
Sing Geetham Movie Review || చిత్రం: సింగ్ గీతం; నటీనటులు: అయాన్, అహల్య బమ్రూ, షాలిని కొండేపూడి, తులసి, బెనర్జీ, శివనారాయణ, అగు స్టాన్లీ తదితరులు; నిర్మాత: నాగ్ అశ్విన్; దర్శకత్వం: సింగీతం
శ్రీనివాసరావు; విడుదల: 12-06-2026 (Sing Geetham Movie Release Date)
వైవిధ్యానికి పెట్టింది పేరైన దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు (Singeetham Srinivasa Rao). ఆయన స్పృశించని జానర్ అంటూ లేదేమో! ఇప్పుడు 94 ఏళ్ల వయసులోనూ కొత్తతరం ప్రేక్షకుల్ని అలరించేందుకు మరోసారి మెగాఫోన్ చేతపట్టి ‘సింగ్ గీతం’ తీశారు. నాగ్ అశ్విన్ నిర్మాణ సారథ్యంలో మ్యూజికల్ ఫాంటసీ కథగా రూపొందిన ఈ ప్రయోగం ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతినిచ్చింది?
Sing Geetham Movie story || ఒకప్పుడు పచ్చని అడవులతో అలరారిన కుబేరపురం అనే ఊరు అది. తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన భూములు అక్కడ ఉన్నాయని తెలుసుకుని వస్తాడు ప్రతాప్ (అయాన్). అవి మామూలు భూములు కాదని, బంగారు గనులున్న భూములని ఆ తర్వాత అని తెలుస్తుంది. ఊరంతా బంగారం గనులే తవ్వుతుంటారు. వాటిని సొమ్ము చేసుకుని వెళ్లిపోదామనుకునే క్రమంలోనే కొంతమంది అత్యాశతో ఆ ఊళ్లో మిగిలిపోయిన చిట్ట చివరి చెట్టుని కూడా నరికేస్తారు. ఆ చెట్టులో తన తల్లిని చూసుకుంటుంది గౌరి (అహల్య). ఆ చెట్టు నేలకూలాక ఊరంతటినీ ఓ శాపం చుట్టు ముడుతుంది. ఎవ్వరి నోటి నుంచీ మాట రాదు, కేవలం పాటే వస్తుంది. మాటల్ని పాటలుగా పాడుకోలేక ఇబ్బంది పడుతుంటారు. మరి ఆ శాపం నుంచి ఊరికి విముక్తి లభించిందా లేదా?మనుషుల్లోని అత్యాశ ఆ ఊరిని ఎన్ని రకాల ఇబ్బందులకు గురిచేసింది? తదితర విషయాల్ని తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
Sing Geetham Movie Review || దర్శకుడు సింగీతం సినిమాలు కాలంతో పోటీపడుతుంటాయి. ఆ విషయాన్ని మరోమారు రుజువు చేస్తుందీ చిత్రం. ఆయన నలభయ్యేళ్ల కిందట రాసుకున్న కథ ఇది. మనుషుల్లోని స్వార్థం, ఆశ ఎంత తీవ్రంగా ఉంటాయో చాటే ఈ కథలో ఇన్నేళ్లయినా నవ్యత కొంచెం కూడా తగ్గలేదు. పైపెచ్చు ఇప్పుడు తప్పక చెప్పాల్సిన కథ అనిపిస్తుంది. ఇలాంటి ఓ అంశాన్ని మ్యూజికల్ ఫాంటసీ జోనర్లో తెరపైకి తీసుకురావాలన్న ఆలోచన, మాటలకు బదులుగా పాటలు వినిపిస్తూ భావోద్వేగాల్ని పండించాలన్న ప్రయత్నం అచ్చంగా సింగీతం మేజిక్. కుబేరపురం అనే ఊరు చూపించడం దగ్గర్నుంచే ప్రేక్షకుడిని ఆ కథా ప్రపంచంలో లీనం చేశాడు దర్శకుడు. ఇందులో ప్రతి మాట పాటగానే వస్తుందా అంటే, అదేమీ లేదు. ఆరంభ సన్నివేశాలు మామూలుగానే ఉంటాయి. ప్రతాప్ జైలు నుంచి కుబేరపురం రావడం, ఆ ఊరు, పాత్రల పరిచయం, అక్కడ జరిగే మైనింగ్ వ్యవహారాల నేపథ్యమంతా ఓ సాధారణ సినిమాలాగే ఉంటుంది. ఊరికి శాపం తగలడం నుంచే మాటలు పాటలుగా మారిపోతుంటాయి. ఏమైంది పాటతో మొదలయ్యే ఆ సందడి ప్రారంభంలో సరదాగానే అనిపిస్తుంది. కానీ, క్రమంగా ప్రతీ మాట పాటగానే వినిపించడంతో కథ నుంచి ఉన్నట్టుండి బయటికొచ్చేసి వాళ్ల మాట, పాటపై దృష్టి పెట్టాల్సి వస్తుంటుంది. ఒక దశలో ఈ మాటల పాటలు ఇక ఆగవా అనిపిస్తుంది.
