
నీడనిచ్చే చెట్లు నగరాల్ని చల్లబరుస్తాయని మనందరికీ తెలుసు. అలా చల్లబరచాలంటే మొక్కల పెంపకం తీరు చాలా కీలకమని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. కొన్ని సందర్భాల్లో మొక్కల పెంపకంలో లోపాలు నగర ఉష్ణోగ్రతను మరింత అసౌకర్యంగా మారుస్తాయని తేలింది.
మొక్కల పెంపకం నగరాల్లో వేడి తీరుతెన్నుల్ని ఎలా మారుస్తుందో పరిశోధకులు మెల్బోర్న్(ఆస్ట్రేలియా), మ్యూనిక్(జర్మనీ), హాంకాంగ్‌లలో క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారు. పొదలు, నేలను కప్పిఉంచే మొక్కలతో కలిపి చెట్లను పెంచితే మంచి ఫలితాలు ఉంటాయని తేలింది.
నగరాలు వేడిని బంధిస్తాయి. రోడ్లు, భవనాలు, తారు పగటిపూట సౌరశక్తిని గ్రహించి.. రాత్రిపూట నెమ్మదిగా దాన్ని గాల్లోకి విడుదల చేస్తాయి. ఆ వేడిని ఎదుర్కొనాలంటే చెట్ల పెంపకం చక్కటి పరిష్కారం. ఎందుకంటే అవి చుట్టుపక్కల ఉపరితలాలు గ్రహించే వేడిని తగ్గిస్తాయి.
కానీ బయటి వాతావరణం కేవలం గాలి ఉష్ణోగ్రతపై మాత్రమే ఆధారపడి ఉండదు. సూర్యరశ్మి, పరావర్తన వేడి, తేమ, గాలి ప్రవాహం.. ఇత్యాదివి దాన్ని నిర్ణయిస్తాయి. గాల్లో తేమ ఎక్కువగా ఉన్నా.. లేదా ఆ ప్రదేశంలో గాలి వీయకపోయినా, వీధి మొత్తం నీడగా ఉన్నా..
అసౌకర్యంగా అనిపించొచ్చు. అందువల్ల మొక్కల సంఖ్యే కాదు, వాటిని నాటే విధానామూ ముఖ్యమంటున్నారు పరిశోధకులు. అందరికీ ఒకే విధమైన పచ్చదనం విధానం సత్ఫలితాలు ఇవ్వకపోవచ్చు. ఒక నగరంలో మొక్కల పెంపకం విధానం మరో నగరంలో భిన్నమైన ఫలితాన్ని ఇవ్వొచ్చు.
సమశీతోష్ణ మెల్బోర్న్, చల్లని మ్యూనిక్, తేమతో కూడిన హాంకాంగ్‌లలో క్షేత్రస్థాయిలో పరిస్థితుల్ని పరిశోధకులు బేరీజువేశారు. ఎలాంటి మొక్కల్లేని బహిరంగ ప్రదేశాలు, కేవలం చెట్లు మాత్రమే ఉన్న ప్రాంతాలు, పొరలుగా నాటిన మొక్కల(అంటే చెట్లు, పొదలు, నేల కప్పే మొక్కలు కలిపి)ను పోల్చి చూశారు.
