండో ఆటగాడు కేన్ (2018, 2022, 2026). అతడి కంటే ముందు బెక్‌హామ్ (1998, 2002, 2006) పేరిట ఈ రికార్డు ఉండేది.
ప్రపంచ కప్‌లో పోర్చుగల్‌తో కలిసి ఒకే గ్రూప్‌లో ఉన్న కొలంబియా విజయంతో ముందడుగు వేసింది. ఒకవైపు పోర్చుగల్ తన తొలి మ్యాచ్‌ను డిఆర్ కాంగోతో డ్రా చేసుకోగా.. కొలంబియా మాత్రం 3-1 తేడాతో ఉజ్బెకిస్థాన్‌పై సూపర్ విక్టరీ సాధించింది. ఆరంభం నుంచి కొలంబియాదే ఆధిపత్యం. డానియల్ మునోజ్ (40వ నిమిషం), లూయిస్ డియాజ్ (65వ నిమిషం), జామిన్టన్ క్యాపాజ్ (90+9వ నిమిషం) కొలంబియా తరఫున గోల్స్ కొట్టారు. ఉజ్బెకిస్థాన్ ప్లేయర్ అబ్బోస్‌బెక్ (60వ నిమిషం) మాత్రమే ఒక్క గోల్ కొట్టాడు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.