
మనం రోజూ వాడే కరెన్సీ నోట్లపై చాలా విషయాలు ఉంటాయి. గాంధీ తాత బొమ్మ, నోటు నంబర్, సెక్యూరిటీ దారం, వివిధ భాషల్లో నోటు విలువ వంటివి గమనిస్తాం. కానీ రూ.100, రూ.200, రూ.500 నోట్ల చివర్లో ఉండే వాలు గీతలను ఎందుకు ముద్రిస్తారో ఆలోచించారా?
ఈ చిన్న గుర్తుల వెనుక ఓ పెద్ద సామాజిక బాధ్యత ఉంది. నోటుకు రెండుచివర్ల (ఎడమ, కుడి వైపులా) కనిపించే వాలు గీతలను 'బ్లైండ్ మార్క్స్' అని పిలుస్తారు. ఇవి మామూలు ప్రింటింగ్లా కాకుండా కొంచెం ఉబ్బెత్తుగా ఉంటాయి. చేత్తో తాకితే ఇవి స్పష్టంగా తెలుస్తాయి.
దీనివల్ల కంటిచూపు సరిగా లేనివారు కూడా ఆ కరెన్సీ నోటు విలువను సులభంగా గుర్తిస్తారు. రూ.100 నోటుపై రెండు వైపులా నాలుగు వాలు గీతలు ఉంటాయి. రూ.200 నోటుపై కూడా నాలుగు గీతలే ఉంటాయి, కానీ వాటితో పాటు రెండు చిన్న సున్నాలు కూడా ఉంటాయి.
ఇక రూ.500 నోటుకు ఇరువైపులా ఐదు గీతలు కనిపిస్తాయి. ఈ తేడాలతోనే కంటిచూపు లేనివారు కరెన్సీ నోట్ల విలువను గుర్తిస్తారు. బ్లైండ్ మార్క్స్ మాత్రమే కాదు ప్రతి నోటుపై ప్రత్యేక ఆకారాలు కూడా ఉంటాయి. రూ.100 నోటుపై త్రిభుజం, రూ.200 నోటుపై 'H' ఆకారం, రూ.500 నోటుపై వృత్తం ముద్రించి ఉంటాయి.
ఇవన్నీ కూడా దృష్టిలోపం ఉన్నవారి కోసమే ఏర్పాటు చేశారు. దీంతో కంటిచూపు లేనివారిని ఇతరులు మోసం చేసే వీలుండదు. నోట్లపై ఉండే సెక్యూరిటీ దారం, రంగు మారే ఇంక్ వంటివి దొంగ నోట్లను గుర్తించడానికి ఉపయోగపడతాయి. అదే సమయంలో బ్లైండ్ మార్క్స్ లాంటివి అందరికీ సమానమైన వినియోగాన్ని అందిస్తాయి.
నెక్స్ట్ టైమ్ కరెన్సీ నోటు చేతిలోకి తీసుకున్నప్పుడు దాని వెనుక ఉన్న ఈ గొప్ప ఆలోచనను, సామాజిక బాధ్యతను గుర్తుచేసుకోండి
.