
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Hyderabad Metro Rail: హైదరాబాద్ మెట్రో రైలు అంశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి మధ్య కౌంటర్లు, ప్రతి కౌంటర్లు నడుస్తుండగా.. మంగళవారం ఇద్దరి మధ్య మరింత రాజుకుంది. ఉదయం కిషన్ రెడ్డి ప్రెస్‌మీట్ నిర్వహించగా..
సాయంత్రం రేవంత్ రెడ్డి లేఖ రాశారు. విబేధాలు కొనసాగుతున్న వేళ రైల్వే శాఖ మంత్రితో సమావేశం ఏర్పాటుచేయాలని.. అనుమతులు, రుణాల విడుదలలో జాప్యం చేయవద్దని లేఖలో విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్–2కు కేంద్ర అనుమతులు, ఐఆర్ఎఫ్సీ రుణ విడుదలలో జాప్యం చేయవద్దని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి తెలంగాణ సీఎం బహిరంగ లేఖ రాశారు.
రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో వెంటనే సమావేశం ఏర్పాటు చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. మెట్రో ఫేజ్–2 కోసం 7 కారిడార్లు, 122.9 కి.మీ., రూ.38,595 కోట్ల ప్రతిపాదన కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిందని వివరించారు. కేంద్ర అభ్యంతరాల నేపథ్యంలో మెట్రో ఫేజ్–1ను స్వాధీనం చేసుకునే నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
హైదరాబాద్ మెట్రో ఫేజ్–1 స్వాధీనానికి మొత్తం రూ.15,000 కోట్ల లావాదేవీలు పూర్తి చేశాం. కేంద్రం నామినేట్ చేసిన యూపీఎంఆర్సీఎల్ ఎండీ సుశీల్‌కుమార్ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు' అని లేఖలో తెలంగాణ సీఎం గుర్తు చేశారు. 'డ్యూ డిలిజెన్స్ పూర్తి చేసి రుణ ఒప్పందం చేసిన ఐఆర్ఎఫ్సీ.
రుణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ, ఆర్బీఐ డైరెక్ట్ డెబిట్ అంగీకరించింది' అని లేఖలో ప్రస్తావించారు. 'తొలి విడత రుణ విడుదల కోసం రూ.84.32 కోట్ల అప్‌ఫ్రంట్ ఫీజు తెలంగాణ ప్రభుత్వం చెల్లించింది. రూ.1,461.47 కోట్ల ఈక్విటీని ఇప్పటికే ఎస్క్రో ఖాతాలో జమ చేశాం' అని
లేఖలో సీఎం పేర్కొన్నారు.
జూన్ 15వ తేదీన విడుదల కావాల్సిన తొలి విడత రుణం ఇంకా విడుదల కాలేదని తెలంగాణ సీఎం లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం దానం అడగడం లేదని, ఒప్పందం ప్రకారం రుణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు చెందిన సీనియర్ కేంద్ర మంత్రిగా కిషన్‌రెడ్డి బాధ్యత తీసుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు. మెట్రో ఫేజ్-2ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల 50:50 జాయింట్ వెంచర్‌గా ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. అనుమతులు ఆలస్యమైనా రాష్ట్ర వనరులు, సంస్థాగత రుణాలతో ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్తామని తెలంగాణ ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అవసరమైన ముందస్తు అనుమతులను వెంటనే మంజూరు చేయాలని లేఖలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అన్ని ఒప్పందాలు, ఆధారాలతో సమావేశానికి హాజరై వివరణ ఇవ్వడానికి సిద్ధమని రేవంత్‌రెడ్డి ప్రకటించారు.