Telangana HC Road Widening PIL : రోడ్డు విస్తరణ పనుల్లో జరుగుతున్న అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలపై తెలంగాణ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ప్రభుత్వ భూములను ఆక్రమించి రోడ్లపై అక్రమంగా వెలిసిన కట్టడాలు
, విగ్రహాలను ఎందుకు తొలగించలేదో వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సూర్యాపేట జిల్లాకు చెందిన 97 ఏళ్ల వృద్ధ స్వాతంత్ర్య సమరయోధుడు దాఖలు చేసిన ఒక ప్రజాహిత వ్యాజ్యంపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మోహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం గురువారం ఈ కేసుపై విచారణ జరిపింది.97 ఏళ్ల వయసులో కోర్టు మెట్లెక్కిన సమరయోధుడు..సూర్యాపేట జిల్లా గరిడేపల్లి గ్రామానికి చెందిన 97 ఏళ్ల స్వాతంత్ర్య సమరయోధుడు బండ్ల పుల్లారెడ్డి ఈ పిటిషన్ను దాఖలు చేశారు. మిర్యాలగూడ–హుజూర్ నగర్ ప్రధాన రహదారి నుంచి అయ్యప్ప స్వామి గుడి మీదుగా ఆలంగీపురం గ్రామం వరకు జరుగుతున్న రోడ్డు విస్తరణ ప్రాజెక్టులో భారీగా అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వయసు పైబడినప్పటికీ సమాజ హితం కోసం ఆయన చేసిన ఈ పోరాటం ఇప్పుడు నగరంలో చర్చనీయాంశంగా మారింది.పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపిస్తూ.. రహదారి విస్తరణను ప్రస్తుతం ఉన్న సెంటర్ లైన్ ఆధారంగా ఇరువైపులా సమానంగా చేపట్టాల్సి ఉందన్నారు. అయితే అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కొన్ని నిర్దిష్ట సంస్థలు, ప్రైవేటు కట్టడాలను కాపాడేందుకు గాను రహదారికి ఒకవైపు మాత్రమే దాదాపు 10 అడుగుల మేర రోడ్డును విస్తరిస్తున్నారని కోర్టుకు తెలిపారు. అధికారుల ఈ ఏకపక్ష నిర్ణయం వల్ల ఒక వర్గానికి చెందిన భూ యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారని వాదించారు. ఆమోదించబడిన అసలు ప్లాన్ను పక్కనబెట్టి, ఏకపక్షంగా పనులు చేస్తున్నారని, రోడ్డు ఇరువైపులా సమానంగా ఐదేసి అడుగుల చొప్పున విస్తరించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.అక్రమ విగ్రహాలు, కట్టడాలపై ధర్మాసనం సీరియస్..!రోడ్డు విస్తరణ అక్రమాలతో పాటు సదరు రహదారిని ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూముల్లో పెద్ద సంఖ్యలో అనధికారిక విగ్రహాలు, అక్రమ కట్టడాలు వెలిశాయని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనానికి వివరించారు. వీటిని తొలగించాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా కనీస చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఇలాంటి అక్రమ కట్టడాలు సుప్రీం కోర్టు జారీ చేసిన మార్గదర్శకాలకు, గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు పూర్తిగా విరుద్ధమని స్పష్టం చేశారు. ఇరుపక్షాల వాదనలను విన్న హైకోర్టు డివిజన్ బెంచ్.. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించింది. ప్రభుత్వ భూముల్లో, ప్రజా రహదారులపై వెలిసిన అనధికారిక కట్టడాలు, విగ్రహాల ఆరోపణలకు సంబంధించి పూర్తి వివరాలను కోర్టు ముందుంచాలని రోడ్లు, భవనాల శాఖ ప్రభుత్వ ప్లీడర్ను ఆదేశించింది. సంబంధిత అధికారుల నుంచి తక్షణమే సూచనలు, నివేదికలు తీసుకోవాలని స్పష్టం చేసింది. అనంతరం ఈ కేసు తదుపరి విచారణను రెండు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.