గాల్లో వేడిని, సగటు వికిరణ ఉష్ణోగ్రత(రోడ్లు, గోడలు, ఇతర ఉపరితలాలు మనిషిపై చూపే ఉష్ణ ప్రభావం)నూ కొలిచారు. మెల్బోర్న్లో బహిరంగ ప్రదేశాలతో పోలిస్తే.. పచ్చదనం ఉన్న ప్రాంతాల్లో చెట్లు పాదచారులు గ్రహించే వికిరణ వేడిని 18 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే
ఎక్కువగా తగ్గించాయి. పొరలుగా మొక్కల్ని నాటడం వల్ల మ్యూనిక్‌లో అత్యధిక ప్రయోజనాలు కనిపించాయి. అక్కడ చెట్లు, పొదలు, నేలను కప్పే మొక్కలున్న వీధులు బహిరంగ ప్రదేశాలతో పోలిస్తే మధ్యాహ్నం వేడిని దాదాపు 8 డిగ్రీల వరకు తగ్గించాయి. హాంకాంగ్‌లో ఒకదానిపై ఒకటి ఆవరించి ఉన్న చెట్ల పందిళ్ల ద్వారా ఏర్పడిన నీడ నగర చల్లదనానికి తోడ్పడుతోంది. అయితే ఇక్కడ గాల్లో తేమ నగరంలో చల్లదనాన్నిచ్చే ప్రక్రియను మార్చేస్తోంది. అందువల్ల మొక్కల్ని పెంచే విధానం కీలకమని మూడు నగరాల్లోనూ నిరూపితమైంది. పొదలు, నేలను కప్పే మొక్కలతో కలిపి చెట్లను పెంచితేనే మెరుగైన ఫలితం ఉంటుందని తేలింది. నాటిన మొక్కలు స్థానిక పర్యావరణంతో ఎలా మమేకమవుతాయనే దానిపై ప్రయోజనాలు ఆధారపడి ఉంటాయి.
కేవలం మొక్కలతోనే సత్ఫలితాలు వస్తాయని అనుకోవద్దని పరిశోధకులు చెబుతున్నారు. హాంకాంగ్‌లో దట్టమైన వృక్షసంపద కొన్నిసార్లు తేమను పెంచి, చల్లదనం ప్రయోజనాన్ని కొంత తగ్గించింది. మొక్కలు బాష్పోత్సేకం ద్వారా గాల్లోకి నీటి ఆవిరిని విడుదల చేస్తాయి. ఇది పొడి వాతావరణాన్ని చల్లబరుస్తుంది. కానీ అప్పటికే తేమగా ఉండే నగరాల్లో.. అదనపు తేమ బహిరంగ ప్రదేశాలను జిగటగా, అసౌకర్యంగా అనిపించేలా చేస్తుంది. మ్యూనిక్‌లోని కొన్ని వీధుల్లో దట్టమైన వృక్షసంపద ఇరుకైన రహదారుల్లో గాలి ప్రవాహాన్ని తగ్గించి.. వేడి గాలిని బంధించి.. పాదచారుల నుంచి వాహన కాలుష్యం దూరంగా వెళ్లే వేగాన్ని తగ్గించింది. ఇతర ప్రాంతాల్లో చేసినట్లే సాధారణ పచ్చదనం లక్ష్యాలపై నగరాలు ఎందుకు ఆధారపడకూడదో ఈ పరిశోధనలు రుజువుచేస్తున్నాయి. వృక్షసంపద నగరాల్లో చల్లదనాన్ని పెంచుతుందా? లేదా దుష్ప్రభావాన్ని కలిగిస్తుందా? అనే దాన్ని వాతావరణం, వీధుల విస్తీర్ణం, గాలి ప్రవాహం నిర్ణయిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.
పట్టణాల్లో పచ్చదనం, చల్లదనాన్ని పెంచాలంటే స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మొక్కలు పెంచాలంటున్నారు. వాటిని ఎక్కడ, ఎలా నాటాలి అనే దాన్ని పట్టణ ప్రణాళిక రూపకర్తలు నిర్ణయించాలి. పార్కులు, బహిరంగ ప్రదేశాల్లో పొరలుగా ఉండే వృక్షసంపద జీవవైవిధ్యానికి, చల్లదనానికి తోడ్పడుతుంది. జనసాంద్రత ఎక్కువగా ఉండే వీధుల్లో నీడ, గాలి ప్రసరణ మధ్య సమతౌల్యాన్ని పాటించాల్సి ఉంటుంది. చెట్ల పందిరి విస్తీర్ణం ఎంత ముఖ్యమో, వాటి అమరిక, సాంద్రత, రకం కూడా అంతే ముఖ్యమంటున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.