
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ
మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Telangana CM Flight Diversion: మృగశిర కార్తె ప్రారంభమైన తర్వాత తెలంగాణలో వర్షాలు జోరుగా పడుతున్నాయి. నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వానలు కురుస్తున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఒక రోజు విరామంలో మరోసారి వరుణుడు దంచికొట్టాడు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ నగరమంతటా భారీ వర్షం కురిసింది. దాదాపు గంట వరకు నిరాటంకంగా పెద్ద ఎత్తున వాన పడింది. కుండపోత వర్షం ధాటికి నగరంలోని రోడ్లన్ని జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో హైదరాబాద్‌లో మరోసారి జనజీవనం స్తంభించింది. ఈ వర్షం ప్రభావంతో ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న విమానం దారి మళ్లింది. ఈ వివరాలు ఇలా ఉన్నాయి.
ట్రాఫిక్ జామ్ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో భారీ వర్షం పడింది. మేడ్చల్, శామీర్‌పేట్, అల్వాల్, బొల్లారం పరిసర ప్రాంతాల్లో గంటపాటు వర్షం దంచి కొట్టింది. పలు కాలనీల్లో జల ప్రవాహం పోటెత్తింది. రోడ్లు జలదిగ్భంధమయ్యాయి. ఈదురు గాలుల కారణంగా విద్యుత్ సరఫరాకు కొన్నిచోట్ల అంతరాయం ఏర్పడింది. వర్షం కారణంగా మేడ్చల్ జాతీయ రహదారి 44పై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
హైదరాబాద్‌లోని కూకట్పల్లి, కేపీహెచ్‌బీ, జేఎన్టీయూ పరిసర ప్రాంతాలలో ఉరుములతో కూడిన వర్షం పడింది. ఉద్యోగులు ఇంటికి చేరుకున్న తర్వాత ఏకతాటిగా వర్షం పడుతుండడంతో కొద్దిగా ఉపశమనం కలిగించే విషయమైనా వివిధ పనుల మీద బయటికి వెళ్లే వారికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
పాతబస్తీలో.. హైదరాబాద్‌లోని పాతబస్తీలో కూడా జోరుగా వర్షం కురిసింది. పాతబస్తీ ఫలక్‌నుమా, బహదూర్‌పురా, కిషన్‌బాగ్, చార్మినార్, నూర్ఖాన్ బజార్, షా అలీ బందా హుస్సేనీ ఆలమ్‌లో భారీ వాన పడింది.
వర్షం కారణంగా శంషాబాద్ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తున్న ముఖ్యమంత్రి విమానం కూడా ప్రభావితమైంది. ల్యాండయ్యే అవకాశాలు లేకపోవడంతో విమానాన్ని బెంగళూరుకు దారి మళ్లించారు. హైదరాబాద్‌లో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతున్న నేపథ్యంలో ఢిల్లీ నుంచి శంషాబాద్ వస్తున్న ఇండిగో విమానం బెంగళూరుకు మళ్లించారు. శంషాబాద్ వస్తున్నప్పుడు మార్గమధ్యలో వాతావరణం అనుకూలించకపోవడంతో ల్యాండింగ్‌కు ఏటీసీ కంట్రోల్ అనుమతి ఇవ్వలేదు.