.webp&w=3840&q=75)
ప్రపంచవ్యాప్తంగా అపారమైన గౌరవాన్ని, సాటిలేని కీర్తిని సంపాదించుకున్న ఉన్నత వర్గాల ప్రతిష్టలు ఎలా నిర్మించబడతాయో, అవి ఎంత వేగంగా నాశనమవుతాయో చెప్పడానికి మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ జీవితం
ఒక సజీవ ఉదాహరణగా నిలుస్తోంది. ఒకప్పుడు సాంకేతిక రంగంలో అద్భుతాలు సృష్టించిన మేధావిగా, సమాజ శ్రేయస్సు కోరే గొప్ప పరోపకారిగా వెలుగొందిన ఆయన ప్రతిష్ఠ ఇటీవలి కాలంలో తీవ్రంగా దెబ్బతిన్నది. జెఫ్రీ ఎప్స్టీన్తో ఉన్న వివాదాస్పద సంబంధాలు, ఆకస్మిక వైవాహిక విచ్ఛిన్నం, మైక్రోసాఫ్ట్ కార్యాలయంలో మహిళా ఉద్యోగుల పట్ల అనుచిత ప్రవర్తన ఆరోపణలు, కోవిడ్ మహమ్మారి సమయంలో ఆయన అవలంబించిన వాణిజ్య విధానాలు బిల్ గేట్స్ ప్రజా ప్రతిష్టను సంక్షోభంలోకి నెట్టాయి. ఒక ఆదర్శవంతమైన పరోపకారి స్థానం నుండి ప్రజా విమర్శలను ఎదుర్కొంటున్న ఒక సాధారణ బిలియనీర్‌గా ఆయన మారిన వైనంపై ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తోంది.
గడచిన కొన్ని దశాబ్దాలుగా, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలలో బిల్ గేట్స్ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉన్నారు. సమకాలీన టెక్ దిగ్గజాలైన స్టీవ్ జాబ్స్, ఎలాన్ మస్క్, మార్క్ జుకర్‌బర్గ్ వంటి వారు తరచుగా వివాదాల్లో చిక్కుకుంటూ, అస్థిరమైన వ్యక్తులుగా ముద్రపడితే.. బిల్ గేట్స్ మాత్రం క్రమశిక్షణ, సామాజిక బాధ్యత గల నైతిక విలువలు కలిగిన వ్యక్తిగా తన ఇమేజ్ను పటిష్టం చేసుకున్నారు. బాల మేధావిగా మైక్రోసాఫ్ట్‌ను స్థాపించి, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఎదిగినప్పటికీ, తన సంపదనంతా స్వచ్ఛంద కార్యక్రమాలకు దానం చేస్తానని ప్రకటించి అందరి ప్రశంసలు అందుకున్నారు. కరోనా మహమ్మారి కంటే ఎంతో ముందే ప్రపంచాన్ని రాబోయే వ్యాధుల గురించి హెచ్చరించడం, పోలియో నిర్మూలనకు వేల కోట్ల నిధులు ఇవ్వడం, మూడవ ప్రపంచ దేశాలలో పారిశుధ్య మెరుగుదలకు సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహించడం వంటి పనుల ద్వారా ఆయన దాదాపు ఒక లౌకిక సన్యాసిలా కీర్తించబడ్డారు. అయితే, ఈ ఆకాశమంత ప్రతిష్టలో పగుళ్లు ఏర్పడిన తర్వాత ఆయన పతనం కూడా అంతే నాటకీయంగా సాగింది.
ఈ కథనంలో అత్యంత కీలకమైన మలుపు.. మైనర్ల అక్రమ రవాణా, లైంగిక నేరాలకు శిక్ష పడిన జెఫ్రీ ఎప్స్టీన్తో బిల్ గేట్స్‌కు ఉన్న అనుబంధం బయటపడటం. అధికారం, సంపదను ఉపయోగించి చట్టం నుండి తప్పించుకునే ఉన్నత వర్గాల నెట్‌వర్క్‌కు ఎప్స్టీన్ ఒక కేరాఫ్ అడ్రస్‌గా ఉండేవాడు. ఇటీవల యునైటెడ్ స్టేట్స్ హౌస్ ఓవర్‌సైట్ కమిటీ ముందు హాజరైన గేట్స్, ఎప్స్టీన్తో తనకున్న సంబంధాలపై లిఖితపూర్వక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎప్స్టీన్ ఫైల్స్ లోని 2013 నాటి ఒక ఈమెయిల్ ముసాయిదా ప్రకారం.. గేట్స్ వ్యక్తిగత జీవితంలోని వివాహేతర సంబంధాల పరిణామాలను దాచడానికి ఎప్స్టీన్ సహాయం చేసినట్లు ఆధారాలు లభించాయి. అంతేకాకుండా.. లైంగిక వ్యాధుల చికిత్సకు గేట్స్ మందులు వాడినట్లు కూడా అందులో ప్రస్తావన ఉంది. మొదట ఈ విషయాలను గేట్స్ ఖండించినప్పటికీ, కాంగ్రెస్ విచారణలో ఎప్స్టీన్ వద్ద తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సున్నితమైన సమాచారం ఉందని అంగీకరించక తప్పలేదు. గ్లోబల్ హెల్త్ ప్రోగ్రామ్‌ల కోసం ఎప్స్టీన్ భారీ నిధులు సేకరించగలడనే నమ్మకంతోనే, 2011లో కొందరు సహోద్యోగుల ద్వారా అతన్ని కలిశానని గేట్స్ సమర్థించుకునే ప్రయత్నం చేశారు.