ద్వితీయార్ధంతో మళ్లీ ఆటని మార్చేశాడు దర్శకుడు. కథ చెప్పడంపై దృష్టిపెట్టారు. సినిమాలోని అసలు కథంతా ఇక్కడే ఉందనే భావన కలుగుతుంది. ముఖ్యంగా ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ సినిమాకి ప్రాణం. భావోద్వేగాలు మనసుల్ని కదిలిస్తాయి. ఆ సన్నివేశాల చిత్రణ కూడా సినిమాకి హైలైట్. ఆ తర్వాత ప్రతాప్ మారిపోవడం, తన ఆస్తిపై ఓ కీలకమైన నిర్ణయం తీసుకోవడం, ఆ తర్వాత కథలో వచ్చే మరో మలుపుతో మంచి డ్రామా ఉంది. మనుషుల్లోని స్వార్థం గురించి మరింత బలంగా చెప్పే సన్నివేశాలవి. ఆ సన్నివేశాలపై దర్శకుడు బలమైన పట్టుని ప్రదర్శించారు. దాంతో సినిమా మనసుల్ని హత్తుకుంటుంది. ఇక పతాక సన్నివేశాల్లో నాగ్ అశ్విన్‌కి (Nag Ashwin) అచ్చొచ్చిన హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) మెరుపు సినిమాకి మరో ఆకర్షణ. విజయ్ కనిపించడంతో ఈ సినిమా (Sing Geetham Movie)కి కొనసాగింపు ఉంటుందేమో అని ఫిక్స్ అయిపోతాం. మరి కొనసాగింపునకు తగ్గట్టుగానే కథ ముగిసిందా? లేదా? అనేది మాత్రం తెరపైనే చూడాలి.
తెలుగు సినిమా పరిశ్రమకు ఆయన భీష్మాచార్యుడు: సింగ్ గీతంపై చిరు పోస్ట్
Sing Geetham Movie Cast and Crew || నటీనటులు సినిమాపై బలమైన ప్రభావం చూపించారు. అయాన్, అహల్య, షాలిని ఈ ముగ్గురూ ఆయా పాత్రల్లో ఒదిగిపోయారు. చెట్టుని అమ్మలా చూసుకునే గౌరి పాత్రకు తగ్గ అమాయకత్వం అహల్యలో బలంగా పలికింది. అయాన్, షాలిని వ్యతిరేక ఛాయలతో కనిపించి, ఆ తర్వాత మారిపోయే పాత్రల్లో బాగా నటించారు. వాళ్ల మాటల పాటలన్నీ వాళ్లే పాడుకుంటూ సందడి చేశారు. రాహుల్ రవీంద్రన్, నివేదా పేతురాజ్ చిన్న పాత్రల్లోనే మెరిసినా, వాళ్లిద్దరి ఎపిసోడ్ సినిమాకి ఆయువుపట్టు. ముఖ్యంగా నివేదాని చూపించిన తీరు, ఆమె పాత్ర డిజైన్ చాలా బాగుంది. సీనియర్ నటి తులసి పోషించిన పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. అనుదీప్, విజయ్ దేవరకొండ అతిథి పాత్రల్లో సందడి చేస్తారు.
నాగ్ అశ్విన్ సినిమా కంటే నన్నే ఎక్కువ ప్రేమిస్తారు: సింగీతం
సాంకేతిక విభాగాల్లో దేవిశ్రీప్రసాద్ (Devi Sri Prasad) సంగీతానికి ఎక్కువ మార్కులు పడతాయి. సంగీత ప్రధానమైన ఈ సినిమాలో ఆయన మాటని పాటగా ట్యూన్ కట్టిన తీరు, నేపథ్య సంగీతం సినిమాకి ప్రధాన ఆకర్షణ. ఇందులోని పాటలూ వెంటాడేలా ఉన్నాయి. దేవి కెరీర్లో ఇదొక ప్రత్యేకమైన సినిమాగా నిలుస్తుంది. విజువల్స్ ఆకట్టుకుంటాయి. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా సంస్థలు దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుకు ఇచ్చిన ఓ గొప్ప గౌరవం ఈ చిత్రం. తొమ్మిది పదుల వయసులో సినిమా తీయడమే ఓ పెద్ద సాహసం. అలాంటిది తన మార్క్ వైవిధ్యమైన సినిమాని ప్రేక్షకులకు అందించాలన్న సింగీతం శ్రీనివాసరావు (Sing Geetham Movie Director) ప్రయత్నం గొప్పది. అందుకే ఆయన దిగ్గజ దర్శకుడు అయ్యారు. కొత్త తరహా కాన్సెప్ట్‌కి తోడు, బలమైన సందేశంతో రూపొందిన ఈ సినిమా నిస్సందేహంగా ప్రత్యేకమైన అనుభూతిని పంచుతుంది.
సాంకేతిక బృందం: సంగీతం: దేవి శ్రీ ప్రసాద్; సినిమాటోగ్రఫీ: అంకుర్.సి; రచన: సింగీతం శ్రీనివాసరావు, గౌతమి చల్లగుల్లా, శశాంక్, శ్రీకర్, నంద కిషోర్ ఈమని, రాహుల్ వి రాజేశ్వర్; ప్రొడక్షన్ డిజైన్: అరవింద్ మ్యూల్; సంస్థ: వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.