
దేశ రాజధాని ఢిల్లీ జనాభా అనూహ్యంగా పెరిగింది. జనగణన 2027లో భాగంగా నిర్వహించిన తొలి దశ సర్వేలో ఢిల్లీ జనాభా 2.3 కోట్లు దాటినట్టు ప్రాథమికంగా తేలింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 1.7 కోట్లుగా ఉన్న జనాభా, గత 15 ఏళ్లలో సుమారు 37.5 శాతం పెరగడం గమనార్హం.సెన్సస్ 2027లో భాగంగా చేపట్టిన 'హౌస్ లిస్టింగ్, హౌసింగ్ సెన్సస్' తొలి దశ ప్రక్రియ ఏప్రిల్ 1న ప్రారంభమై జూన్ 14న ముగిసింది.
ఈ సందర్భంగా అధికారులు ఢిల్లీలోని 45,863 బ్లాకులలో పర్యటించి దాదాపు 76 లక్షల ఇళ్లు, 55 లక్షల కుటుంబాల వివరాలను నమోదు చేశారు. ఈ వివరాల ఆధారంగా జనాభాను ప్రాథమికంగా అంచనా వేశారు.అయితే, ఈ గణాంకాలు తాత్కాలికమైనవేనని అధికారులు స్పష్టం చేశారు.
2027 ఫిబ్రవరిలో చేపట్టనున్న రెండో దశ 'జనాభా లెక్కింపు' తర్వాతే తుది జనాభా సంఖ్యను ఖరారు చేస్తారు. రెండో దశలో ప్రజల సామాజిక, ఆర్థిక వివరాలను సేకరించనున్నారు.జిల్లా వారీగా చూస్తే, ఈశాన్య ఢిల్లీలో అత్యధికంగా 28 లక్షల జనాభా ఉండగా, నైరుతి ఢిల్లీలో 25 లక్షల మంది నివసిస్తున్నారు.
అత్యల్పంగా న్యూఢిల్లీ జిల్లాలో కేవలం 2 లక్షల జనాభా నమోదైంది. 2026 మధ్య నాటికి ఢిల్లీ జనాభా సుమారు 2.3 కోట్లకు చేరుకుంటుందని గతంలో వచ్చిన అంచనాలకు, తాజా గణాంకాలు దగ్గరగా ఉండటం విశేషం
.