తీవ్రమైన విశ్లేషణాత్మక ఆలోచనలు కలిగి, ప్రతి విషయంలోనూ సందేహాలు వ్యక్తపరిచే బిల్ గేట్స్ వంటి ప్రపంచ స్థాయి వ్యక్తి.. ఒక పేరుమోసిన నేరగాడి విషయంలో ఇంత అనాలోచితంగా ఎలా వ్యవహరించారనేది పెద్ద ప్రశ్నగా మారింది. తాను ఎవరికీ హాని చేయలేదని, కేవలం మోసపోయానని గేట్స్ వాదిస్తున్నప్పటికీ.. ఆయనకున్న అంతర్జాతీయ హోదా, సలహాదారుల వ్యవస్థ దృష్ట్యా ఈ సమాధానం నమ్మశక్యంగా లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎప్స్టీన్ పత్రాలలో పేరు ఉండటం నేరుగా నేర నిరూపణ కాకపోయినప్పటికీ, అంతవరకు ఆయన అనుభవించిన నైతిక విశిష్టతను, సమాజంలో ఉన్న ఉన్నత స్థానాన్ని ఇది తీవ్రంగా దెబ్బతీసింది.
ఎప్స్టీన్తో ఉన్న ఈ వివాదాస్పద సంబంధాలు కేవలం గేట్స్ వృత్తిపరమైన జీవితాన్నే కాకుండా.. ఆయన వ్యక్తిగత కుటుంబ జీవితాన్ని కూడా కల్లోలంలోకి నెట్టాయి. మెలిండా ఫ్రెంచ్ గేట్స్‌తో ఆయనకు జరిగిన విడాకులకు, ఈ ఎప్స్టీన్ వ్యవహారమే ప్రధాన కారణమని అంతర్గత వర్గాల సమాచారం. మెలిండా ఒక సందర్భంలో ఎప్స్టీన్ను ఒక అసహ్యకరమైన వ్యక్తిగా అభివర్ణిస్తూ.. అతనితో సమావేశమవ్వడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వారిద్దరి మధ్య నమ్మకం పూర్తిగా సన్నగిల్లినట్లు ఆమె బహిరంగంగానే పేర్కొన్నారు. రెండు దశాబ్దాలకు పైగా కలిసి నడిపిన బిల్ , మెలిండా గేట్స్ ఫౌండేషన్ సహ అధ్యక్షురాలి పదవికి జూన్ 2024లో మెలిండా రాజీనామా చేయడం, వారి వ్యక్తిగత బంధం ముగిసిపోవడమే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద దాతృత్వ సంస్థ యొక్క పునర్వ్యవస్థీకరణకు దారితీసింది. సమాజంలో పరిపూర్ణ కుటుంబం గా చలామణి అయిన ఈ జంట విడిపోవడంతో, గేట్స్ ప్రజా జీవితానికి, వ్యక్తిగత నిర్ణయాలకు మధ్య ఉన్న అగాథం స్పష్టమైంది.
దీనికి తోడు.. 2021లో వెలుగులోకి వచ్చిన మరికొన్ని నివేదికలు గేట్స్ ప్రతిష్టను మరింత మసకబార్చాయి. మైక్రోసాఫ్ట్ కంపెనీలో పనిచేసే మహిళా ఇంజనీర్ల పట్ల ఆయన అనుచితంగా గా ప్రవర్తించారనే ఆరోపణలు వచ్చాయి. మార్చి 2020లో ఆయన మైక్రోసాఫ్ట్ బోర్డు నుండి అకస్మాత్తుగా తప్పుకోవడానికి.. ఒక మాజీ ఉద్యోగినితో ఆయన పెట్టుకున్న అనుచిత సంబంధంపై జరిగిన అంతర్గత విచారణే కారణమనే ఊహాగానాలు గట్టిగా వినిపించాయి. అంతర్జాతీయంగా నడుస్తున్న మీటూ ఉద్యమం, కార్పొరేట్ రంగంలో మహిళల భద్రతపై జరుగుతున్న చర్చల నేపథ్యంలో, ఈ ఆరోపణలు గేట్స్‌ను కేవలం వివాదాస్పద సంబంధాలున్న వ్యక్తిగానే కాకుండా, కార్యాలయంలో అసమాన అధికారాలను ఉపయోగించుకునే ఒక శక్తివంతమైన ఎగ్జిక్యూటివ్‌గా మార్చాయి.
