
హైదరాబాద్‌కు రెండో దశ మెట్రో రైలు ఎందుకు తీసుకురాలేకపోయారో సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ప్రజలకు జవాబు చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ మెట్రో ఫేజ్-2 (Metro Phase-2) ప్రాజెక్టును కేంద్రం నుంచి సాధించలేక, తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకొనేందుకే సీఎం రేవంత్‌రెడ్డి ఇన్ని కుప్పిగంతులు వేస్తున్నారని ధ్వజమెత్తారు.
71సార్లు ఢిల్లీకి చకర్లు కొట్టినా, బడేభాయ్ మోదీ (Modi)ని మెప్పించి ప్రాజెక్టును ఒప్పించలేకపోవడం సీఎం చేతకానితనానికి నిదర్శనమని మండిపడ్డారు. రాష్ట్రం ప్రతిపాదించిన మెట్రో విస్తరణకు అనుమతి ఇవ్వని కేంద్రంపై, ముఖ్యంగా ప్రధానమంత్రిని విమర్శించే సత్తా, ధైర్యం రేవంత్‌రెడ్డికి లేదని విమర్శించారు.
తనపై నమోదైన ఓటుకు నోటు కేసు ఉచ్చు బిగుస్తుందనే భయంతో బీజేపీ (BJP)తో చీకటి ఒప్పందాలు చేసుకోవడం వల్లనే ఈ పరిస్థితి రేవంత్‌కు ఏర్పడిందని దుయ్యబట్టారు. అందుకే కేంద్రంలోని బీజేపీని కాకుండా తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని విమర్శించి ప్రజలను తప్పుదోవ పట్టించే నీచమైన ప్రయత్నం రేవంత్‌రెడ్డి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
కేసీఆర్ పాలనలో అనుమతులు, రుణాలు ఎలా వచ్చాయో, మీ దికుమాలిన పాలనలో అవి ఎందుకు ఆగిపోయాయో ప్రజలకు అర్థమవుతున్నదని పేర్కొన్నారు
.