మరోవైపు.. కోవిడ్ 19 మహమ్మారి ప్రారంభంలో బిల్ గేట్స్‌ను ప్రపంచాన్ని రక్షించే ఒక ప్రవక్తగా చూశారు. ఆయన గతంలో చేసిన హెచ్చరికలు నిజమవడంతో అందరూ ఆయన పరిశోధనలను కొనియాడారు. అయితే, వ్యాక్సిన్ మేధో సంపత్తి (Intellectual Property) హక్కులపై ఆయన తీసుకున్న నిర్ణయం తీవ్ర వివాదాస్పదమైంది. వ్యాక్సిన్ సాంకేతికతను అభివృద్ధి చెందుతున్న పేద దేశాలతో పంచుకోవడానికి గేట్స్ నిరాకరించారు. భద్రతా ప్రమాణాలు, పరిమిత ఉత్పాదక సామర్థ్యం వంటి సాంకేతిక కారణాలను ఆయన సాకుగా చూపినప్పటికీ, ఆఫ్రికా, గ్లోబల్ సౌత్ దేశాలలో వేలాది మంది ప్రజలు చనిపోతుంటే.. ఒక పరోపకారిగా ఉండి కూడా ఫార్మాస్యూటికల్ కంపెనీల లాభాలకు, పేటెంట్ హక్కులకు ఆయన ప్రాధాన్యత ఇవ్వడంపై విమర్శకులు మండిపడ్డారు. దీనిని వ్యాక్సిన్ జాత్యహంకారం గా అభివర్ణించారు. గేట్స్ ఫౌండేషన్ పెట్టుబడులలో ఉన్న ప్రయోజన వైరుధ్యాలను ఎత్తిచూపారు.
బిల్ గేట్స్ అనుసరిస్తున్న ధనికస్వామ్య పరోపకారం (Plutocratic Philanthropy) వెనుక అసలు రంగు ఇప్పుడు బయటపడుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వాలు, మేధోమథన సంస్థలకు భారీగా నిధులు సమకూర్చడం ద్వారా సమస్యలను ఎలా నిర్వచించాలో, వాటికి ఎలాంటి పరిష్కారాలు చూపాలో గేట్స్ నియంత్రిస్తూ వచ్చారు. ఎవరు చెక్కులు రాస్తారో, వారే కథను కూడా రాస్తారు అన్నట్లుగా ఆయన తన ఆర్థిక శక్తిని రాజకీయ, సామాజిక అధికారంగా మార్చుకున్నారు. అయితే, ఇప్పుడు ఆ కథ సవాలుకు గురవుతోంది. ఆఫ్రికాలోని పలు సంస్థలు గేట్స్ కార్యక్రమాల వల్ల తమకు నష్టం జరిగిందని నష్టపరిహారం కోరుతున్నాయి. కాలక్రమేణా ఆయన మిత్రులు కూడా దూరమయ్యారు. ప్రముఖ పెట్టుబడిదారుడు వారెన్ బఫెట్ ఎప్స్టీన్ ఉదంతం తర్వాత గేట్స్‌తో మాట్లాడటం మానేశానని బహిరంగంగా ప్రకటించారు. ఇటీవల భారతదేశంలో జరిగిన ఏఐ సదస్సులో కీలకోపన్యాసం ఇవ్వవలసిన గేట్స్.. చివరి నిమిషంలో తప్పుకోవడం అంతర్జాతీయ వేదికలపై ఆయనకున్న విశ్వసనీయత సన్నగిల్లిందనడానికి నిదర్శనం.
ప్రస్తుతం బిల్ గేట్స్ వద్ద ఇంకా 100 బిలియన్ డాలర్ల వ్యక్తిగత సంపద, 80 బిలియన్ డాలర్ల విలువైన ఫౌండేషన్ ఆస్తులు ఉండవచ్చు. భౌతికంగా ఆయన శక్తి అపారమైనదే అయినప్పటికీ, నైతికంగా ఆయన విశ్వాసాన్ని కోల్పోయారు. నమ్మకాన్ని నిర్మించడానికి ఎన్నో ఏళ్లు పడుతుంది, కానీ దానిని కోల్పోవడానికి ఒక్క క్షణం చాలు అనే సామెత గేట్స్ జీవితానికి సరిగ్గా అతికినట్లు సరిపోతుంది. సాంకేతిక పరిజ్ఞానం దైనందిన జీవితాన్ని శాసిస్తున్న ఈ తరుణంలో.. గేట్స్ వంటి శక్తుల ఎదుగుదల, పతనం కేవలం వ్యక్తిగత కుంభకోణాలు కావు, ఇవి ఆధునిక ప్రపంచంలో అధికారం, నైతికత, విశ్వసనీయతల పునర్నిర్వచనానికి సంకేతాలు.
భారత్–చైనా ఎలక్ట్రానిక్స్ వాణిజ్యంలో సరికొత్త అధ్యాయం
.